Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

యూట్యూబర్‌ ‘ప్రశ్న’ రావణ్‌పై నిరంకుశ ‘ఉప’ కేసు!

Prajapaksham 11 Jul 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
యూట్యూబర్‌ ‘ప్రశ్న’ రావణ్‌పై నిరంకుశ ‘ఉప’ కేసు!

యూట్యూబర్‌ ‘ప్రశ్న’ రావణ్‌పై నిరంకుశ ‘ఉప’ కేసు!

ఇ.చంద్రశేఖర్‌

యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉప’ చట్టం (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం)కింద కేసు నమోదు చేయడంతో మరోసారి ‘ఉప’ చట్టం అమలు తీరు చర్చకు దారితీసింది. యూ ట్యూబర్‌ రావణ్‌పై ఉప చట్టంలోని సెక్షన్‌ 13, 39 కింద కేసు నమోదు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించడం దారుణం, చట్ట దుర్వినియోగం. గతంలో ‘ఉప’ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన పౌరహక్కుల సంఘం నేత జి.ఎన్‌.సాయిబాబా దాదాపు పదేళ్లకు పైగా జైలు జీవితం గడిపారు. ఆయన కేసుతో ‘ఉప’ చట్టం అమలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు విఘాతం కలిగిం చే చట్టవిరుద్ధ, తీవ్రవాద కార్యకలాపాలను నిరోధించేందు కు 1967లో రూపొందించిన “చట్టవిరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టం” (యుఎపిఎ) ఒక సాధారణ యూట్యూబర్‌ పై ప్రయోగించడం మరోసారి ప్రజా చర్చలో నిలిచింది.

ముఖ్యంగా బెయిల్‌ నిబంధనలు, విచారణ కాలం, నిందితుల హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ, జాతీయ భద్రత మధ్య సమతుల్యతపై న్యాయవర్గాలు, మానవ హక్కుల సంస్థలు, రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఉప కేసులలో దర్యాప్తు సంస్థల వైఖరి వల్ల నిందితులకు బెయిల్‌ దాదాపు అసాధ్యమని, విచారణే శిక్షగా మారుతోందని ఆవేదన వ్యక్తమవుతున్నది. నిందితులు ఏళ్ల తరబడి జైలు జీవితం అనుభవించిన అనంతరం చివరకు వారు నిర్ధోషులుగా విడుదలైన ఘటనలు ఎన్నో ఉన్నాయని పేర్కొంటున్నారు.

అయితే దేశ భద్రతకు ‘ఉప’ చట్టం అవసరమని పాలకులు, దర్యాప్తు సంస్థలు వాదిస్తుండగా, దుర్వినియోగమవుతోందని పౌరహక్కుల సంఘాలు, మేధావులు, ప్రముఖులు, ఈ కేసులలోని బాధితులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబర్‌ రావణ్‌ కేసులో ఆరోపణలు, వాటికి సంబంధించిన ఆధారాలు, చట్టపరమైన అంశాలపై తుది నిర్ణయం సంబంధిత న్యాయస్థానం విచారణ అనంతరం వెలువడనుంది. అయితే ఈ కేసుద్వారా జాతీయ భద్రతకు సంబంధించిన కఠిన చట్టాల అమలు, వ్యక్తిగత స్వేచ్ఛ, న్యాయ ప్రక్రియ, భావ ప్రకటనా హక్కుల మధ్య సమతుల్యతపై మరోసారి విస్తృత చర్చ తలెత్తింది.
ఉప అంటే ఏమిటి?
1967లో అమల్లోకి వచ్చిన “చట్టవిరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టం” (ఉప) చట్టాన్ని కాలక్రమంలో పాలకులు పలు మార్లు సవరించారు. ముఖ్యంగా 2004, 2008, 2012, 2019 సవరణలతో దీనిని మరింత కఠినతరం చేశారు. ఉగ్రవాద సంస్థలను మాత్రమే కాకుండా, కొన్ని పరిస్థితుల్లో వ్యక్తులను కూడా ‘ఉగ్రవాదులు’గా ప్రకటించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కల్పించారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రతకు ముప్పుగా భావించే కార్యకలాపాలపై ఈ చట్టం వర్తిస్తుంది.
అరెస్టులు ఘనం… శిక్షలు స్వల్పం
దేశవ్యాప్తంగా ఉప చట్టం కింద నమోదవుతున్న కేసులు, అరెస్టులు, శిక్షలపై నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) పార్లమెంట్‌కు సమర్పించిన గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 1,300 నుంచి 3,000 మంది వరకు ‘ఉప’ చట్టం కింద అరెస్టవుతున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు 11వేల మంది అరెస్ట్‌ కాగా కేవలం 335 మందికి మాత్రమే శిక్ష పడింది. అయితే కోర్టుల్లో తుది విచారణ పూర్తయి శిక్ష పడుతున్న వారి శాతం 2 నుంచి 6 శాతం మధ్యే ఉందని, సగటు శిక్ష కాలం 3.2 శాతం మాత్రమే ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. మిగిలిన కేసుల్లో చాలావరకు విచారణలు కొనసాగుతుండగా, కొన్ని కేసుల్లో నిందితులు నిర్ధోషులుగా విడుదల
వుతున్నారు.
బెయిల్‌ ఎందుకు కష్టమవుతుంది?
‘ఉప’ చట్టంలోని సెక్షన్‌ 43డి (5) ఈ చట్టంలో అత్యంత కీలకమైన నిబంధనగా పరిగణించబడుతుంది. ప్రాథమికంగా ప్రాసిక్యూషన్‌ సమర్పించిన ఆధారాల ప్రకారం కేసులో ఆరోపణలకు మొదటి చూపులో బలం ఉందని కోర్టు భావిస్తే బెయిల్‌ మంజూరు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపధ్యంలో విచారణ పూర్తికాకముందే నిందితులు నెలలు, కొన్ని సందర్భాల్లో సంవత్సరాలపాటు జైలులో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
విచారణే శిక్షగా మారుతోందా?
‘ఉప’ పై విమర్శకులు ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కేసు నమోదైన అనంతరం దీర్ఘకాలం నిర్బంధంలో ఉండా ల్సి రావడం, విచారణ ఆలస్యం కావడం వల్ల చివరకు నిర్దోషిగా విడుదలైనా అప్పటికే ఎన్నో సంవత్సరాలు జైలులో గడిచిపోతున్నాయని అంటున్నారు. మరోవైపు దర్యాప్తు సంస్థ లు మాత్రం సంక్లిష్ట ఉగ్రవాద కేసుల్లో విస్తృత దర్యాప్తు కోసం ఎక్కువ సమయం అవసరమని వాదిస్తున్నాయి.
కోర్టులు ఏమంటున్నాయి?
పలు తీర్పుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు అని పేర్కొన్నప్పటికీ, ‘ఉప’ చట్టంలోని ప్రత్యేక నిబంధన ల కారణంగా బెయిల్‌ విషయంలో సాధారణ క్రిమినల్‌ చట్టాలకు భిన్నమైన ప్రమాణాలు అమలవుతున్నాయి. గతంలో కేసులో కేవలం సాహిత్యం లేదా సమాచారం కలిగి ఉండటం మాత్రమే నేరానికి ఆధారం కాదని, చట్టవ్యతిరేక కార్యకలాపాలతో ప్రత్యక్ష సంబంధం నిరూపించాల్సి ఉంటుందని న్యాయస్థానం |వ్యాఖ్యానించింది.
ఏళ్ల తరబడి జైలులో ఉన్న ప్రముఖుల ఉదాహరణలు
ఉప చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన పౌరహక్కుల సంఘం నేత జి.ఎన్‌.సాయిబాబా ఏళ్ల తరబడి వివిధ దశల్లో జైలు జీవితం గడిపారు. ఆయన కేసు ‘ఉప’ చట్టం అమలు పై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఉప కింద అరెస్టై సుమారు రెండేళ్లకు పైగా జైలులో ఉన్న తర్వాత ఆరోగ్య కారణాలతో బెయిల్‌ పొందారు. 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ‘ఉప’ చట్టం కింద అరెస్టు చేసి అనేక సంవత్సరాలుగా విచారణ కొనసాగిస్తూ జైలులో ఉంచారు. ఆయన బెయిల్‌ పిటిషన్లు పలుమార్లు న్యాయస్థానాల్లో విచారణకు వచ్చాయి. భీమా కోరేగావ్‌ కేసులో మూడేళ్లకు పైగా జైలులో ఉండి అనంతరం డిఫాల్ట్‌ బెయిల్‌ పొందారు. ‘ఉప’ కేసులో రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉండి తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గృహ నిర్బంధం,
అనంతరం బెయిల్‌ పొందారు.
విమర్శలు దర్యాప్తుల వాదన
దేశంలో పాలకులు కొన్ని సందర్భాలలో తమతో విభేదించే వారి భిన్నాభిప్రాయాలను, వ్యతిరేకులను అణచివేయడానికి ఉప చట్టాన్ని ఉపయోగిస్తున్నారని పౌరహక్కుల సంఘాలు, కొంతమంది న్యాయవాదులు, మేధావులు విమర్శిస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతోందని అంటున్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వం, భద్రతా సంస్థలు ఈ ఆరోపణలను ఖండిస్తూ, దేశ భద్రత, ఉగ్రవాద నిరోధానికి ఉప అత్యంత కీలకమైన చట్టమని, ఉగ్రవాద నిధులు, కుట్రలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు దీనివల్ల దర్యాప్తు సంస్థలకు అవసరమైన చట్టపరమైన అధికారాలు లభిస్తున్నాయని చెబుతున్నాయి.