విద్యకు బొట్టు పెట్టాలా?
Students
ఆయిరబోయిన బిక్షపతి(అగల్జోయా)
కేంద్రమంత్రి బండి సంజయ్ఇటీవల చేసిన వ్యాఖ్య రాజకీయ చర్చకు దారితీసింది. భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాఠశాలల్లో చదివే అమ్మాయిలకు బొట్టు, గాజులు తప్పనిసరి చేస్తామని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి. సహజంగానే దీనిపై అనుకూల, ప్రతికూల స్పందనలు వచ్చాయి. కానీ ఈ చర్చను కేవలం బొట్టు అనుకూలం, వ్యతిరేకం అనే స్థాయిలో అర్థం చేసుకోవడం సరిపోదు. ఎందుకంటే ఇక్కడ అసలు ప్రశ్న బొట్టు గురించి కాదు. విద్యా వ్యవస్థపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న ఈ సమయంలో ఒక రాజకీయ దృక్పథానికి ముందుగా బొట్టు ఎందుకు గుర్తుకు వచ్చింది అనేది. పదాలు యాదృచ్ఛికంగా బయటపడవచ్చు. కానీ ప్రతీకలు యాదృచ్ఛికంగా పుట్టవు. ఎందుకంటే అవి మాటలకంటే లోతుగా పనిచేసే ఒక భావజాలపు మానసిక వేలిముద్రలు.. ఈ వ్యాఖ్యలను కేవలం బండి సంజయ్వ్యక్తిగత అభిప్రాయంగా చూడలేం. తెలంగాణ రాజకీయాల ప్రస్తుత నేపథ్యంలో ఈ వ్యాఖ్యకు మరో అర్థం కూడా కనిపిస్తుంది. జిహెచ్ఎంసి ఎన్నికల వాతావరణం, సామాజిక సమీకరణల కోసం జరగబోయే పోటీ, సాంస్కృతిక గుర్తింపుల చుట్టూ రాజకీయ చర్చలను నిర్మించే ప్రయత్నాలు, ఇవన్నీ ఈ వ్యాఖ్యను ఒక రాజకీయ సంకేతంగా చదవాలని సూచిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయాలు కేవలం అధికారాన్నీ గెలుచుకోవడానికి మాత్రమే పోరాడవు. ఒక సామూహిక రాజకీయ ప్రతీకాత్మను నిర్మించడానికి కూడా పోరాడుతాయి. ప్రతి రాజకీయ భావజాలం తన అనుచరులను ఒక నిర్దిష్ట గుర్తింపు చుట్టూ సమీకరిస్తుంది. అందుకే ఆ రాజకీయ సమీకరణకు కొన్ని ప్రతీకలు అవసరం అవుతాయి. రాజకీయ మనోవిజ్ఞాన శాస్త్రం ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతుంది. సమస్యలు మనుషులను ఆలోచింపజేస్తాయి. ప్రతీకలు ప్రజలను సమీకరిస్తాయి.
పాఠశాల అనేది కేవలం విద్యాసంస్థ కాదు. సమాజం తన భవిష్యత్తును నిలువచేసే మానసిక గిడ్డంగి. నేటి పిల్లల మనసుల్లో నాటిన ఊహలే రేపటి రాజకీయ, సాంస్కృతిగా, సామాజిక విలువలుగా, పౌర చైతన్యంగా రూపాంతరం చెందుతాయి. అందువల్ల విద్య గురించి జరిగే ప్రతి చర్చ వాస్తవానికి భవిష్యత్తు గురించి జరిగే చర్చే. ఇక్కడే విద్యపై రెండు తత్వాలు ఎదురుగా నిలుస్తాయి. విద్య ఒక్క పిల్లవాడిని ప్రపంచానికి మరింత తెరువాలా? లేక ఒక నిర్దిష్ట గుర్తింపులో మరింత బలంగా నిలబెట్టాలా? గొప్ప విద్య సమాధానాలను బోధించదు. ప్రశ్నలను పుట్టిస్తుంది. విధేయతను తయారు చేయదు. స్వతంత్ర ఆలోచనను పెంచుతుంది. ఎందుకంటే విద్య యొక్క అసలు లక్ష్యం ఒక సిద్ధమైన ప్రపంచాన్ని అంగీకరించడం కాదు. ప్రపంచాన్ని కొత్తగా చూడగలిగే మానసిక స్వేచ్ఛను కల్పించడం. పిల్లల నుదుటిపై ఏమి ఉండాలి అనే ప్రశ్న అడిగే ముందు వారి మనసులో ఏమి ఉండాలి అనే ప్రశ్న అడగాలి. ఎందుకంటే ఒక సమాజం యొక్క భవిష్యత్తును నిర్ణయించేది బాహ్య గుర్తింపులు కావు. అంతర్గత చైతన్యం. నుదుటిపై కనిపించేది సంస్కృతి కావచ్చు. కానీ మనసులో పెరిగేది వ్యక్తిత్వం. విద్య యొక్క అసలు ఒక మనిషిని నిర్మించడం. అందుకే ఈ చర్చ చివరికి బొట్టు, గాజుల గురించి కాదు. విద్యకు సంబంధించిన అసలు ప్రశ్నల నుంచి ప్రజల దృష్టిని ఏ వైపుకు మళ్లిస్తున్నారు అనేదాని గురించి. ఒక సమాజం తన పిల్లలకు ఏమి ధరించాలో చెప్పడం సులభం. కానీ ఎలా ఆలోచించాలో నేర్పడమే విద్య యొక్క అసలు బాధ్యత. అందుకే చరిత్ర చివరికి మనుషులు ఏమి ధరించారు అని కాదు. వారు ఎలా ఆలోచించారు అని గుర్తుంచుకుంటుంది.