Skip to content
జాతీయం వార్తలు

Abhijeet Dipke Ends Fast: సీజేపీ నిరసనతో హోరెత్తిన ఢిల్లీ .. నిరాహార దీక్ష విర‌మించిన అభిజిత్ దీప్కే.. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా కదం తొక్కిన యువత..

Prajapaksham 20 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Abhijeet Dipke Ends Fast: సీజేపీ నిరసనతో హోరెత్తిన  ఢిల్లీ .. నిరాహార దీక్ష విర‌మించిన అభిజిత్ దీప్కే.. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా కదం తొక్కిన యువత..

Abhijeet Dipke Ends Fast: సీజీపీ నిరసనతో హోరెత్తిన ఢిల్లీ.. నిరాహార దీక్ష విర‌మించిన అభిజిత్ దీప్కే.. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా కదం తొక్కిన యువత..

Abhijeet Dipke Ends Fast: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కాక్రోచ్‌ జనతా పార్టీ- సీజేపీ చేపట్టిన చలో సంసద్ ర్యాలీ పతాక స్థాయి ఉద్రిక్తతలకు దారితీసింది. నీట్-యూజీ పరీక్షల లీకేజీపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలంటూ దేశం నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది యువత హస్తిన వీధుల్లో నినాదాలతో హోరెత్తించారు.

ర్యాలీ ప్రారంభానికి ముందు జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్విగ్న భరిత సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఆసుపత్రిలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్ విజ్ఞప్తి మేరకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన నిరాహార దీక్షను విరమించారు. ఆయనతో పాటు గత 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఐసా (AISA) విద్యార్థి నాయకులు నేహా, మనీష్, అమీన్ కూడా తమ దీక్షలకు ముగింపు పలికారు. బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, ఆర్జేడీ నేత రాజారామ్ పాల్, సీపీఎం ఎంపీ అమ్రారామ్, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ తదితరులు నిరసన వేదికపైకి చేరుకుని నిరసనకారులకు జ్యూస్ ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. దీక్షలు ముగిసినప్పటికీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల కోసం సీజేపీ పోరాటం క్షేత్రస్థాయిలో కొనసాగుతుందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు.

మరోవైపు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుండి సోనమ్ వాంగ్‌చుక్ తన స్వహస్తాలతో రాసిన లేఖను విడుదల చేశారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పార్లమెంట్‌లో చర్చిస్తామని హామీ ఇవ్వడం సహా మూడు ముఖ్యమైన షరతులతో తాను కూడా దీక్ష విరమించేందుకు సిద్ధమని ప్రకటించారు. కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజే రాజ్యసభలో విద్యార్థుల సమస్యలను, వారిపై జరిగిన లాఠీఛార్జ్ ఉదంతాన్ని బలంగా లేవనెత్తినందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

ఢిల్లీలో కురుస్తున్న వర్షంలోనూ యువత బారికేడ్లను ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ స్ట్రీట్ సమీపంలో ఒక నిరసనకారుడిని భద్రతా సిబ్బంది చుట్టుముట్టి లాఠీలతో కొడుతున్నప్పటికీ.. ఆ యువకుడు ఏమాత్రం బెదరకుండా నిలబడిన వీడియో నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి.. లాఠీచార్జి చేసినా లెక్కచేయకుండా వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాస్వామ్యవాదులు, సినీ ప్రముఖుల మద్దతుతో సీజేపీ మార్చ్ ముందుకు సాగింది.