Skip to content
జాతీయం వార్తలు

ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు భరోసా కోసం జులై 10న బంద్‌

Prajapaksham 08 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు భరోసా కోసం జులై 10న బంద్‌

ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు భరోసా కోసం జులై 10న బంద్‌

రాష్ట్రంలో విద్యారంగం రోజు రోజుకూ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చాలా ప్రభుత్వ విద్యాసంస్థల్లో క్లాస్‌ రూమ్‌లు, తాగునీరు, టాయిలెట్లలాంటి మౌలిక వసతులు కరువయ్యాయి. ఖాళీ టీచర్‌ పోస్టులు వెంటాడుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల బకాయిలు, ప్రైవేట్‌ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మీద ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. రాష్ట్రం వస్తే విద్యారంగ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని, నిధులు వస్తాయనుకుంటే విద్యారంగాన్ని పాలకులు చిన్నచూపు చూస్తున్నారు. మారింది రాష్ట్రమే తప్ప విద్యార్థుల భవిష్యత్‌ మాత్రం కాదు. కాంగ్రెస్‌ అయినా, బిఆర్‌ఎస్‌, బిజెపి అయి నా అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడమేగానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు.
రాష్ట్రంలో విద్యశాఖకు ప్రత్యేకంగా ఒక మంత్రి లేరు. ఆ శాఖ సిఎం వద్దే ఉండడంతో విద్యారంగం మరింత అభివృద్ధి చెందుతుందనుకుంటే మరిన్ని కొత్త సమస్యలు ఎదుర్కొంటుంది. 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4వేల పాఠశాలలకు కుదిస్తామని స్వయంగా సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించడం అంటే.. ప్రభుత్వ విద్యను బొందపెట్టడమే. చదువు కొనుక్కోలేని పేద విద్యార్థులను చదువుకు దూరం చేయడమే. రాష్ట్రంలో ఇప్పటికే 2,763 స్కూళ్లలో టాయిలెట్లు లేకపోవడం స్కూళ్ల దుస్థితికి అద్దం పడుతోంది. ఉన్నవాటిలోనూ చాలాచోట్ల నీళ్లు లేక నిర్వహణ సరిగ్గాలేవు.
పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఆసరాగా ఉన్న ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలను గత కెసిఆర్‌ ప్రభుత్వం గతంలోనే రెండున్నరేళ్లు పెండింగ్‌లో పెట్టింది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికీ 30 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు సుమారు రూ.10వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్షిప్‌ బకాయిలు విడుదల చేయలేదు. మరోవైపు పైసలు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను సతాయిస్తున్నాయి. ఫీజు రియంబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుకున్న విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేక ఉన్నత చదువులకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి, తలతాకట్టుపెట్టి సర్టిఫికెట్లు తీసుకెళ్తున్నారు. ఫుట్‌ బాల్‌ పోటీలకు అందాల పోటీలకు, ఇతర రాష్ట్రాల పత్రికల్లో ప్రకటనలకు, మంత్రుల హెలీకాప్టర్ల ప్రయాణాలకు వందల కోట్లు ఖర్చు పెడుతు న్న ప్రభుత్వం.. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు మాత్రం చెల్లించడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వమే నిర్వీర్యం చేయడం విషాదం.
రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా ఇప్పటివరకు విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్‌, నోట్‌ బుక్స్‌ పూర్తి స్థాయిలో అందలేదు. స్కూళ్ల ప్రారంభానికి ముందే సమకూర్చాల్సిన ప్రభు త్వం కాలయాపన చేస్తుండడంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోకి రావడానికి వెనుకంజ వేస్తున్నారు. మరోవైపు ప్రైవేట్‌ కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలు ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతూ విద్యా వ్యాపా రం చేస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నాయి. ఎల్‌కేజీకి రాష్ట్రంలో రూ.లక్ష ఫీజు ఉంటే ఇంటర్‌ ఫీజు రూ.5లక్షలు ఉంది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలపై ప్రభుత్వ విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేదు. అనుమతి లేని పాఠశాలలు, కళాశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు జైళ్లకంటే హీనం గా మారి నిబంధనలు పాటించడం లేదు. రాష్ట్రం లో ఉన్న 33 జిల్లాల్లో సగానికి పైగా డిఇఒలు ఇన్చార్జిలే ఉన్నారు. ఎంఇఒలంతా ఇన్‌చార్జీలే. సంక్షేమ హాస్టల్‌, గురుకులాలు అనేకం అద్దె భవనాల్లో నిర్వహిస్తుండడంతో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణం గా విద్యార్థుల మెస్‌ చార్జీలు, కాస్మోటిక్‌ చార్జీలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ప్రభుత్వం సంక్షేమ హాస్టల్‌, గురుకులాలు, కెజిబివిలు, మోడల్‌ స్కూళ్ల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తోంది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదు. ప్రతి ప్రభు త్వ పాఠశాల, ప్రతి జూనియర్‌ కళాశాల, హాస్టళ్లకు కరెంట్‌, ఇంటర్నెట్‌, తాగునీరు, మరుగుదొడ్లు, వంట షెడ్లు నిర్మించాలి. కెజి నుంచి పిజి వరకు ప్రతి విద్యార్థికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి. దక్షిణాది రాష్ట్రాలు అనేకం నూతన జాతీయ విద్యా విధానాన్ని(ఎన్‌ఈపీ 2020)ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశాయి. కానీ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం చాపకింద నీరులా విడతలవారీ గా ఎన్‌ఇపి అమలవుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వెంటనే తీర్మానం చేయాలి. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి విద్యార్థినికి ఎలక్ట్రిక్‌ స్కూటీలు, ప్రతి విద్యార్థికి ఉచిత ల్యాప్‌ టాప్‌, ప్రతి విద్యార్థికి, ఇంటింటికి ఉచిత ఇంటర్నెట్‌, ఐదు లక్షల విద్యా భరోసా కార్డులాంటి హామీలను నెరవేర్చాలి.
ఈ నేపథ్యంలోనే విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యారంగ సమస్యల పరిష్కారంకోసం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 10న రాష్ట్రవ్యాప్తం గా పాఠశాలలు, కళాశాలల బంద్‌కి పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్‌ విజయవంతానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు సహకరించాలి. విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి ఒక్క చెంప పెట్టు లాగా జులై 10న రాష్ట్రంలో ఉన్న ఏ విద్యార్థి బడికి పోకుండా, ఏ విద్యార్థి విద్యాసంస్థ బస్సు ఎక్కకుండా బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ బంద్‌ ద్వారా అయినా ప్రభుత్వంలో చలనం కలిగి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఆశిస్తున్నాం.
కసిరెడ్డి మణికంఠ రెడ్డి – ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ట్యాగ్‌లు: Bandh Nation bandh Protest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *