Skip to content
జాతీయం వార్తలు

Diabetes Patients: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్.. రోజువారీ ఇంజెక్షన్లకు ఇక గుడ్‌బై.. వారానికి ఒక్కటి చాలు..

Prajapaksham 09 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Diabetes Patients: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్.. రోజువారీ ఇంజెక్షన్లకు ఇక గుడ్‌బై.. వారానికి ఒక్కటి చాలు..

Diabetes Patients: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్.. రోజువారీ ఇంజెక్షన్లకు ఇక గుడ్‌బై.. వారానికి ఒక్కటి చాలు..

Diabetes Patients: డయాబెటిస్ చికిత్సలో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది. ఎంతోమందిని వేధిస్తున్న మధుమేహం (డయాబెటిస్) చికిత్సలో తాజాగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ముందడుగు పడింది. రోజువారీ ఇన్సులిన్ ఇంజెక్షన్ల నరకం నుండి రోగులకు ఉపశమనం కలిగిస్తూ.. వారానికి కేవలం ఒక్కసారి మాత్రమే తీసుకునే సరికొత్త బేసల్ ఇన్సులిన్ ఇప్పుడు భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ నోవో నార్డిస్క్ (Novo Nordisk) ఈ ఇన్సులిన్‌ను అవిక్లీ (Awiqli) పేరుతో భారత మార్కెట్లో లాంచ్ చేసింది. టైప్-1, టైప్-2 మధుమేహం ఉన్న రోగులందరికీ ఈ ఇంజెక్షన్ ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

సాధారణంగా ఇన్సులిన్‌పై ఆధారపడే డయాబెటిస్ రోగులు రోజుకు కనీసం ఒక్కసారైనా (కొందరైతే అంతకంటే ఎక్కువసార్లు) ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఏడాదికి 365 రోజులూ సూది గుచ్చుకోవాల్సి వస్తుంది. అయితే కొత్తగా వచ్చిన అవిక్లీ ఇన్సులిన్‌తో వారానికి ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఏడాది మొత్తంలో 365 ఇంజెక్షన్ల స్థానంలో కేవలం 52 ఇంజెక్షన్లు వేసుకుంటే చాలు. రోజూ సూది తీసుకోవాలనే భయం.. నొప్పి కారణంగా చాలామంది ఇన్సులిన్ వాడకాన్ని వాయిదా వేస్తుంటారని.. అలాంటి వారి సమస్యకు ఈ కొత్త చికిత్స అద్భుతమైన పరిష్కారమని కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం మన దేశంలో దాదాపు 10.1 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. మరో 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్ (మధుమేహం వచ్చేందుకు సిద్ధంగా ఉన్న దశ) లక్షణాలతో ఉన్నారు. అలాగే దేశంలో తొమ్మిది లక్షల మందికి పైగా టైప్-1 మధుమేహ బాధితులు ఉండగా.. టైప్-2 బాధితుల్లో కూడా చాలా మందికి ఇన్సులిన్ వాడకం తప్పనిసరి అవుతోంది. ఇంతటి భారీ జనాభా ఉన్న దేశంలో ఈ కొత్త ఇన్సులిన్ రాక పెద్ద ఊరటనిచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు.

ఈ కొత్త ఇన్సులిన్‌ను ఫ్లెక్స్‌టచ్‌ పెన్‌’ (FlexTouch Pen) ద్వారా వారానికి ఒకసారి సులభంగా తీసుకోవచ్చు. తక్కువసార్లు ఇంజెక్షన్ తీసుకోవాల్సి రావడం వల్ల రోగులు చికిత్సను మధ్యలో ఆపేయకుండా క్రమం తప్పకుండా కొనసాగించే అవకాశం పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర (షుగర్) స్థాయిలను నియంత్రించడంలో ఇది రోజువారీ తీసుకునే ఇన్సులిన్ కంటే మెరుగైన, సురక్షితమైన ఫలితాలను ఇచ్చినట్లు క్లినికల్ ట్రయల్స్ (వైద్య పరీక్షలు) లో రుజువైందని కంపెనీ వెల్లడించింది. రోజూ ఇంజెక్షన్లు వేసుకోవడం కష్టంగా అనిపించి డయాబెటిస్‌ను నిర్లక్ష్యం చేసే వారికి అవిక్లీ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని.. దీనివల్ల మధుమేహ నియంత్రణ మరింత సులభతరం అవుతుందని వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *