Skip to content
జాతీయం వార్తలు

Rahul Gandhi Slams PM Modi: మోదీ దేశ చరిత్రలోనే అత్యంత యువత వ్యతిరేక ప్రధాని.. రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు.. న్యాయం అడిగితే లాఠీ దెబ్బలా అని మండిపాటు..

Prajapaksham 20 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Rahul Gandhi Slams PM Modi: మోదీ దేశ చరిత్రలోనే అత్యంత యువత వ్యతిరేక ప్రధాని.. రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు.. న్యాయం అడిగితే లాఠీ దెబ్బలా అని మండిపాటు..

Rahul Gandhi Slams PM Modi: మోదీ దేశ చరిత్రలోనే అత్యంత యువత వ్యతిరేక ప్రధాని.. రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు.. న్యాయం అడిగితే లాఠీ దెబ్బలా అని మండిపాటు..

Rahul Gandhi Slams PM Modi: నీట్-యూజీ (NEET-UG) పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా పెను రాజకీయ దుమారం రేపుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజే ఉభయ సభలు వాయిదా పడగా.. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పీఎం మోదీని భారతదేశ చరిత్రలోనే అత్యంత యువత వ్యతిరేక ప్రధానమంత్రిగా అభివర్ణించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఒక వీడియోను పంచుకుంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడి ఎక్కుపెట్టారు. నీట్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కూడా కోరలేనంత యువత వ్యతిరేకతతో.. మోదీ ప్రభుత్వం ఉందని రాహుల్ ఆరోపించారు. దేశంలో ఇప్పటివరకు 152 ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని.. దీనివల్ల దాదాపు 7.5 కోట్ల మంది విద్యార్థులు బాధితులుగా మారారని ఆయన పేర్కొన్నారు. పేపర్లు లీక్ చేసిన నేరగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటే, కష్టపడి చదివిన విద్యార్థులకు మాత్రం శిక్ష పడుతోందని వాపోయారు.

ఢిల్లీ వీధుల్లో న్యాయమైన, సమర్థవంతమైన విద్యా వ్యవస్థ కోసం నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు ఈడ్చుకెళ్లి కొడుతున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థులు తమ హక్కుల కోసం ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పాల్సింది పోయి.. వారిపై బాష్పవాయువు ప్రయోగించడం, లాఠీఛార్జ్ చేయడం ప్రజాస్వామ్యం కాదని, అది భారతదేశ పద్ధతి అసలే కాదని స్పష్టం చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న అబ్బాయిలు, అమ్మాయిలు నేరస్థులు కారని.. విద్యా వ్యవస్థపై లేవనెత్తిన ఆందోళనలను కేంద్రం ఏళ్లుగా పట్టించుకోకుండా దేశ యువతను అగౌరవపరుస్తోందని దుయ్యబట్టారు.

మరోవైపు ఢిల్లీలో నిరసనలు హింసాత్మకంగా మారడంతో శాంతిభద్రతల పరిరక్షణకై స్వల్ప లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. న్యూఢిల్లీ జిల్లా పరిధిలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున నిరసనకారులను అడ్డుకున్నట్లు స్పష్టం చేశారు. కాగా, నిరసనలకు పిలుపునిచ్చిన బొద్దింక జనతా పార్టీ -సీజేపీ తమ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు నిర్బంధించారంటూ చేస్తున్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు.