సీఎం రేవంత్ తిట్ల పురాణంతో BRSకు బూస్ట్.. రక్తం చల్లమనే వ్యాఖ్యలతో కారు పార్టీకి పెరిగిన మైలేజీ..
సీఎం రేవంత్ తిట్ల పురాణంతో BRSకు బూస్ట్.. రక్తం చల్లమనే వ్యాఖ్యలతో కారు పార్టీకి పెరిగిన మైలేజీ..
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఎల్ నినో ప్రభావం పైన ఏర్పాటుచేసిన పాత్రికేయ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. బీఆర్‌ఎస్ నాయకుల రక్తం చల్లితే పంటలు పండుతాయని సీఎం వ్యాఖ్యల పైన ప్రతిపక్ష పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు.
ఏకంగా భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలు రక్తదానం చేసి, రక్తం ప్యాకెట్లను ముఖ్యమంత్రికి ఇచ్చేందుకు బయలుదేరారు. తమ రక్తం పొలాల్లో చిందించడానికి సిద్ధంగా ఉన్నామని, రైతుల కోసం ఎంత రక్తమైన ధారపోస్తామని భారత రాష్ట్ర సమితి నేతలు ప్రకటిస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ చేస్తున్న విమర్శల్లో ఎక్కువగా తిట్లు, శాపనార్ధాలు ఉంటున్న నేపథ్యంలో, పరిణితి చెందిన రాజకీయ నేతల నుంచి ప్రజలు ఇలాంటివి ఆశించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇవి పట్టించుకోకుండా తిట్ల పురాణం మొదలుపెట్టడం ఏమాత్రం హర్షనీయం కాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రులను చూడలేదు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కూడా ప్రతిపక్ష పార్టీల పైన పదునైన పదజాలం వాడేవారు, కానీ తిట్ల పురాణం ఎప్పుడు వాడేవారు కాదు.
ఇక అంతకుముందు కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ కూడా ఇలాంటి భాష ఉపయోగించలేదు. ఇది సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా సీఎం వ్యవహార శైలి పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇదే తిట్ల పురాణం బాటలో నడిచినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఆయన పరిణితి చూపించేవారు. ప్రస్తుతం రైతుల విషయంలో ఎంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా కెసిఆర్ ఎప్పుడూ కూడా ఇలా పరిణితి లేకుండా మాట్లాడలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఎత్తి చూపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూడా వారి వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.
మొత్తానికి రాజకీయాల్లో ఈ తిట్ల పురాణం అనేది ఎప్పటికీ కూడా హర్షనీయం కాదు. ఎందుకంటే అసలైన అంశం పక్కకు పోయి, ఈ తిట్ల చుట్టే మొత్తం వాదనలు, ప్రతివాదనలు జరుగుతూ ఉంటాయి.
కనుక సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తిట్ల పురాణం కట్టిపెట్టి, తన పనితీరును మెరుగుపరుచుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.