Skip to content
జాతీయం వార్తలు

లౌకిక రాజ్యాంగాన్ని మార్చేందుకే డీలిమిటేషన్‌

Prajapaksham 21 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
లౌకిక రాజ్యాంగాన్ని మార్చేందుకే డీలిమిటేషన్‌

Delimitation is aimed at changing the secular Constitution.

ఉత్తర భారతదేశ జనాభా పరిమాణం, హిందీ- మెజారిటీ, హిందూ మెజారిటీని ఏకం చేయటం, ‘హిందీ అనే ఏకీకృత సాంస్కృతిక గుర్తింపును ముందుకు తీసుకెళ్లడం వంటి ఆర్‌ఎస్‌ఎస్‌ సైద్ధాంతిక లక్ష్యం ప్రచారానికి, 2014 నుండి బిజెపి ఎన్నికల ఆధిపత్యానికి దోహదపడింది. భారత రాజ్యాంగంలోని లౌకిక, సామ్యవాద పునాదులను మార్చాలనే లక్ష్యంగా పెట్టుకోగా, భారతదేశ ప్రాథమిక స్వరూపాన్ని, గుర్తింపును, హిందూ దేశ (రాష్ట్రం)గా మార్చడానికి ‘నియోజకవర్గాల పునర్విభజన’ను తొలి రాజ్యాంగపరమైన అడుగుగా ఉపయోగించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తోంది.
రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మరోసారి ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్‌ బిల్లు, ఆర్‌ఎస్‌ఎస్‌/బిజెపి శిబిరం విభజన రాజకీయాలలో ఒక ముఖ్యమైన భాగం. పార్లమెంటు స్వరూపాన్ని, పార్లమెంటరీ వ్యవస్థను శాశ్వతంగా మార్చి, పార్లమెంటరీ బలాన్ని హిందీ మాట్లాడే ఉత్తరాది ప్రాంతాల వైపు, ముఖ్యంగా హిందుత్వ కాషాయ రాజకీయాలను విశ్వసించే వారి వైపు నిర్ణయాత్మకంగా మళ్లించడానికి ఇది తయారుచేయబడింది. పార్లమెంటరీ వ్యవస్థలో సమూలమైన మార్పు లు తీసుకురానంత వరకు, భారతదేశాన్ని అధికారికంగా హిందూ దేశంగా ప్రకటించే దిశగా మార్చాలనే తమ లక్ష్యాన్ని సాధించలేమనే వాస్తవం కాషాయ వర్గానికి బాగా తెలుసు.
భారతదేశ జనాభా 1971లో 55 కోట్ల నుండి 2026 నాటికి సుమారు 146 కోట్లకు పెరిగింది. ఈ భారీ జనాభా మార్పులకు అనుగుణంగా ఎన్నికల పటాన్ని నవీకరించడానికే పునర్విభజనను రూపొందించారు. పునర్విభజన ఒక చట్టపరమైన విధి అయినప్పటికీ, ఇది వివిధ కారణాల వల్ల తీవ్ర వివాదాస్పదంగా ఉంది. మొదటిది, ఉత్తర, దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం. ఉత్తర రాష్ట్రాలు (ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ వంటివి) అధిక జనాభా పెరుగుదలను చూశాయి. ప్రస్తుత జనాభా ఆధారంగా సీట్లను పునఃసర్దుబాటు చేయడం వల్ల పార్లమెంటులో వారి ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుందని, అదే సమయంలో కుటుం బ నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణ రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. లోక్‌సభ మొత్తం సామర్థ్యాన్ని (850 సీట్ల వరకు) విస్తరించడానికి మోదీ పునర్విభజన బిల్లును, రాజ్యాంగ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ విస్తరణ లక్ష్యం, దక్షిణ రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యను స్థిరంగా ఉంచుతూ, కొత్తగా కేటాయించిన సీట్లను ఉత్తర రాష్ట్రాలకు
కల్పించడం.
భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు కాషాయ వర్గం బహిరంగంగా ఎన్నడూ అంగీకరించనప్పటికీ, భారతదేశాన్ని పాలించాలంటే ఉత్తర భారతదేశం తమ అదుపులో ఉండాలనే స్పష్టమైన భావనను అది పెంచుకుంటోంది. ఇది తమ ప్రస్తుత పార్లమెంటరీ బలంతో దక్షిణ భారతదేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలు బలమైన శక్తిగా ఎదగలేవనే వాస్తవాన్ని కూడా అంగీకరించడమే. ఒక నిర్దిష్ట ప్రాంతంలో బలమైన పునాది వేసుకోవాలంటే, ఆ రాజకీయ పార్టీ ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలను, కోరికలను గ్రహించాలి. ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ లక్ష్యాన్ని ఎప్పటికీ సాధించలేదు. అది ఇప్పటికే హిందీ మాట్లాడే హిందువుల పార్టీగా గుర్తింపు పొందింది. దశాబ్దాలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ దక్షిణ భారతదేశంలో చురుకుగా ఉంటూ, భారీ సంఖ్యలో కార్యకర్తలను చేర్చుకున్నప్పటికీ, బిజెపికి బలమైన ఎన్నికల పునాదిని సృష్టించడంలో ఇప్పటివరకు విజయం సాధించలేదు.
కర్ణాటకలో బి.ఎస్‌. యడియూరప్ప నాయకత్వంలో బిజెపి అధికారంలోకి రావడాన్ని, ఆ రాష్ట్రంలో దానికి బలమైన పట్టు ఉన్నట్లుగా భావించకూడదు. ఒక్కలి, లింగాయత్‌ వర్గాల మధ్య ఉన్న వైరుధ్య సంబంధాలను ఆసరాగా చేసుకుని బిజెపి అధికారంలోకి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, ఆ సంస్థలో రెండవ అత్యున్నత అధికారి అయిన దత్తాత్రేయ హోసబాలె కర్ణాటకకు చెందినవారైనప్పటికీ, ఆ రాష్ట్రం అనేకమంది ప్రముఖ బిజెపి నాయకులను అందించినప్పటికీ, ఆ రాష్ట్రంలో హిందుత్వ రాజకీయాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయన్నది వాస్తవం. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కాషాయ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, అది ఈ ప్రాంత ప్రజలతో మమేకం కాలేకపోయింది.
దామాషా పద్ధతిలో నియోజకవర్గాల పునర్విభజన, లోక్‌సభలో దక్షిణ రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని, వాణిని తగ్గిస్తుంది. తద్వారా వాటిని శక్తిహీనంగా, రాజకీయంగా ప్రాముఖ్యత లేనివిగా మార్చే అవ కాశం ఉంది. డీలిమిటేషన్‌ ప్రక్రియ అన్ని రాష్ట్రాలకు దామాషా ప్రకారం సీట్లు పెంచుతుందని (సుమారు 50శాతం), సాపేక్షికంగా దామాషా కాపాడబడుతుందని, ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదనే వాదన అర్థ
రహితం. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌ సీట్లు 80 నుంచి 120కి పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి సంఖ్యాబలం పార్లమెంటులో తగ్గుతుంది.
2026 ఏప్రిల్‌లో మోదీ, బిజెపి ప్రవేశపెట్టిన డీలిమిటేషన్‌ బిల్లు, పార్లమెంటరీ సీట్ల కేటాయింపుపై 50 ఏళ్లుగా ఉన్న స్తంభనను అంతం చేయడానికి రూపొందించిన భారతదేశ ఎన్నికల పటం నిర్మాణాత్మక పునర్వ్యవస్థీకరణ. ఈ బిల్లు లోక్‌సభ గరిష్ట సభ్యుల సంఖ్యను 543 నుండి 850కి పెంచాలని ప్రతిపాదిస్తుంది. ఈ విస్తరణను, 33% మహిళా రిజర్వేషన్‌ కోటా అమలుతో వ్యూహాత్మకంగా జత చేశారు. భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం కోసం, హిందూ జనాభా ను పెంచాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నిరంతరం నొక్కి చెబుతోందన్నది ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భాగవత్‌, ముగ్గురు సంతానం విధానాన్ని గట్టిగా సమర్థించారు. జనాభా సమతుల్యతను కాపాడటానికి, సామాజిక పతనాన్ని నివారించడానికి ప్రతి భారతీయ కుటుంబానికి ముగ్గురు పిల్లలు ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిస్తున్నది.
సంఘ్‌ ప్రాథమిక లక్ష్యం హిందువుల సంఖ్యను పెంచడమే అయినప్పటికీ, వాస్తవానికి దేశవ్యాప్తంగా పట్టణ మధ్యతరగతి హిందువులు కుటుంబ నియంత్రణను పాటిస్తున్నారు. చాలామంది గరిష్టంగా ఒకరు లేదా ఇద్దరు పిల్లలను కనడానికే ఇష్టపడుతున్నారు. కానీ, సామాజిక స్థిరత్వాన్ని కాపాడటానికి ఒక కుటుంబానికి ముగ్గురు పిల్లలు అవసరమని భాగవత్‌ వాదిస్తున్నారు.
అయితే, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనడానికి అన్ని వర్గాల హిందువులు విముఖత చూపడం, ఆర్‌ఎస్‌ఎస్‌/బిజెపి మోదీలను నియోజకవర్గా ల పునర్విభజన మార్గాన్ని ఎంచుకునే లా చేసింది. ఇది ఉత్తర భారతదేశంలోని హిందూ జనాభాను రాజకీయం గా బలోపేతం చేయడానికి ఒక పరోక్ష యంత్రాం గం. నియోజకవర్గాల పునర్విభజన చట్టం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి పార్లమెంటుపై పూర్తి ఎన్నికల నియంత్రణను సాధించగలిగితే, వారిని ఎన్నికల ద్వారా తొలగించడం దాదాపు అసాధ్యం. మోదీ ప్రభుత్వం ప్రాంతీయ వైవిధ్యాన్ని, దక్షిణాది ప్రాబల్యాన్ని అధిగమించడానికి రాజ్యాంగ సరిహద్దులను దుర్వినియోగం చేయాలని చూస్తోంది. గత లోక్‌సభ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఓడిపోయిన తర్వాత, మోదీ, కాషాయ కూటమి మూడింట రెండు వంతుల మెజారిటీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రతిపక్ష శ్రేణులలో చీలిక సృష్టించడానికి బిజెపి ఇటీవల తీసుకున్న చర్య కూడా ఈ మొత్తం పథకంలో భాగమే. బెంగాల్‌లో బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ, అమిత్‌ షా టిఎంసి పార్లమెంటరీ పార్టీని చీల్చారు. ఈ పార్లమెంటరీ చీలిక కారణంగా రాష్ట్రంలో పాలనపై ఎలాంటి ప్రభావం ఉండదు. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ సంఖ్యాబలాన్ని పటిష్టం చేసుకునేందుకు ఇది ఒక ఎత్తుగడ. ప్రతిపక్ష పార్టీల నుండి ఇటీవల జరిగిన ఫిరాయింపులు పార్లమెంటులో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ బలాన్ని మెరుగుపరిచాయి. వారి అసలు ఉద్దేశం భారత రాజ్యాంగాన్ని మార్చడమే. 400 సీట్లు దాటడం వెనుక ఉన్న ఉద్దేశ్యం రాజ్యాంగాన్ని మార్చ గలిగిన స్థితిలో ఉండటమే. బెంగాల్‌లోని టిఎంసి, మహారాష్ట్రలోని శివసేన (యుబిటి)లను వీడిన ఎంపిల ఇటీవలి ఫిరాయింపులు, మిత్రపక్షాల మద్దతుతో ఎన్‌డిఎ బలం 300 మార్కును దాటింది. కానీ ఇది ఇప్పటికీ మూడింట రెండు వంతుల కచ్చితమైన మెజారిటీకి తక్కువే. రాజ్యసభ కూడా ఇలాంటి సవాలునే విసురుతోంది. దీంతో ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష ఎంపిలు ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశం ప్రభుత్వ బిల్లు ఆమోదానికి కీలకంగా మారింది.

ట్యాగ్‌లు: Amit Shah delimitation Modi