Telangana BJP: తెలంగాణలో బీజేపీ వేగం తగ్గిందా? ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనా?
Telangana BJP: తెలంగాణలో బీజేపీ వేగం తగ్గిందా? ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనా?
2024 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఏకంగా 8 ఎంపీ సీట్లు సాధించిన బిజెపి ఆ తర్వాత అదే స్థాయిలో పుంజుకుంటుందని అంతా భావించారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పరిస్థితి మిగిలిపోయింది అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర రావు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బిజెపి పరిస్థితి ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువగా ముదిరిపోతున్నాయని గతంలో బిజెపిలో ఈ తరహా విభేదాలు లేవని ఇప్పుడు మాత్రం బయట నుంచి వచ్చిన నేతలు ఇంట్లో ఉన్న నేతల మధ్య గొడవలు అన్న చందంగా పరిస్థితి మారింది అని సన్నిహిత వర్గాలు సైతం చర్చించుకుంటున్నాయి.
దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన సొంత నాయకులు, కేడర్ ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలను అంగీకరించలేకపోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం, భారత రాష్ట్ర సమితి నుంచి వచ్చిన నేతలు బిజెపి కల్చర్ లో ఇమడలేక పోతున్నారు. అంతేకాదు బిజెపికి అలవాటు లేని కల్చర్‌ను పరిచయం చేయడం వల్ల కింది స్థాయి కేడర్‌లో పాతతరం నుంచి బిజెపిలో కొనసాగుతూ వస్తున్న వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు తమ పాత పార్టీలో ఉన్నటువంటి రాజకీయాలను బిజెపిలో కూడా ప్రవేశపెట్టడం వల్ల ఈ తరహా పరిణామాలు చోటుచేసుకున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక కేంద్ర నాయకత్వం కూడా ఇన్ ఛార్జ్‌లను ఎన్నిసార్లు మార్చినా, సీనియర్ నేతల మధ్య గ్రూపు తగాదాలు కొలిక్కి రాలేదు. పాత నేతలు ఒకవైపు, కొత్తగా వచ్చిన వలస నేతలు మరోవైపు సైలెంట్ వార్ నడుపుతుండటం వల్ల పార్టీ గ్రాఫ్ దెబ్బతింటోంది.
ఇక తాజాగా వచ్చిన ఇన్చార్జ్ అభయ్ సింగ్ పార్టీలోకి వలసలను ప్రోత్సహించడం గమనార్హం. అయితే ఆయన కూడా వలసల విషయంలో “ముహూర్తాలు, శ్రావణ మాసాలు” అంటూ ప్రచారం చేసుకోవడం, కేవలం ప్రత్యర్థుల్లో అయోమయం సృష్టించే ‘పోస్టర్ స్ట్రాటజీ’యే తప్ప, నిజంగా అగ్రనేతలు క్యూ కడుతున్న దాఖలాలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల గెలుపు ఓటు బ్యాంకుగా మారుతుందా..?:
2024 లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచినా, అది కేవలం నరేంద్ర మోదీ ఇమేజ్ వల్ల వచ్చిన ఓట్లే తప్ప… స్థానిక అసెంబ్లీ స్థానాల్లో బీజేపీని గెలిపించే స్థాయి సంస్థాగత బలం లేదనేది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. గతంలో ‘ఆపరేషన్ ఆకర్ష్’ కింద కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన అనేక మంది కీలక నేతలకు తగిన గుర్తింపు లభించక, వారు సైలెంట్ అవ్వడమో లేదా తిరిగి సొంత గూటికి వెళ్లడమో జరిగింది. ఇది కొత్తగా రావాలనుకునే వారికి హెచ్చరికగా మారింది.
బీజేపీ ప్రభావం కేవలం ఉత్తర తెలంగాణ లేదా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాలకే పరిమితమైంది. దక్షిణ తెలంగాణ (నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్) జిల్లాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం ఇప్పటికీ చాలా బలహీనంగా ఉంది. కాంగ్రెస్ వైఫల్యాలు లేదా బీఆర్ఎస్ బలహీనతలను ఎత్తిచూపడం తప్ప, “తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం” అనే స్పష్టమైన విజన్ ప్రజలకు వివరించడంలో బీజేపీ విఫలమవుతోంది. క్షేత్రస్థాయిలో రైతులు, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం ప్రజాపోరాటాలు చేయకుండా, కేవలం హైదరాబాద్ మీడియా ప్రకటనలకే పరిమితమవ్వడం క్యాడర్లో నిరాశను నింపుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న వేళ… బీఆర్ఎస్ను టార్గెట్ చేయడం వల్ల లాభమా, కాంగ్రెస్‌ను ఎదిరించడం వల్ల లాభమా అనే విషయంలో పార్టీ నేతల మధ్య ఇప్పటికీ స్పష్టమైన పొలిటికల్ రోడ్‌మ్యాప్ లేకపోవడం కూడా కన్ఫ్యూజన్ కు కారణం అవుతోంది.