BTech Gold Medallist Dies: బీటెక్ గోల్డ్ మెడలిస్ట్.. 50 సార్లు ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య.. సమాజం ఎటు పోతోంది అసలు..
BTech Gold Medallist's Death Sparks Conversation on Career Stress and Government Exams
BTech Gold Medallist Dies: బంగారు పతకంతో భావి భారతాన్ని ఏలాల్సిన ఒక ఉజ్జ్వల భవిష్యత్తు.. కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్న నిరాశతో ఉరితాడుకు బలవుతుంటే ఈ సమాజం ఎటు వైపు వెళ్తోందనే ప్రశ్న ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 23 ఏళ్ల బీటెక్ టాపర్ ఆనంద్ కుమార్, తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయానని, తండ్రి ఆశలను నిలబెట్టలేకపోయానని సారీ డాడీ అంటూ క్షమాపణలు చెబుతూ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం హృదయాలను పిండేస్తోంది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. 2024లో ప్రాణ్‌వీర్ సింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (PSIT) నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో కళాశాల టాపర్‌గా నిలిచి, రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు ఆనంద్. స్వయంగా రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్న ఆ విద్యార్థి.. జీవితంలో ఎదురైన ఒక చిన్న ఎదురుదెబ్బకు ఈ స్థాయిలో విరిగిపోతాడని ఎవరూ ఊహించలేదు. కుటుంబ సభ్యులు అన్నయ్య పెళ్లి సంబంధం మాట్లాడేందుకు స్వగ్రామానికి వెళ్లిన సమయంలో.. ఇంట్లోని గదిలో అతను తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.
నాన్న నన్ను క్షమించు, ప్రభుత్వ ఉద్యోగం కోసం 50 సార్లు ప్రయత్నించాను కానీ సఫలం కాలేకపోయాను అని అతను రాసిన ఐదు లైన్ల డెత్ నోట్, నేటి యువతపై ఉన్న తీవ్రమైన మానసిక ఒత్తిడికి నిదర్శనం. పవర్ గ్రిడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి.. రైల్వేస్, SSC, బ్యాంకింగ్ వంటి ఎన్నో పోటీ పరీక్షలు రాసిన ఆనంద్, ఆశించిన ఫలితం రాకపోవడంతో తీవ్రమైన నిరాశలోకి జారుకున్నాడు.
అయితే, ఇక్కడ ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సిన తీవ్రమైన ప్రశ్న ఒకటి ఉంది — అలా చేయడం నిజంగా సరైనదేనా..
కష్టపడి చదివిన చదువు, పట్టు సాధించిన విద్య, సాధించిన గోల్డ్ మెడల్… ఇవేవీ ఒక ప్రభుత్వ ఉద్యోగానికి తక్కువ కావు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం జీవితంలో ఒక భాగం మాత్రమే కావచ్చు కానీ, అదే మొత్తం జీవితం కాజాలదు. 50 సార్లు విఫలమయ్యాడంటే అతనిలో ఉన్న పట్టుదల, శ్రమించే తత్వం ఎంత గొప్పవో అర్థమవుతోంది. కానీ, ఆ శ్రమను మరో ప్రత్యామ్నాయ మార్గం వైపు మళ్లించే ఓపికను, సమయాన్ని తనకు తాను ఇచ్చుకోకపోవడమే ఇక్కడ జరిగిన అతిపెద్ద విషాదం.
వైఫల్యం అనేది ఒక ఘట్టం మాత్రమే. జీవితానికి ముగింపు కానే కాదు. ప్రైవేట్ రంగంలోనూ, పరిశోధనల్లోనూ, లేదా స్వయం ఉపాధిలోనూ అద్భుతాలు సృష్టించగలిగే అనంతమైన సామర్థ్యం ఉన్న ఒక గోల్డ్ మెడలిస్ట్.. ఒక్క ఉద్యోగం రాలేదన్న కారణంతో తన ప్రాణాలనే మూల్యాంకనం చేసుకోవడం ఎంతవరకు సమంజసం? కన్నవారికి కడుపుకోత మిగిల్చి, కనుమరుగైపోవడం ఏ సమస్యకూ పరిష్కారం చూపదు.
ఈ సంఘటన నేటి తరానికి ఒక హెచ్చరిక. పరీక్షల్లో మార్కులు, ఉద్యోగాల్లో ర్యాంకులు మాత్రమే జీవితాన్ని నిర్ణయించవు. ఓటమిని కూడా చిరునవ్వుతో స్వీకరించి, మరో మార్గం చూసుకుందాం అనే ఆశావాద దృక్పథమే మనిషిని నిలబెడుతుంది. బంగారు భవిష్యత్తు ఉన్న యువత, మానసిక ఒత్తిడికి తలొగ్గి ప్రాణాలను బలితీసుకోవడం సమాజానికి తీరని లోటు. ఎంతటి క్లిష్ట సమయంలోనైనా జీవితాన్ని ప్రేమించడం, కష్టాలను ఎదుర్కొని నిలబడటమే నిజమైన గెలుపు!
గమనిక: ఆత్మహత్య అనేది దేనికీ పరిష్కారం కాదు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే మానసిక నిపుణులను లేదా హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించండి. మీకు లేదా మీకు తెలిసిన వారికి సహాయం కావాలంటే ఈ క్రింది ఉచిత హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించవచ్చు:
టెలి-మానస్ (Tele-MANAS – కేంద్ర ప్రభుత్వం): 14416 లేదా 1800 891 4416
స్నేహ (Sneha Helpline): 044-24640050 (24×7)
వంద్రివాలా ఫౌండేషన్ (Vandrevala Foundation): 9999 666 555
కిరణ్ (Kiran – కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ): 1800-599-0019