Iran Ceasefire Over: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. టర్కీకి ఎఫ్-35 ఫైటర్ జెట్స్.. నాటో సమావేశంలో ట్రంప్ సంచలన ప్రకటనలు..
Iran Ceasefire Over: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. టర్కీకి ఎఫ్-35 ఫైటర్ జెట్స్.. నాటో సమావేశంలో ట్రంప్ సంచలన ప్రకటనలు..
Iran Ceasefire Over: పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులు ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం రావణకాష్టంలా మారింది. ఈ పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయంగా పెను సంచలన వ్యాఖ్యలు చేశారు. టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో (NATO) సదస్సులో పాల్గొన్న ఆయన.. ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఒప్పందం ముగిసిపోయిందని అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా దాడులు చేయడం.. దానికి ప్రతికారంగా బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ అటాక్ చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరాన్‌తో నెలకొన్న సంక్షోభం, సీజ్‌ఫైర్ ప్రస్తుత స్థితిపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. నా వరకు ఇరాన్‌తో కాల్పుల విరమణ అధ్యాయం ముగిసిపోయింది. ఇకపై టెహ్రాన్‌తో వైరాన్ని నేను కోరుకోవడం లేదు కానీ.. ఆ దేశంతో డీల్ చేయడం అంటే సమయాన్ని వృధా చేసుకోవడమే. వాళ్లు నిరంతరం అబద్ధాలు చెబుతున్నారు, చీటింగ్ చేస్తున్నారు, వాళ్లంతా వ్యాధిగ్రస్తులు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయినప్పటికీ ఇరాన్‌తో చర్చల ప్రక్రియను మాత్రం కొనసాగిస్తామని ఒకవైపు చెబుతూనే.. ఆ దేశ నమ్మకద్రోహాన్ని సహించేది లేదని హెచ్చరించారు.
ఇదే వేదికపై ట్రంప్ మరో కీలక వ్యూహాత్మకమైన ప్రకటన చేశారు. టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డొగాన్‌తో ద్వైపాక్షిక భేటీ అనంతరం మాట్లాడుతూ.. టర్కీకి అత్యంత ఆధునిక ఎఫ్-35 (F-35) ఫైటర్ జెట్లను విక్రయించనున్నట్లు వెల్లడించారు. గతంలో (2019లో) రష్యా నుండి ఎస్-400 (S-400) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కొనుగోలు చేసినందుకు గానూ టర్కీపై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఆంక్షలు తొలగించడం ద్వారా ఎఫ్-35 విమానాల విక్రయానికి లైన్ క్లియర్ కానుందని.. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.
టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాలను విక్రయించాలన్న ట్రంప్ నిర్ణయంపై అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ప్రతిపాదనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ విషయాన్ని ట్రంప్‌తో వ్యక్తిగతంగా కూడా ప్రస్తావించినట్లు తెలిపారు. టర్కీకి అధునాతన ఆయుధాలు ఇస్తే పశ్చిమాసియాలో అధికార సమతుల్యత (Balance of Power) పూర్తిగా దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు.
టర్కీని అమెరికా ఒక మిత్రదేశంగా భావించకూడదని నెతన్యాహు హితవు పలికారు. టర్కీకి ఉగ్రవాద సంస్థ ముస్లిం బ్రదర్‌హుడ్ తో బలమైన సంబంధాలు ఉన్నాయని, ఆ దేశ అధ్యక్షుడు ఎర్డొగాన్ నేరుగా హమాస్ కు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా టర్కీలో రికార్డు స్థాయిలో జర్నలిస్టులను, ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెడుతున్నారని గుర్తు చేస్తూ.. ఏ రకంగా చూసినా అమెరికాకు తగిన భాగస్వామి టర్కీ కాదని నెతన్యాహు బహిరంగంగానే విమర్శించారు.