Skip to content
బిజినెస్ వార్తలు

First Hydrogen Train: భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు ఇవే..

Prajapaksham 17 Jul 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
First Hydrogen Train: భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు ఇవే..

First Hydrogen Train: భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు ఇవే..

First Hydrogen Train: భారతీయ రైల్వే పర్యావరణ పరిరక్షణ దిశగా సరికొత్తగా తీసుకువెళ్లింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో, పర్యావరణహితంగా రూపొందించిన దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. శూన్య ఉద్గారాల (Zero-emission) సామర్థ్యంతో నడిచే ఈ రైలు అందుబాటులోకి రావడంతో, ప్రపంచంలోనే ఇలాంటి అత్యాధునిక సాంకేతికత కలిగిన అతికొద్ది దేశాల సరసన భారతదేశం నిలిచింది.

నార్తర్న్ రైల్వే ఆధ్వర్యంలో నడిచే ఈ తొలి హైడ్రోజన్ రైలును హర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపత్ మార్గంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టారు. ఈ రైలు ప్రయాణంలో జింద్ జంక్షన్, గోహానా జంక్షన్, సోనిపత్‌లను కలుపుతూ.. జింద్ సిటీ, పాండు పిండారా జంక్షన్, లలిత్ ఖేరా హాల్ట్, భంభేవా, ఇసాపూర్ ఖేరి హాల్ట్, బుటానె హాల్ట్, ఖండ్రాయ్ హాల్ట్, రాబ్రా హాల్ట్, లాత్ హాల్ట్, మోహనా, బర్వాస్ని హాల్ట్, సోనిపత్ న్యూ స్టేషన్లలో ఆగుతుంది. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, పర్యావరణ అనుకూల సాంకేతికతను పెంచేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఆత్మనిర్భర్ భారత్ విజన్‌లో భాగంగా రీసెర్చ్, డిజైన్స్ & స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ఈ రైలును పూర్తిగా భారతదేశంలోనే తయారు చేసింది. ఇందులో దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా నేరుగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో నడిచే ఈ రైలు.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, అతిపెద్ద హైడ్రోజన్ ప్యాసింజర్ రైలుగా రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం ప్రపంచంలో నడుస్తున్న మిగతా హైడ్రోజన్ రైళ్లు కేవలం రెండు లేదా నాలుగు కోచ్‌లతో.. చాలా తక్కువ దూరం మాత్రమే ప్రయాణిస్తుండగా.. భారతీయ రైల్వే ఏకంగా 10 కోచ్‌లతో, ఒకేసారి 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలా దీనిని డిజైన్ చేసింది. ఈ రైలు డిజైన్ వేగం గంటకు 110 కిలోమీటర్లు కాగా, ప్రస్తుతం గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడపడానికి అనుమతి లభించింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, అమెరికా, జపాన్, చైనా వంటి కొన్ని దేశాలు మాత్రమే హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్నాయి. ఇందులో ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ప్యాసింజర్ రైలు ‘ఆల్‌స్టామ్ కొరాడియా ఐలింట్‌’ను ప్రవేశపెట్టి జర్మనీ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు భారతదేశం కూడా ఈ సాంకేతికతను సొంతంగా సాధించి విజయవంతంగా పరీక్షించడంతో, దేశంలో పర్యావరణ అనుకూల భవిష్యత్తు రైలు ప్రయాణాలకు బలమైన పునాది పడినట్లయింది.