Skip to content
జాతీయం వార్తలు

Student Protest Row: విద్యాశాఖ మంత్రికి రాజీనామా లేఖ ఎలా రాయాలో తెలియదు.. ధర్మేంద్ర ప్రధాన్‌పై మండిపడిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా

Prajapaksham 21 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Student Protest Row: విద్యాశాఖ మంత్రికి రాజీనామా లేఖ ఎలా రాయాలో తెలియదు.. ధర్మేంద్ర ప్రధాన్‌పై మండిపడిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా

Student Protest Row: విద్యాశాఖ మంత్రికి రాజీనామా లేఖ ఎలా రాయాలో తెలియదు.. ధర్మేంద్ర ప్రధాన్‌పై మండిపడిన కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా

Student Protest Row: ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యాశాఖ మంత్రికి బహుశా రాజీనామా లేఖ ఎలా రాయాలో తెలియదేమో అని ఎద్దేవా చేస్తూ.. ఆర్ఎస్ఎస్ కేవలం దయ కోసం వినతులు ఎలా రాయాలో మాత్రమే నేర్పుతుందంటూ ఆమె ‘X’ (ట్విట్టర్) వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నీట్ పరీక్షల్లో అక్రమాలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, విద్యాశాఖ మంత్రి రాజీనామాను కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ-CJP ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 20న ప్రారంభమైన నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో భాగంగా సోమవారం పార్లమెంట్ వైపు సాగిన సంసద్ చలో మార్చ్‌ను పోలీసులు అడ్డుకుని లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఈ క్రమంలో పోలీసు అధికారుల చేతిలో గాయపడిన మహిళా నిరసనకారులకు.. మద్దతుదారులకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే క్షమాపణలు చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను రక్షించడం కోసమే ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగిస్తోందని.. 20 మందికి పైగా విద్యార్థుల మరణాలకు విద్యాశాఖ మంత్రే బాధ్యుడని ఆయన ఆరోపించారు.

మరోవైపు కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 24వ రోజుకు చేరుకుంది. జూలై 18న ఢిల్లీ పోలీసులు ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆయన ఆసుపత్రి నుంచే తన దీక్షను కొనసాగిస్తున్నారు. భద్రతా సిబ్బంది ఆంక్షలు, టెంట్ల తొలగింపు, భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వాలంటీర్లు జంతర్ మంతర్ వద్ద వేదికను శుభ్రం చేసుకుంటూ తమ ఆందోళనను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.