Nepal Elephant Attack: విధి ఆడిన వింత నాటకం.. 14 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన ఏనుగు బీభత్సం.. నేపాల్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..
Nepal Elephant Attack: విధి ఆడిన వింత నాటకం.. 14 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన ఏనుగు బీభత్సం.. నేపాల్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..
Nepal Elephant Attack: ఏ మృత్యువుకు భయపడి ఆ కుటుంబం ఇల్లు, ఊరు విడిచి మైళ్ల దూరం పారిపోయిందో.. సరిగ్గా 14 సంవత్సరాల తర్వాత అదే మృత్యువు వారిని వెతుక్కుంటూ వచ్చి ప్రాణాలను తీసింది. ఒక అడవి ఏనుగు దాడిలో ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాల వారు (మొత్తం నలుగురు) ప్రాణాలు కోల్పోయిన అత్యంత విషాదకరమైన ఉదంతం నేపాల్‌లో వెలుగుచూసింది.
నేపాల్‌లోని ప్రసిద్ధ చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో నివసించే శనిచర బోటే కుటుంబానికి.. ధ్రుబే అనే ఒక మగ ఏనుగు రూపంలో మృత్యువు ఎదురైంది. 2012 డిసెంబరులో మాడి అనే పట్టణంలో ఈ ధ్రుబే ఏనుగు జరిపిన దాడిలో శనిచర తల్లిదండ్రులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఆ దారుణం నుండి కోలుకోలేక.. తన మిగిలిన కుటుంబాన్ని రక్షించుకోవాలనే ఆరాటంతో శనిచర రాప్తి నదిని దాటి దాదాపు 9 మైళ్ల (15 కిలోమీటర్లు) దూరంలో ఉన్న జగత్పూర్ అనే ప్రాంతానికి వలస వెళ్ళాడు. నదులు, అడవులు దాటి ఇంత దూరం వస్తే ఇక తమకు ఆ ఏనుగు ముప్పు ఉండదని ఆయన భావించాడు.
అయితే కాలం వారిని దారుణంగా వంచించింది. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. అదే ధ్రుబే ఏనుగు జగత్‌పూర్‌లోని శనిచర నివాసంపై దాడి చేసింది. ఈ తాజా దాడిలో అతని 25 ఏళ్ల కోడలు ఆషికా బోటే, 4 ఏళ్ల పసి మనవడు భరత్ బోటేలను ఆ ఏనుగు కిరాతకంగా తొక్కి చంపేసింది. ఒకే ఏనుగు దాడిలో నాడు తల్లిదండ్రులను, నేడు కోడలు, మనవడిని కోల్పోయిన శనిచర బోటే గుండెలు పగిలేలా రోదించాడు. ఇంత దూరం వస్తే సురక్షితంగా ఉంటామనుకున్నాం. కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా అదే ఏనుగు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నా కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. ఇక మేము ప్రాణాలు దాచుకోవడానికి పారిపోవడానికి కూడా చోటు లేదంటూ వాపోయాడు.
నేపాల్ అడవుల్లో తిరిగే ఈ ధ్రుబే ఏనుగు అత్యంత ప్రమాదకరమైన జంతువుగా రికార్డుకెక్కింది. 2010 సంవత్సరం నుండి ఇప్పటివరకు ఈ ఒక్క ఏనుగే ఏకంగా 25 మంది ప్రాణాలను బలితీసుకున్నట్లు చిత్వాన్ నేషనల్ పార్క్ అధికారులు ధ్రువీకరించారు. జగత్పూర్ ఘటనకు ముందు దీని వల్ల 23 మంది చనిపోగా.. తాజా మరణాలతో ఆ సంఖ్య 25కు చేరింది. ఈ ఏనుగు సృష్టించిన బీభత్సానికి గుర్తింపుగా దీని పేరు మీద వికీపీడియాలో ఒక ప్రత్యేక పేజీ కూడా ఉండటం గమనార్హం.
అటవీ అధికారులు 2016 నుండి ఈ ఏనుగు కదలికలను కనిపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనికోసం దానికి రేడియో ట్రాకింగ్ కాలర్ (Radio Collar) కూడా అమర్చారు. 2020, 2023 సంవత్సరాలలో ఆ కాలర్‌ను మార్చినప్పటికీ.. దాని దాడులను అడ్డుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, అటవీ పరివాహక ప్రాంతాల్లోకి మానవ నివాసాలు చొచ్చుకుపోవడం వల్లే ఇలాంటి ఘోరమైన వన్యప్రాణి ఘర్షణలు పెరుగుతున్నాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.