Skip to content
ప్రపంచం వార్తలు

బీయా లుంప్కిన్ (1918-2026) జీవితం పోరాటం

Prajapaksham 01 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
బీయా లుంప్కిన్ (1918-2026) జీవితం పోరాటం

Bea Lumpkin

9 దశాబ్దాలపాటు అమెరికన్‌లను ప్రభావితం చేసిన కమ్యూనిస్టు
ప్రముఖ అమెరికన్‌ కమ్యూనిస్టు నాయకురాలు బీయాట్రెన్‌ పాపిరో లుంప్‌కిన్‌ తమ 108వ జన్మదినోత్సవానికి కొద్దివారాల ముందుగా జాన్‌ 14,2026 అర్ధరాత్రి తర్వాత కన్నుమూశారు. “ఉద్యమ మాతృమూర్తి”గా కార్మికులు, ప్రగతిశీల నాయకులు ప్రేమతో పిలుచుకునే ఆమె 20వ, 21వ శతాబ్దాల్లో అసంఖ్యాకమైన ప్రజలను, ఉద్యమాలను ప్రభావితం చేసిన క్రియాశీలి,
ఆర్గనైజర్‌, టీచర్‌.
బీయా తమ ఆవేశ స్వభావాన్ని తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందారు. వారు రష్యా నుంచి 1905లో అమెరికాకు వలస వచ్చేముందు రష్యాలో వారు యూదు విప్లవకారులు. బీయా తండ్రి ఎన్‌రోమ్‌ హిర్షెన్‌ షాపిరో అనే కొత్త పేరుతో పాస్‌పోర్టు సంపాదించి న్యూయార్క్‌ నగరంలో అడుగుపెట్టారు. తల్లి దోరా ఒక సంవత్సరం తర్వాత ఆయన్ను చేరుకున్నారు. బీయా కుటుంబం 1927లో ప్రధానంగా యూదు కార్మికులు నివసించే హంటర్‌ పాయింట్‌ నైబర్‌హుడ్‌ బ్రాంక్స్‌ చేరారు. దోరా, మోరిస్‌ చిన్న లాండ్రీ దుకాణం తెరిచారు. బీయా తన బాల్యం అక్కడే గడిపారు. యూనియన్‌గా ఏర్పడిన ఫ్యాక్టరీ కార్మికులు అక్కడ చేరుతుండేవారు. బీయా తల్లిదండ్రులు తమ సోషలిస్టు దృక్పథం నిలుపుకున్నారు. “నేను ఏ పక్షమో నా పుట్టుకతోనే తెలిసింది” అంటారు బీయా. ఆమె 9వ ఏట పాసైన్‌, ఎన్‌.జెలో జౌళి కార్మికుల సమ్మెను బలపరచటానికి తొలిసారి రైలు ఎక్కారు. ఆమె స్కూలు పత్రిక ఎడిట్‌ చేశారు. అరిస్టా హానర్‌ సొసైటీ సభ్యురాలు. అయితే 1931 మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవ ప్రదర్శనలో పాల్గొనటానికై స్కూలుకు ఎగనామం పెట్టినందుకు ఆమెను ఆ బాధ్యతలన్నిటి నుంచీ తొలగించారు. 1933లో మోన్రో హైస్కూల్‌లో ఆమె పోరాట ప్రసంగం తర్వాత 15ఏళ్ళ బీయా నేషనల్‌ స్టూడెంట్స్‌ లీగ్‌లో చేరారు. ఆ తర్వాత కొద్ది కాలానికే యంగ్‌ కమ్యూనిస్టు లీగ్‌లో చేరారు. బీయా తరచూ అంటుంటారు : “అప్పటి నుంచి నాకు తీరిక లేదు. ఆకలిగొన్న కుటుంబాలకు ఆహారంకోసం ఎప్పుడూ కార్మికుల సమ్మెలు జరుగుతుండేవి. ‘డైలీ వర్కర్‌’ పత్రిక అమ్మటానికి తలుపులు తట్టేదాన్ని, లేదా ఓటు వేయటానికి జనాలను తీసుకొచ్చేదాన్ని”. హిట్లర్‌ని, తలెత్తుతున్న ఫాసిజాన్ని ఖండిస్తూ ఆమె ప్రసంగాలు చేసేవారు. 1934 లో హైస్కూలు విద్య తర్వాత ఉచిత విద్య అందించే సిటీ కాలేజి హంటర్‌ కాలేజీలో చేరారు.
హంటర్‌ కాలేజిలో పాలధర ఐదు నుంచి ఆరు సెంట్‌లకు పెంచినపుడు బీయా తదితర యంగ్‌ కమ్యూనిస్టు లీగ్‌ సభ్యులు బాయ్‌కాట్‌ నిర్వహించి, పెంచిన ధర ఉపసంహరించేటట్లు యాజమాన్యానికి నచ్చజెప్పారు. నాజీ జర్మనీ రాయబారి సందర్శనకు వ్యతిరేకంగా నిరసన నిర్వహించి డీన్‌ బ్లాక్‌లిస్ట్‌లో చేరారు. కొద్ది వారాల అనంతరం శాంతి కోసం విద్యార్థుల సమ్మెలో తన క్లాస్‌మేట్స్‌ను ప్రోత్సహించి వారు చేరేటట్లు చేసిన బీయాని డీన్‌ సస్పెండ్‌ చేశారు.
1930వ దశకంలో న్యూయార్క్‌, ఇతర నగరాలు పరివర్తన చెందుతున్న కాలంలో ఆమె అనేక కార్మిక సమ్మెల్లో చురుకుగా పాల్గొన్నారు. 1935లో డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌ ముందు పికెటింగ్‌కు గాను బీయా తొలిసారి అరెస్టు అయినారు. ఆమెకు నిండా 20ఏళ్లు పూర్తి కాలేదు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఆర్గనైజేషన్స్‌(సిఐఒ) కింద న్యూ యార్క్‌ నగరంలో 30వేల కు పైబడిన లాండ్రీ కార్మికులను ఆర్గనైజ్‌ చేసేందు కు 1937లో సిఐఒ రిక్రూ ట్‌ చేసిన 30మంది ఆర్గనైజర్లలో ఆమె ఒకరు. లాండ్రీ కార్మికుల్లో అత్యధికులు ఆఫ్రికన్‌ అమెరికన్‌ స్త్రీలు. వారి జీవితాలు దుర్భరంగా ఉండేవి. ఆర్గనైజర్లు ప్లాంట్‌ వైపు వస్తున్నారని తెలియగానే కార్మికులు పరుగెత్తుకువచ్చి, ‘ఓ సిఐఒ అమ్మాయీ, మాకూ యూనియన్‌ కావాలి’ అని అరిచేవారు. కొద్ది మాసాల్లోనే బీయా 20వేల మంది కార్మికుల ను లాండ్రీ వర్కర్స్‌ ఇండస్ట్రియల్‌ యూనియన్‌లో నమోదు చేశారు. ఆమె
ద్యోగాలు మారుతూ 1942లో బఫెలో చేరారు.
సిల్వానియా రేడియోలో ఎలక్ట్రానిక్స్‌ తనిఖీ ఉద్యోగంలో చేరారు.
1940 దశకంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. వారి పేర్లు కార్ల్‌, జీన్‌లీ. మొదటి భర్త నుండి 1946లో విడాకులు తీసుకున్న తదుపరి ఒక మంచి కుటుంబంలో ఫ్రాంక్‌ లుంప్‌కిన్‌ను వివాహం చేసుకున్నారు. వారి వివాహం 1949 అక్టోబర్‌ 22న షికాగోలో జరిగింది. వారికి ఇద్దరు సంతానం కలిగారు. గర్భవతి అనే కారణాన బీయా అలైడ్‌ రేడియోలో ఉద్యోగం కోల్పోయారు.
అది మెకార్తీ కాలం. ఎఫ్‌బిఐ ఏజంట్లు ఈ అంతర్‌ వర్ణ దంపతుల గూర్చి వాకబు చేస్తున్నా ఫ్రాంక్‌, బీయా ఇద్దరూ సమాజ సేవలో నిమగ్నమైనారు. త్రాగునీటిలో మురుగునీరు కలుస్తున్నదానికి వ్యతిరేకంగా వారు పదేళ్ల పోరాటం చేశారు. సిటీ అప్పుడు పారిశుద్ధ్య కార్మికులను నియమించింది. లుంప్‌కిన్‌లు అనేక పౌరహక్కుల పోరాటాల్లో పాల్గొన్నారు. వాటి ఫలితంగా1964, 1965లో పౌరహక్కులు, ఓటింగ్‌ హక్కులు చట్టాలు వచ్చాయి.
బీయా తమ 47వ ఏట ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. షికాగో పబ్లిక్‌ స్కూల్‌లో టీచర్‌గా చేరారు. ఉత్తరోత్తరా మాల్కొం ఎక్స్‌ కాలేజీలో గణితంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ స్థాయికి చేరారు. ఆఫ్రికన్‌ అమెరికన్‌ స్టడీస్‌, లాటినో స్టడీస్‌, మహిళల స్టడీస్‌ కోసం విద్యార్థుల డిమాండ్‌ను స్వాగతించారు. పాఠ్యపుస్తకాలు ఈ విషయాలకు చాలామేరకు స్థానం కల్పించనందున ఆమె పరిశోధకురాలు, గ్రంథ రచయిత అయి బహుళ సంస్కృతుల విద్యను ప్రతిపాదించారు. గణితం, సైన్స్‌లో బహుళ సంస్కృతుల మూలాలపై ఆమె పరిశోధనాత్మక వ్యాసా లు, గ్రంథాలు రచించారు. బీయా విద్యారంగంలో కృషి చేస్తూనే ఆర్గనైజింగ్‌, రాజకీయ కార్యకలాపాలు కొనసాగించారు. 1974లో ‘కోయిలేషన్‌ ఆఫ్‌ లేబర్‌ యూనియన్‌ ఉమన్‌’ వ్యవస్థాపక సమావేశంలో పాల్గొన్నారు. సిఎల్‌ యు డబ్ల్యు జాతీయ కార్యవర్గం బోర్డులో సభ్యురాలి గా, దాని షికాగో చాప్టర్‌ కార్యవర్గంలో ఇరవై ఏళ్లపాటు సభ్యురాలిగా పనిచేశా రు. కొత్తగా ట్రేడ్‌ యూనియన్‌లలోకి వచ్చే సోదరీమణులకు చోదకశక్తిగా
సహాయమందించారు.
1979లో బీయా, ఫ్రాంక్‌ షికాగో సౌత్‌ షోర్‌ వాడ కు మకాం మార్చారు. 1983లో మేయర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆఫ్రికన్‌ హరాల్డ్‌ వాషింగ్టన్‌ విజయానికి తోడ్పడ్డారు. విస్‌కాన్‌సిన్‌ స్టీల్‌ కర్మాగారం కార్మికులకు జవాబుదారీగా ఉండేందుకు ఫ్రాంక్‌ 17సంవత్సరాల పాటు అవిరామ పోరాటం చేశారు. అది 1980లో మూతపడినప్పటికీ బీయా మద్దతుతో, లేబర్‌ లాయర్‌ సహాయంతో న్యాయ పోరాటం సాగించి మాజీ కార్మికులకు 19మిలియన్‌ డాలర్లు రాబట్టారు. ఆయన 2010లో మరణించారు.
2013 బీయా తమ ఆత్మకథ “జాయ్‌ ఇన్‌ స్ట్రగుల్‌ : మై లైఫ్‌ అండ్‌ లవ్‌” ప్రచురించారు.
ఆమె తమ 90వ ఏట వయో వివక్షకు వ్యతిరేకంగా సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌పై పోరాటం చేశారు.100వ సంవత్సరంలో చికాగోలో కార్మికవాడలో తిరిగి లేబర్‌ పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేశారు. ‘కార్మిక హక్కులు పురోగమించినపుడే మహిళల హక్కులు, పౌరహక్కులు మంచి గా పురోగమిస్తాయని’ ఆమె విశ్వసించారు. అధ్యక్షునిగా బారక్‌ ఒబామా ఎన్నిక, తిరిగి ఎన్నికకు ఆమె ఎంతో కష్టపడి ప్రచారం చేశారు. బీయా వృద్ధాప్యంలో కూడా ఇల్ల్లినోయిస్‌ అలయెన్స్‌ ఆఫ్‌ రిటైర్డ్‌ అమెరికన్స్‌ కార్యవర్గంలో, ఇంకా స్టీల్‌ వర్కర్స్‌, టీచర్స్‌ యూనియన్‌ రిటైరీ సంఘాల్లో పనిచేశారు.2012లో షికాగో టీచర్ల సమ్మెను బలపరుస్తూ కమ్యూనిటీ సభ్యులతో నడిచారు.
2017లో ఇల్లినోయిస్‌, షికాగోల్లో రిటైరీస్‌, యువకార్మికుల కోయిలేషన్‌ ఇంటర్‌జెన్‌ ఏర్పాటుకు ఆమె సహాయపడ్డారు. ఈ అంతర్‌తరాల, బహుళ వర్ణ గ్రూపు 15 డాలర్ల కనీస వేతనం కోసం, ఫ్రీ ట్యూషన్‌ ఇల్లినోయిస్‌, అందుబాటులో వైద్యం, సామాజిక భద్రత పరిరక్షణ కోసం కృషిని బలపరిచింది.
2020లో కోవిడ్‌ మహమ్మారితో లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా, ఆ సంవత్సరం జరిగిన కీలకమైన ఎన్నికల్లో ఓటు వేసేందుకు మొత్తం శరీరాన్ని కప్పిన హజ్మత్‌ సూట్‌తో వీధుల్లోకి వచ్చిన బీయా ఫోటోలు టెలివిజన్‌ స్క్రీన్‌లపై కనిపించాయి, వార్తాపత్రికల మొదటి పేజీలకెక్కాయి. అప్పుడామె వయస్సు 102. కోవిడ్‌ సమసిపోయాక ఆమె మళ్లీ ట్రేడ్‌ యూనియన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.2022లో షికాగో కార్మిక ఉద్యమం ఆమెను ‘గ్రాండ్‌ మార్షల్‌ ఆఫ్‌ ది లేబర్‌ డే పెరేడ్‌’తో సత్కరించింది. అమెరికన్‌ కమ్యూనిస్టు పార్టీ పత్రిక ‘పీపుల్స్‌ వరల్డ్‌’లో ఆమె చివరి వ్యాసం 2023 సెప్టెంబర్‌లో అచ్చయింది.
“అమెరికాలో ఫాసిస్టు నిరోధించటం ఎలా?” అని ఆమె మార్గదర్శనం చేశారు. 2024 ఎన్నికల్లో మితవాదులను ఓడించటానికి ఐక్య సంఘటనను ఆమె
ప్రోత్సహించారు.
2026 జూన్‌లో ఆమె మరణానంతరం అమెరికా కార్మిక సంఘాలు ఎఎఫ్‌ఎల్‌ దాని అధ్యక్షుడు విజ్‌, షికాగో మేయర్‌, షికాగో టీచర్స్‌ యూనియన్‌, యుఎస్‌ఎ కమ్యూనిస్టు పార్టీ సహా అధ్యక్షుడు జోయిసిమ్స్‌ తదితరులు అర్పించిన నివాళులు కార్మికవర్గానికి బీయా సేవలను ఘనంగా ప్రస్తావించాయి.
ఒక వ్యక్తి చిత్తశుద్ధి, సామాజిక న్యాయంకోసం తపన వ్యక్తుల జీవితాలను, కుటుంబాలను, కమ్యూనిటీలను ఎలా పరివర్త న గావించగలదో చాటిచెప్పింది.ఆమె తన కృషి ద్వారా యువతరంలో ‘మరో ప్రపంచం సాధ్యమే’ నన్న విశ్వా సం కలిగించారు. బీయాట్రె లుంప్‌కిన్‌ వదిలివెళ్లిన చెరగని ముద్రను గుర్తుచేసుకున్నప్పుడు చరిత్రగతిని మార్చగలిగిన మన సామర్థ్యం గూర్చి నిరాశకు తావులేదు.
జెన్నీ కార్సన్‌

ట్యాగ్‌లు: Bea Lumpkin Communist CPI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *