Skip to content
ప్రపంచం వార్తలు

India-Pakistan Ceasefire: భారత్-పాక్ అణు యుద్ధాన్ని నేనే ఆపాను.. నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే.. డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

Prajapaksham 09 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
India-Pakistan Ceasefire: భారత్-పాక్ అణు యుద్ధాన్ని నేనే ఆపాను.. నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే.. డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

India-Pakistan Ceasefire: భారత్-పాక్ అణు యుద్ధాన్ని నేనే ఆపాను..నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే.. డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

India-Pakistan Ceasefire: గ్లోబల్ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అత్యంత వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య గతేడాది (2025) తలెత్తిన తీవ్ర సైనిక ఉద్రిక్తతలను..యుద్ధంగా మారకుండా నివారించడంలో తాను కీలక పాత్ర పోషించానని బుధవారం మరోసారి తెలిపారు. రాయల్ ఎయిర్ ఫోర్స్ మిల్డెన్‌హాల్‌లోని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. తన దౌత్యపరమైన జోక్యం కారణంగానే రెండు దేశాల మధ్య రాబోయే అణు యుద్ధం తప్పిందని.. ఈ విజయానికి గానూ తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కాలన్నారు

తాను రంగంలోకి దిగడానికి ముందే అణ్వాయుధాలు కలిగిన ఆ రెండు పొరుగు దేశాల మధ్య యుద్ధం పతాక స్థాయకి చేరిందన్నారు. ఒకసారి ఆలోచించండి.. భారత్- పాకిస్తాన్ మధ్య వారం రోజుల పాటు భీకరమైన యుద్ధం సాగింది. ఆ సమయంలో 11 విమానాలను కూల్చివేశారు. అది ఏ క్షణంలోనైనా అణుయుద్ధంగా మారే పరిస్థితి వచ్చిందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధాన్ని ఆపడంలో తాను పోషించిన పాత్రను పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్వయంగా ప్రశంసించారని ట్రంప్ వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్ చొరవ వల్ల 30 నుంచి 50 మిలియన్ల (3 నుంచి 5 కోట్ల) మంది ప్రాణాలు కాపాడినట్లు పాక్ ప్రధాని తనతో అన్నారని తెలిపారు. కానీ నిజానికి అంతకంటే చాలా ఎక్కువ మందినే నేను కాపాడి ఉండవచ్చని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

భారత్- పాకిస్తాన్‌లు పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తే తీవ్రమైన ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తాను గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు ట్రంప్ చెప్పారు. మీరు గనుక యుద్ధం ఆపకపోతే.. మీ దేశం నుండి వచ్చే వస్తువులపై 200 శాతం సుంకం (Tariff) విధిస్తానని భారత్‌కు చెప్పాను. అవతలి దేశానికి (పాకిస్తాన్‌కు) కూడా అదే విషయం స్పష్టం చేశానని ట్రంప్ తన వ్యూహాన్ని వివరించారు.

ఈ సందర్భంగా తాను కేవలం భారత్-పాక్ మాత్రమే కాకుండా.. అజర్‌బైజాన్-అర్మేనియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో-రువాండా వివాదాలతో సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని ట్రంప్ నొక్కిచెప్పారు. వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, కొరినా మచాడో కూడా అంతర్జాతీయ వివాదాల పరిష్కారంలో ఈ గౌరవానికి ట్రంప్ తప్ప ఎవరూ ఎక్కువ అర్హుడు కాదని బహిరంగంగా అన్నట్లు ఆయన గుర్తు చేశారు. ఇప్పటివరకు నోబెల్ శాంతి బహుమతి పొందిన వారందరి కంటే ఎక్కువగా ఆ పురస్కారాన్ని నేనే గెలుచుకోవాల్సింది.. ఎందుకంటే ఇంతవరకు ఎవరూ ఇన్ని యుద్ధాలను పరిష్కరించలేదని ట్రంప్ అన్నారు.

అయితే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వాదనలను భారతదేశం పదేపదే.. పూర్తిగా ఖండించింది. భారత్-పాక్ వివాదంలో ఎలాంటి మూడవ పక్షం (Third-party) లేదా అమెరికా మధ్యవర్తిత్వం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ (DGMOలు) మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారా మాత్రమే సైనిక చర్యను నిలిపివేసే అవగాహన కుదిరిందని ఇండియా తేల్చిచెప్పింది.

2025 ఏప్రిల్‌లో కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడిలో 26 మంది మరణించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీనికి ప్రతిస్పందనగా.. భారతదేశం ఆపరేషన్ సింధూర్ కింద.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అంతటా ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై అత్యంత ఖచ్చితమైన (Precision) వైమానిక, సైనిక దాడులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *