Ayodhya Ram Mandir Donation Row: దోచుకునే హిందువులే అధికారంలో ఉన్నారు.. కాషాయంపై మండిపడిన ఉద్ధవ్ థాకరే
దోచుకునే హిందువులే అధికారంలో ఉన్నారు.. కాషాయంపై మండిపడిన ఉద్ధవ్ థాకరే
Ayodhya Ram Mandir Donation Row: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలతో పాటు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే ఆదివారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దోపిడీకి పాల్పడే హిందువులే ప్రస్తుతం అధికారంలో ఉన్నారని ఆరోపిస్తూ.. ఈ అవినీతిపై నిష్పక్షపాత విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ముంబైలోని దాదర్ ప్రాంతంలో ఉన్న హనుమాన్ ఆలయం వెలుపల శివసేన (యూబీటీ) శ్రేణులు హనుమాన్ స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠిస్తూ రామ రక్షా పేరిట ఒక నిరసన ఆందోళన చేపట్టాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ.. హిందుత్వను అడ్డం పెట్టుకుని ఆలయాలను దోచుకునే వారిని హిందూ సమాజం ఎప్పటికీ వదిలిపెట్టదని హెచ్చరించారు. కాషాయ రంగు కుర్తాలు ధరించి, హిందూ ప్రయోజనాలను పరిరక్షించాల్సిన వారే ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
దోపిడీకి పాల్పడిన వారే అధికారంలో ఉన్నప్పుడు వారిని విచారణ జరపమని అడగలేమని.. అందుకే ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు జరగాలని స్పష్టం చేశారు. ఒకప్పుడు బీజేపీ వాడిన నినాదాలను గుర్తుచేస్తూ.. అయోధ్య ఒక ట్రైలర్ మాత్రమేనని, కాశీ, మధుర ఇంకా రావాల్సి ఉందని అన్నారని.. అయితే అక్కడ కూడా ఎలాంటి దోపిడీ జరుగుతుందోనని ఇప్పుడు తనకు ఆందోళనగా ఉందన్నారు. తాము పరాక్రమవంతులైన, దేశాన్ని ప్రేమించే హిందువులమే కానీ.. మూర్ఖులం కాదని, మతం పేరుతో జరిగే అవినీతిని సహించబోమని నొక్కి చెప్పారు.
ఈ ఆర్థిక అవకతవకల వ్యవహారం జూన్ 7న మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఉత్తర ప్రదేశ్ పోలీసులు జూన్ 25న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ విరాళాల సేకరణ, లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు. భక్తుల కానుకల నిర్వహణలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సిట్ ప్రస్తుతం లోతుగా పరిశీలిస్తోంది.
మరోవైపు ఈ వివాదం తీవ్రం కావడంతో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టడానికి, నిష్పక్షపాత విచారణకు తాము కట్టుబడి ఉన్నామని ట్రస్ట్ ప్రకటించింది. అయోధ్య ఆలయ విరాళాల వ్యవహారం దేశంలోని ఇతర ప్రముఖ దేవాలయాల నిర్వహణపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ శ్రీ బద్రీనాథ్ ధామ్‌లో భక్తులు సమర్పించిన కానుకల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అక్కడి అధికారులు ఇటీవల విచారణకు ఆదేశించారు.