Skip to content
జాతీయం వార్తలు

CJP Protest Escalates: సీజేపీ నిరసన దెబ్బ.. అమిత్‌ షాతో ధర్మేంద్ర ప్రదాన్‌ అత్యవసర భేటీ.. ఢిల్లీలో పతాక స్థాయికి చేరిన చలో పార్లమెంట్ ఉద్రిక్తత..

Prajapaksham 20 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
CJP Protest Escalates: సీజేపీ నిరసన దెబ్బ.. అమిత్‌ షాతో ధర్మేంద్ర ప్రదాన్‌ అత్యవసర భేటీ.. ఢిల్లీలో పతాక స్థాయికి చేరిన చలో పార్లమెంట్ ఉద్రిక్తత..

CJP Protest Escalates: సీజేపీ నిరసన దెబ్బ.. అమిత్‌ షాతో ధర్మేంద్ర ప్రదాన్‌ అత్యవసర భేటీ.. ఢిల్లీలో పతాక స్థాయికి చేరిన చలో పార్లమెంట్ ఉద్రిక్తత..

CJP Protest Escalates: దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, మరోవైపు ప్రజా నిరసనలతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నీట్-యూజీ (NEET-UG) పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని.. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ప్రముఖ పర్యావరణ వేత్త సోనం వాంగ్‌చుక్ ఇచ్చిన చలో సంసద్ పిలుపుతో వేలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులు సోమవారం పార్లమెంట్‌ ముట్టడికి యత్నించడం సంచలనంగా మారింది.

ఈ తీవ్ర ఉద్రిక్తతల నడుమ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అత్యవసరంగా భేటీ కావడం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాన్ రాజీనామాపై సీజేపీ పట్టుబడుతున్న తరుణంలో.. ఈ సమావేశంలో కీలక నిర్ణయం ఏమైనా వెలువడుతుందా? లేదా ఇది శాంతిభద్రతల సమీక్షా సమావేశమా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు, నిరసనకారులతో కేంద్రం చర్చలు జరపనుందంటూ సీజేపీ ప్రతినిధులు చేసిన ప్రకటనలను కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు.

జంతర్ మంతర్ నుండి భారీ కవాతుగా బయలుదేరిన సీజేపీ కార్యకర్తలు పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా పార్లమెంట్‌ ప్రధాన గేటు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన భారీ బారికేడ్లను తోసుకుని నిరసనకారులు ముందుకు రావడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు పార్లమెంట్ ప్రధాన ప్రవేశ ద్వారానికి అతి సమీపంలోకి చేరుకోవడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై పార్లమెంట్ ప్రధాన గేట్లను మూసివేశారు.

పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. రైసినా రోడ్డు, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా మరియు సన్‌సద్ మార్గ్ పరిసరాల్లో వేలాదిగా ఉన్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు టియర్ గ్యాస్ (బాష్పవాయువు) ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో పలువురు కార్యకర్తలతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. నిబంధనలను ఉల్లంఘించిన పలువురు సీజేపీ నేతలను, ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజే ఉభయ సభలు వాయిదా పడటం, ఇటు వీధుల్లో రణరంగం సృష్టించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.