Skip to content
జాతీయం వార్తలు

భారత్‌ ఆర్థికాభివృద్ధికి అమెరికా ఆటంకాలు

Prajapaksham 10 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
భారత్‌ ఆర్థికాభివృద్ధికి అమెరికా ఆటంకాలు

భారత్‌ ఆర్థికాభివృద్ధికి అమెరికా ఆటంకాలు

ట్రంప్‌ మోదీ మధ్య దోస్తీ, మరోవైపున భారత్‌ వాణిజ్య చర్చలు కొనసాగుతుండగా, భారత ఇంటెలిజెన్స్‌ మాజీ ఉన్నతాధికారి విక్రం సూద్‌ ఒక బ్రిటీష్‌ నెట్‌వర్క్‌కు ఆదివారం నాడు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలనాత్మక విషయం వెల్లడించారు. ప్రస్తుత అమెరికా విదేశాంగశాఖ డిప్యూటీ సెక్రటరీ క్రిష్టఫర్‌ లాండా 2026 మార్చినెలలో భారత్‌ను సందర్శించినపుడు భారత అధికారులకు ఒక విషయం కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు. ‘భారతదేశ శీఘ్రతర ఆర్థికాభివృద్ధిని నిరోధించటానికి సుంకాలు, ఆంక్షలు, ఇతర సాధనాలను వాషింగ్టన్‌ ఉపయోగిస్తుంది. అమెరికాతో పోటీపడే ప్రధానమైన శక్తిగా అది ఆవిర్భవించటాన్ని అనుమతించదు.’
ఆ ఢిల్లీ సమావేశంలో లాండా ఇలా అన్నట్లు సూద్‌ చెప్పారు. “చైనా మేజర్‌ ఆర్థిక శక్తిగా ఎదగటానికి సహాయం అందించి మేము తప్పు చేశాం. భారత్‌తో అదే తప్పు చేయబోము. మేము అదే తప్పు మళ్లీ చేయబోము.” బ్రిటీష్‌ కరెంట్‌ ఎఫైర్స్‌ ప్రోగ్రాం ‘న్యూ ఆర్డర్‌’ సూద్‌ ఇచ్చిన ఇంటర్వ్యూతో పాటు హోస్ట్‌ లాండా ఒరిజినల్‌ వ్యాఖ్యలను ప్రసారం చేశారు. ఆ ఇంటర్వ్యూ దౌత్యవర్గాల్లో అలజడి సృష్టించింది.
లాండా ఇప్పటికీ విదేశాంగశాఖ సహాయమంత్రిగా కొనసాగుతున్నాడు. ట్రంప్‌ నాయకత్వంలోని మాగా లాబీ కి తన బాస్‌ వ్యవహారాల మంత్రి మార్క్‌ రూబియోతోపాటు సన్నిహితుడు. భారత్‌ సంబంధాల విషయంలో తరచూ కనిపించే వ్యక్తి రూబియో. అయితే ట్రంప్‌ ప్రభుత్వ ఆలోచనలగూర్చి లాండా మాట్లాడుతుంటాడు. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో అమెరికా భవిష్యత్‌ దృష్టి గూర్చి ఆయన నిర్మొహమాటంగా మాట్లాడుతుంటాడు.
ఇండో భద్రత, అందులో భారత్‌ గూర్చిన పాత భావన గూర్చి ట్రంప్‌ ప్రభుత్వం ఇటీవల కాలంలో తక్కువ ఆసక్తి చూపుతోంది. చైనాకు వ్యతిరేకంగా భారత ప్రాధాన్యతను పెంచటానికై అమెరికా పసిఫిక్‌ కమాండ్‌ పేరును ఇండో మార్చటం, అమెరికా, జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియాలతో క్వాడ్‌ ఏర్పాటు చేయటం, చైనా సముద్ర ప్రాంతంలో చైనాతో ఉద్రిక్తతలు సృష్టించటం తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్‌ మే 14, 15 తేదీల్లో చైనా సందర్శనకు వెళ్లిన సందర్భంలో అమెరికా యుద్ధ డిపార్ట్‌మెంటు ఇండో కమాండ్‌ పేరును పసిఫిక్‌ కమాండ్‌గా పాత పేరును పునరుద్ధరించింది. ఇండియా ను ప్రస్తావించే ఇండో పేరు తొలగింపు భారత్‌ ప్రాధాన్యతను తగ్గించటానికి సూచన. దాంతో ఇండో భద్రతకు ప్రాతిపదిక సందేహంలో పడింది. జులై 1 తేదీల్లో భారత్‌ సందర్శించిన జపాన్‌ ప్రధానమంత్రి సనే తకైచి చైనాకు బద్ధ వ్యతిరేకి, క్వాడ్‌కు గట్టి సమర్ధకురాలు. ప్రధాని మోదీతో చర్చల్లో ఆమె క్వాడ్‌, ఇండో భద్రత గూర్చి మాట్లాడారు. భారత్‌ ఈ సంవత్సరం క్వాడ్‌ శిఖరాగ్ర సభకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ట్రంప్‌ బీజింగ్‌ పర్యటనతో క్వాడ్‌లో అమెరికా ఆసక్తి కోల్పోవడంతో అగ్రనాయక సమావేశంపై అనిశ్చితి ఆవహించింది. ట్రంప్‌ చర్చల తదుపరి ట్రంప్‌ ప్రభుత్వ విస్తృత ఆసియా వ్యూహంలో భారత్‌ ప్రాధాన్యత తగ్గినందున, అమెరికా వ్యూహం ఇప్పుడు వాణిజ్యంలో భారత్‌ నుంచి గరిష్ట రాయితీలు సంపాదించటం, అమెరికా నుంచి భారత్‌ రక్షణ కొనుగోళ్లు పెంచటంపై ఉంది. భారతదేశ శీఘ్రతర ఎదుగుదల గతి అమెరికా ఆర్థిక శక్తికి ముప్పు కలుగజేయకుండా చూసుకోవటం దాని మరో ప్రయోజనం.
ఈ పూర్వరంగంలో క్రిష్టఫర్‌ లాండా వ్యాఖ్యలు వాస్తవ అర్థాన్ని గ్రహించేందుకు ఇతర విదేశీ వ్యవహారాల కార్యాలయాలు మదింపు చేస్తున్నాయి. అయితే చైనా విషయంలో తాము చేసిన తప్పును భారత్‌ విషయంలో చేయబోమని ఆయన అన్నందున చైనా వెంటనే స్పందించింది. న్యూఢిల్లీ పట్ల వాషింగ్టన్‌ దృక్పథం “పరిమిత సంబంధాలు, గరిష్ట అజమాయిషీ” అనే ద్వంద్వ వ్యూహంతో ఉందని చైనీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు. జాతీయ ఆకాంక్షల్లో భిన్నత్వాలు, ప్రపంచ వ్యవస్థపై దృక్పధాలు, భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు, పారిశ్రామిక పోటీ, దౌత్య సాంప్రదాయాల నుంచి తలెత్తుతున్న లోతైన వ్యవస్థాగత వైరుధ్యాలు భారత్‌, అమెరికా మధ్య దౌత్య చర్చలు లేదా ఆర్థిక సహకారం వల్ల ప్రాధమికంగా పరిష్కారం కావని వారు వాదించారు.
టిసింగువా యూనివర్శిటీ నేషనల్‌ స్ట్రాటజీ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ క్వియన్‌ ఫెంగ్‌ గత సోమవారం చైనా కమూ-్యనిస్టు పార్టీ ఆంగ్ల పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌తో ఇలా అన్నారు. ‘గత రెండు దశాబ్దాల్లో వేగంగా విస్తరించిన భారత్‌ సంబంధాలు గరిష్ట స్థాయికి చేరాయి. సర్దుబాటు చేసుకోవటం కష్టంగా ఉన్న వ్యవస్థాగత వైరుధ్యాలను రెండు దేశాలు ఎదుర్కొంటున్నాయి. భారత్‌ దీర్ఘకాలంగా అనుసరిస్తున్న వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విధానం అమెరికా కూటముల ఆధారిత దృక్పథంతో ప్రాథమికంగా విభేదిస్తున్నది. భారత్‌ అమెరికా వ్యూహాత్మక ధ్యేయాలతో పూర్తిగా మమేకం కాకుండా తన సొంత జాతీయ ప్రయోజనాలకు అనుగుణమైన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని నిలకడగా కొనసాగిస్తున్నది. క్వాడ్‌, ఇండో వ్యూహం విషయంలో కూడా భారత్‌ అమెరికాకు లోబడి ఉండే భాగస్వామిగా కాకుండా సమాన భాగస్వామి పాత్ర కోరుకుంటోంది అని అన్నారాయన.
చైనా నిపుణుల అభిప్రాయం ప్రకారం, లాండా వ్యాఖ్యలు భారత్‌ పట్ల వాషింగ్టన్‌ స్థూల దృక్పథం ప్రతిబింబిస్తున్నాయి భౌగోళిక రాజకీయ పోటీలో న్యూఢిల్లీ తోడ్పాటును కోరటం, పారిశ్రామిక గొలుసులో కిందిస్థాయిలో బంధించటం ఆ దృక్పథం. ఆ వ్యూహం భారతదేశ వ్యూహాత్మక గమ్యాలకు విరుద్ధంగా ఉన్నాయని వారన్నారు.
ప్రస్తుతం భారత్‌, అమెరికాలు 2026 ముగియటానికి చాలా ముందుగానే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నాయి. సమస్యల్లో 99శాతం సంప్రదింపుల్లో పరిష్కారమైనట్లు వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చట్రం దాదాపు పూర్తి అయినట్లు అమెరికా అధికారులు కూడా చెప్పారు. ఈ వాణిజ్య చర్చల తుదిదశలో కూడా అమెరికా సెక్షన్‌ 301కింద ఆంక్షలు విధించటం గూర్చి మాట్లాడింది. శ్రామిక శక్తి వినియో గం దర్యాప్తులో ఉన్న దేశాలపై (భారత్‌ సహా) 12.5 శా తం డ్యూటీ విధించటానికి ఈ సెక్షన్‌ ఉద్దేశించబడింది.
భారత్‌ వాణిజ్య ఒప్పందం వివరాలు తెలియనప్పటికీ, అమెరికా కేవలం తన ప్రయోజనాల కోసమే ఒప్పందంపై సంతకాలకు భారత్‌ను తొందరపెడుతోందని అనేకమంది వాణిజ్యనిపుణులు వ్యక్తం చేస్తున్న భయసందేహాలను క్రిష్టఫర్‌ లాండే ప్రకటన ధృవీకరిస్తుంది.
భారతదేశం ప్రపంచంలో అతిఎక్కువ జనాభా కలిగిన దేశం. దాని ఆర్థిక వ్యవస్థ వృద్ధిగతిలో ఉంది. దాని వృద్ధి తన వనరులు, మానవ పెట్టుబడి, ఇంకా ఇతర ఆస్తులపై ఆధారపడి వుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం తప్పక అవసరం. అయితే అది సమాన ప్రాతిపదికపై ఉండా లి. ఏ దేశాన్ని అది ఎంత శక్తివంతమైనదైనా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని అణచివేసేందుకు దాన్ని అనుమతించరాదు. అమెరికాతో సంప్రదింపుల సమయంలో భారతదేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని నొక్కి చెప్పటం యుఎస్‌ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ క్రిష్టఫర్‌ లాండాకు గట్టి సమాధానమవుతుంది. చైనా తనేమిటో చెప్పింది. అమెరికాతో సమాన ప్రాతిపదికపై వ్యవహారం చేయటం ద్వారా భారత్‌ కూడా అదే చేయగలదు.

ట్యాగ్‌లు: America gdp India