సంపద పెరిగినా… దేశం స్థాయి మారలేదు!
సంపద పెరిగినా... దేశం స్థాయి మారలేదు!
– డా. జ్ఞాన్ పాఠక్
ప్రపంచంలో నామమాత్ర స్థూల దేశీయోత్పత్తి పరంగా భారత్ 4.18 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో నాలుగో అతిపెద్ద దేశం అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే దేశపు ఆర్థిక వ్యవస్థ ఎంత అనే దానికంటే, ఆ దేశ ప్రజల సగటు ఆదాయం ఎంత అనే అంశం మీదనే అభివృద్ధిని అంచనా వేయాలి. ఈ నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన దేశాల ఆదాయ వర్గీకరణ భారత్ ఆర్థిక పురోగతిపై మరో కోణాన్ని చూపిస్తోంది.
2025 ప్రపంచ బ్యాంక్ గణాంకాల ఆధారంగా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారత్ ఇంకా దిగువ మధ్య ఆదాయ దేశంగానే ఉంది. 2025లో భారత్ తలసరి స్థూల జాతీయ ఆదాయం 2,760 అమెరికన్ డాలర్లుగా మాత్రమే నమోదైంది. భారత్ 2007లో తక్కువ ఆదాయ దేశాల జాబితా నుంచి దిగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలోకి చేరింది. ఆ తర్వాత దాదాపు 19 సంవత్సరాలుగా ఎలాంటి ఎదుగూబొదుగూ లేకుండా కొనసాగుతూ వస్తోంది. అంటే ఇన్నేళ్లుగా ఆర్థికాభివృద్ధి జరిగినా ఎగువ మధ్య ఆదాయ దేశంగా మారే స్థాయికి భారత్ చేరుకోలేకపోయింది.
2025 నాటికి వరల్డ్ బ్యాంక్ మొత్తం 218 దేశాలను నాలుగు ఆదాయ వర్గాలుగా విభజించింది. వీటిల్లో 25 దేశాలు తక్కువ ఆదాయ దేశాలు, 47 దేశాలు దిగువ మధ్య ఆదాయ దేశాలు, 59 దేశాలు ఎగువ మధ్య ఆదాయ దేశాలు, 87 దేశాలు అధిక ఆదాయ దేశాలు. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచినా, వ్యక్తిగత ఆదాయం పరంగా ఇంకా దిగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలోనే ఉండటం గమనార్హం.
ఈ ఏడాది వరల్డ్ బ్యాంక్ వర్గీకరణలో ఏ దేశం దిగువ ఆదాయ వర్గంలో లేదు. జోర్డాన్, మైక్రోనేషియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, వియత్నాం దేశాలు దిగువ మధ్య ఆదాయ దేశాల నుంచి ఎగువ మధ్య ఆదాయ దేశాలుగా ఎదిగాయి. అలాగే టోగో తక్కువ ఆదాయ దేశాల జాబితా నుంచి దిగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలోకి చేరింది. అయితే భారత్ మాత్రం ఈసారి కూడా తన ఆదాయ వర్గాన్ని మెరుగుపరుచుకోలేకపోయింది.
దక్షిణాసియా దేశాల్లో శ్రీలంక ప్రత్యేక గుర్తింపు పొందింది. 2022లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం దివాలా తీసే స్థాయికి చేరినా, కేవలం మూడేళ్లలోనే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుంది. 2025లో శ్రీలంక వాస్తవ జీడీపీ 5 శాతం వృద్ధి నమోదు చేసింది. పరిశ్రమలు, ఆర్థిక సేవలు, పర్యాటక రంగాల్లో పుంజుకోవడం వల్ల ఆ దేశం ఎగువ మధ్య ఆదాయ దేశంగా గుర్తింపు పొందింది. ఈ మార్పు శ్రీలంక ఆర్థిక పునరుద్ధరణకు నిదర్శనంగా నిలిచింది.
2026 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన 2027 ఆర్థిక సంవత్సరానికి వరల్డ్ బ్యాంక్ ఆదాయ పరిమితుల ప్రకారం, 1,175 డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలు తక్కువ ఆదాయ దేశాలుగా, 1,176 నుంచి 4,635 డాలర్ల వరకు ఉన్న దేశాలు దిగువ మధ్య ఆదాయ దేశాలుగా, 4,636 నుంచి 14,375 డాలర్ల వరకు ఉన్న దేశాలు ఎగువ మధ్య ఆదాయ దేశాలుగా, 14,375 డాలర్లకు పైగా ఉన్న దేశాలు అధిక ఆదాయ దేశాలుగా వర్గీకరించారు. ఇవి గత ఏడాది అమల్లో ఉన్న పరిమితుల కంటే ఎక్కువ.
2025లో తక్కువ ఆదాయ దేశాల పరిమితి 1,135 డాలర్లు కాగా, దిగువ మధ్య ఆదాయ దేశాల పరిమితి 1,136 నుంచి 4,495 డాలర్ల వరకు ఉండేది. ఎగువ మధ్య ఆదాయ దేశాల పరిమితి 4,496 నుంచి 13,935 డాలర్ల వరకు, అధిక ఆదాయ దేశాల పరిమితి 13,935 డాలర్లకు పైగా ఉండేది.
వరల్డ్ బ్యాంక్ ప్రతి ఏడాది జూలై 1న, అంతకుముందు క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన తలసరి స్థూల జాతీయ ఆదాయం ఆధారంగా దేశాలను వర్గీకరిస్తుంది. ఒకసారి వర్గీకరణ ప్రకటించాక తదుపరి ఏడాది జూలై 1 వరకు అదే అమల్లో ఉంటుంది. మధ్యలో గణాంకాలు సవరించినా ఆ ఏడాదికి వర్గీకరణను మార్చరు.
దేశాల ఆదాయాన్ని లెక్కించేందుకు వరల్డ్ బ్యాంక్ అట్లాస్ పద్ధతిని ఉపయోగిస్తుంది. ఇందులో స్థానిక కరెన్సీని అమెరికన్ డాలర్లలోకి మార్చి, మారకపు విలువల్లో వచ్చే హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించేలా తలసరి స్థూల జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. ఈ ఏడాది విడుదల చేసిన వర్గీకరణలో మొత్తం 218 దేశాలు ఉన్నాయి. ఈ జాబితా 2027 జూన్ చివరి వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక సూచికగా ఉపయోగించబడుతుంది.
ఈ ఆదాయ వర్గీకరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఏ దేశాలకు రాయితీ రుణాలు, అభివృద్ధి సహాయం అందించాలనే విషయాన్ని నిర్ణయించడంలో ఇది కీలకంగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వాలు, పరిశోధకులు, అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ దేశాల ఆర్థిక పురోగతిని పోల్చి చూడటానికి ఈ వర్గీకరణను ఉపయోగిస్తాయి.
స్థూల జాతీయ ఆదాయం అంచనాలను ఆయా దేశాల అధికారిక గణాంకాల ఆధారంగా వరల్డ్ బ్యాంక్ ఆర్థికవేత్తలు సిద్ధం చేస్తారు. జనాభా అంచనాల కోసం ఐక్యరాజ్య సమితి విడుదల చేసే ప్రపంచ జనాభా విభాగంతో పాటు ఇతర విశ్వసనీయ వనరులను ఉపయోగిస్తారు.
ప్రతి ఏడాది అందుబాటులో ఉన్న తాజా సమాచారంతో వర్గీకరణను రూపొందించినప్పటికీ, ఒక్క సూచికతోనే దేశ అభివృద్ధిని అంచనా వేయలేమని వరల్డ్ బ్యాంక్ పేర్కొంటోంది. 1987 నుంచి ప్రపంచ ఆదాయ వర్గీకరణలో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పట్లో ప్రపంచ దేశాల్లో 30 శాతం దేశాలు తక్కువ ఆదాయ వర్గంలో ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 11 శాతానికి తగ్గింది. వరల్డ్ బ్యాంక్ పరిశీలించే దేశాల సంఖ్య కూడా 163 నుంచి 218కు పెరిగింది.
నాలుగు దశాబ్దాలుగా వేలాది ఆర్థిక గణాంకాలను విశ్లేషిస్తూ రూపొందిస్తున్న ఈ ఆదాయ వర్గీకరణ ప్రపంచ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి విశ్వసనీయమైన ప్రమాణంగా గుర్తింపు పొందింది.
మొత్తంగా చూస్తే, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్, వ్యక్తిగత ఆదాయం విషయంలో దిగువ మధ్య ఆదాయ దేశంగానే కొనసాగుతోంది.
ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రతి పౌరుడి ఆదాయంలో ప్రతిబింబించినప్పుడే దేశం ఎగువ మధ్య ఆదాయ దేశంగా ఎదుగుతుందని వరల్డ్ బ్యాంక్ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది.