Skip to content
జాతీయం వార్తలు

Ayodhya Ram Temple: అయోధ్య విరాళాల చోరీ.. భక్తులు భారీగా తగ్గడంతో సంక్షోభంలో స్థానిక వ్యాపారం.. వివాదాన్ని అస్త్రంగా మార్చుకున్న విపక్షాలు..

Prajapaksham 13 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Ayodhya Ram Temple: అయోధ్య విరాళాల చోరీ.. భక్తులు భారీగా తగ్గడంతో సంక్షోభంలో స్థానిక వ్యాపారం.. వివాదాన్ని అస్త్రంగా మార్చుకున్న విపక్షాలు..

Ayodhya Ram Temple: అయోధ్య విరాళాల చోరీ.. భక్తలు భారీగా తగ్గడంతో సంక్షోభంలో స్థానిక వ్యాపారం.. వివాదాన్ని అస్త్రంగా మార్చుకున్న విపక్షాలు..

Ayodhya Ram Temple: అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ ఉదంతం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. స్థానిక ఆధ్యాత్మిక పర్యాటక రంగంతో పాటు ఉత్తరప్రదేశ్ రాజకీయాలను ఈ అంశం తీవ్రంగా కుదిపేస్తోంది. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రాముడి కోసం వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో, స్థానిక చిరు వ్యాపారులు, హోటల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో మునిగిపోయాయి. మరోవైపు ఈ అంశాన్ని అందిపుచ్చుకున్న విపక్షాలు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగడంతో అధికార బీజేపీ అలర్ట్ అయింది.

విరాళాల చోరీ వివాదం బయటపడిన తర్వాత అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా25 శాతం మేర తగ్గిపోయిందని స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోజుకు నాలుగు నుండి ఐదు వేల రూపాయల వరకు సంపాదించే ప్రసాదాలు, గంధం, పూల దండల వ్యాపారులు ఇప్పుడు రోజుకు కనీసం వెయ్యి రూపాయలు సంపాదించడానికి కూడా నానా అవస్థలు పడుతున్నారు.

ఈ-రిక్షా డ్రైవర్లు తమ వాహనాల కనీస నిర్వహణ ఖర్చులను కూడా సంపాదించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు హోటల్ పరిశ్రమ పరిస్థితి కూడా దారుణంగా తయారయింది. మధ్య స్థాయి హోటళ్లలో రూముల బుకింగ్ ఏకంగా 25 శాతానికి పడిపోగా.. ప్రముఖ హోటళ్లలో టేబుళ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం అయోధ్య పరిసరాల్లో దాదాపు వంద కొత్త హోటళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని.. ఈ మతపరమైన పర్యాటకం గనుక త్వరగా కోలుకోకపోతే కోట్ల రూపాయల పెట్టుబడులు నట్టేట మునగడం ఖాయమని హోటల్ యజమానులు ఆందోళన చెందుతున్నారు.

ఈ ఉదంతంపై అయోధ్యలోని సాధువులు, మఠాధిపతులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే.. ప్రస్తుత వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. శ్రీ హనుమత్ నివాస్‌కు చెందిన మిథిలేశనందిని శరణ్.. దీనిని కేవలం వ్యవస్థ వైఫల్యంగా కాకుండా, పూర్తి పరిపాలనా వైఫల్యంగా అభివర్ణించారు. మహంత్ కమల్ నయన్ దాస్ అయితే ఇది కొందరు కింది స్థాయి ఉద్యోగుల తప్పిదమేనని అనగా.. మహంత్ వివేక్ అచారి మాత్రం.. లౌకిక అధికారుల చేతుల్లో కాకుండా శంకరాచార్యులు, పూజ్య మఠాధిపతులకు రామాలయ ట్రస్ట్‌లో కీలక స్థానం కల్పించాలని, అవసరమైతే కొత్త ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మరో తొమ్మిది నెలల్లో ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. రామమందిరాన్ని తమ ప్రధాన సైద్ధాంతిక చిహ్నంగా భావించే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులు వెంటనే నష్టనివారణ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ జరుపుతోందని.. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని, ట్రస్ట్‌లో కీలక సంస్కరణలు తెస్తామని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈ సమస్య సద్దుమణగక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్తే తీవ్ర రాజకీయ నష్టం వాటిల్లుతుందనే భయంతో.. ఎన్నికలను ముందుకు జరపడానికి బీజేపీ ఏమాత్రం సుముఖంగా లేనట్లు సమాచారం.

ఈ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తూ ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. రామ మందిరం విరాళాల అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. రామాలయ చందా-చోరీకి పాల్పడిన నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.