Skip to content
ఎడిట్ పేజి వార్తలు

ఎల్లలు లేని ఆలోచనలు.. కాలాతీత రచనలు..

Prajapaksham 17 Aug 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ఎల్లలు లేని ఆలోచనలు.. కాలాతీత రచనలు..

కొడవటిగంటి కుటుంబరావు

సాహితీ ప్రపంచంలో ‘కొకు’గా సుపరచితుడైన కొడవటిగంటి కుటుంబరావు గురించి రాయాలంటే ముందుగా, ఆయనను ఏ ఒక్క గీటురాయితో కొలవలేమనే విషయాన్ని అంగీకరించి తీరాలి. కథకుడు అని పిలిస్తే వ్యాసకర్తను వదిలేసినట్టే. మార్క్సిస్టు అని ముద్రేస్తే హేతువాదిని కుదించినట్టే. సంపాదకుడు అని గిరిగీస్తే ఆయన సృజనాత్మక విస్తృతిని కప్పిపుచ్చినట్టే. తెనాలిలో 1909 అక్టోబర్‌ 28న పుట్టిన కుటుంబరావు తన ఎనిమిది దశాబ్దాల జీవితంలో సాహిత్యాన్ని ఒక ఆయుధంగా, ఒక కంటి చూపుగా, సమాజాన్ని ఛేదించే పరికరంగా వాడుకున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో, మేనమామ ఇంట పెరిగాడు. గుంటూరులో ఇంటర్‌ చదివి, విజయనగరం మహారాజా కళాశాలలో భౌతికశాస్త్రం అభ్యసించి, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువుల వైపు అడుగులేశాడు. డబ్బు లేమి ఆ చదువును మధ్యలోనే ఆపేసింది. కానీ, ‘ప్రతి విషయాన్ని ఆధారంతో నిరూపించాలి, ప్రతి నమ్మకాన్ని ప్రశ్నించాలి’ అని భౌతికశాస్త్రం నేర్పిన ఒక పాఠం మాత్రం ఆయనతోనే ఉండిపోయింది. ఈ శాస్త్రీయ అవగాహనే ఆయన తర్వాత సమాజాన్ని చదవడానికి ఉపయోగడింది. కుటుంబరావు రచనలు తెరిస్తే మొదట తగిలేది ఒక ఆలోచనాత్మక చురుకుదనం. ఒక ఆచారం ఎం దుకు మొదలైంది? దాని లబ్ధి ఎవరికి దక్కుతోంది? ఇం ట్లో మగవాడికి ఉన్న స్వేచ్ఛ ఆడదానికి ఎందుకు లేదు? పేదరికాన్ని వ్యక్తి తప్పుగా చూపించే ధోరణి వెనుక ఏ ఇలాంటి ప్రశ్నలు ఆయన కథల్లో, నవలల్లో పదేపదే తలెత్తుతాయి. కానీ కుటుంబరావు ఈ ప్రశ్నలను వేసి ఊరుకోడు. వాటి వెనుక దాగిన సామాజిక సంబంధాలను తవ్వి తీస్తాడు. మనిషి ప్రవర్తనను వ్యక్తిగత గు ణంతో కాక, అతని కుటుంబం, ఆర్థిక స్థితి, కులం, వర్గం, రాజకీయ వాతావరణంతో ముడిపెట్టి చూస్తాడు. ఈ కోణమే కుటుంబరావు సాహిత్యానికి ఒక సామాజిక పరిశోధనా స్థాయిని, వివరణల్లో లోతును తెచ్చిపెట్టింది. 1930ల నుంచి 1980ల దాకా సాగిన ఆయన రచనా ప్రస్తానం ఎన్నో సిద్ధాంతాలను చూసింది. వాదనలను విన్నది. సరికొత్త ప్రక్రియలను, విచిత్ర పోకడలను గమనించింది. స్వాతంత్య్రం రాకముందు పరిస్థితులు, వచ్చి న ఆరంభంలో అంచనాలు, ఆ తర్వాత సమాజం కొనసాగుతున్న తీరుతెన్నులను కుటుంబరావు కళ్లారా చూశా డు. తన రచనల్లో పొదిగాడు. అందుకే ఆయన కథలు చదివితే అధికారిక చరిత్ర పుస్తకాల్లో దొరకని ఆనాటి కు టుంబాల, ఉద్యోగుల, నిరుద్యోగుల, స్త్రీల మనోలోకం క ళ్లముందు కదలాడుతుంది. దుర్మార్గపు కట్టుబాట్లు, ఆలోచనా విధానాలు ఆవిష్కృతమవుతాయి.
రచయితగా కుటుంబరావు ఒక ప్రక్రియకు, ఒక సిద్ధాంతానికి, ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాలేదు. మనిషి జీవించే సమాజాన్ని దాని అంతర్గత సంబంధాలతో సహా అర్థం చేసుకోవడానికి సాహిత్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించాడు. అందుకే, ఆయనది ఎల్లలు లే సృజం.. కాలాతీత రచన. ఆయన రచనల్లో ఎన్నో ప్రశ్నలు పాఠకుడి మస్తిష్కంలోకి చొచ్చుకెళ్లి, ఆలోచింప చేస్తాయి. ఇక్కడే కుటుంబరావును సాధారణ సామాజిక రచయిత నుంచి వేరు చేయాలి. ఆయన సమాజంలోని సమస్యలను కేవలం నమోదు చేయలేదు. వాటి వెనుక ప సంబంధాలను అన్వేషించాడు. మనిషి ప్రవర్తనను అతని వ్యక్తిగత స్వభావంతో మాత్రమే వివరించకుండా, అతను నివసించే కుటుంబం, వృత్తి, ఆర్థిక పరిస్థితి, వర్గస్థానం, కుల సంబంధం, లింగ సంబంధం, రాజకీయ వాతావరణం వంటి అంశాలతో కలిపి చూశాడు. ఈ దృక్పథం ఆయన సాహిత్యానికి సామాజిక శాస్త్ర సంబంధమైన లోతును ఇచ్చింది. కుటుంబరావు సామాన్యుల జీవితాలను తరచిచూశాడు. శ్రామికుడి వేదన విన్నాడు. కష్టజీవి కన్నీళ్లకు కలత చెందాడు. మసిళల సమస్యపై స్పందించాడు. ఎంతో గం భీరమైన, కీలకమైన అంశాలను ఎంత లోతుగా విశ్లేషించి రచనలు చేశాడో, అదే స్థాయిలో ‘చందమామ’ కోసం కథలు రాసి, బాల సాహిత్య రథసారథి అయ్యాడు. సాహిత్యాన్ని జీవితంతో, జీవితా న్ని సామాజిక నిర్మాణం తో, సామాజిక నిర్మాణాన్ని ఆర్థిక-రాజకీయ సంబంధాలతో అనుసంధానించడం కు టుంబరావు ప్రత్యేకత. తెలుగు సాహిత్య చరిత్రను సామాజిక పరిణామాల చరిత్రతో కలిపి చదివితే కొడవటిగంటి కుటుంబరావు స్థానం ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది.
సాహిత్యాన్ని జీవితానికి దూరంగా ఉంచి సౌందర్యాన్వేషణగా మాత్రమే చూడటాన్ని ఆయన అంగీకరించలేదు. మనిషి జీవించే భౌతిక పరిస్థితులు, కుటుంబ సంబంధాలు, ఆర్థిక అసమానతలు, లింగ సంబంధాలు, రాజకీయ అధికార నిర్మాణాలు, మూఢనమ్మకాలు, మధ్యతరగతి మానసికత వంటివన్నీ సాహిత్యానికి వస్తువులేనని ఆయన తన సుదీర్ఘ రచనా జీవితంతో నిరూపించారు. మార్క్సిస్టు ఆలోచనల పరిచయం ఆయన ప్రపం చ దృష్టిని మరింత పదును పెట్టింది. భౌతిక వాస్తవాల ను, వర్గ సంబంధాలను, ఉత్పత్తి వ్యవస్థను, ఆస్తి సంబంధాలను పరిశీలించే దృష్టి ఆయనకు లభించింది. అందు కే ఆయన మార్క్సిజాన్ని రాజకీయ నినాదాలుగా కాకుం డా సమాజాన్ని విశ్లేషించే శాస్త్రీయ పద్ధతిగా స్వీకరించా రు. 1942లో ఏర్పడిన అభ్యుదయ రచయితల సంఘం ఆయనకు సహజమైన మేధో వేదికగా మారింది. తరువాత 1970లో ఏర్పడిన విప్లవ రచయితల సంఘంతో నూ ఆయన అనుబంధం కొనసాగింది. సమాజాన్ని, మ నుషులను లోతుగా పరిశీలించే కుటుంబరావు సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆయనకు ‘మనిషి’ అనే పదానికి ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన దృష్టిలో మనిషి ఒంటరిగా ఉండే మానసిక జీవి కాదు. కుటుంబంలో, వృత్తిలో, మార్కెట్‌లో, కుల-వర్గ సంబంధాల్లో, లింగ సంబంధాల్లో, రాజకీయ వ్యవస్థలో జీవించే సామాజిక జీవి. అతని కోరికలను, భయాలను, ప్రేమను, ద్వేషాన్ని, నైతికతను, స్వార్థాన్ని, ఉదాత్తతను ఆ సామాజిక పరిస్థితుల నుంచి విడదీయలేం. ఈ దృక్పథమే ఆయన కథలకు ప్రత్యేకమైన లోతును ఇచ్చింది. పరిసర పరిస్థితుల ప్రభావాలే ఆయనను మధ్యతరగతి మనస్తత్వానికి ప్రతినిధిగా మార్చాయి. అందుకే ఆయన సృజనాత్మక ప్రపంచానికి మధ్యతరగతి జీవితం కేంద్రమైంది. సమాజంలో విస్తరిస్తున్న మధ్యతరగతి ఆధునిక విద్య, ఉద్యోగం, కుటుంబం, సంప్రదాయం, ఆర్థిక ఆశ లు, సామాజిక ప్రతిష్ఠ మధ్య చిక్కుకున్న వర్గం. ఒకవైపు ఆధునికతను కోరుకుంటుంది. మరోవైపు పాత విలువలను పట్టుకుంటుంది. సమానత్వాన్ని మాటల్లో సమర్థిస్తుంది. ఇంట్లో కులం, లింగం, ఆస్తి ఆధారిత అధికారాన్ని కొనసాగిస్తుంది. విద్యను కోరుకుంటుంది. అదే సమయంలో ఆ విద్యను విమర్శనాత్మక ఆలోచనకు కాకుండా ఉద్యో స్థాయి, భద్రత కోసం ఉపయోగిస్తుంది. ఈ వైరుధ్యాలను కుటుంబరావు ఎక్కడా దాచలేదు. ముసుగు వేయలేదు. మధ్యతరగతిని పొగడలేదు. తక్కువ చేసి చూడలేదు. దాని అంతర్గత చలనాన్ని శాస్త్రీయంగా విశ్లేషించారు. మధ్యతరగతిలో చైతన్యం పెరిగితే సమాజ మార్పుకు అది ఒక శక్తిగా మారగలదని బలంగా నమ్మారు. అదే సమయంలో అది తన సౌకర్యాలను కాపాడుకోవడానికి ఆధిపత్య వర్గాల భావజాలాన్ని స్వీకరిస్తే మార్పుకు అడ్డంకిగా మారుతుందని కూడా చూపించారు. ఈ ద్వం ద్వాన్ని అర్థం చేసుకోవడమే కుటుంబరావు సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి కీలకం. తెలుగు కథను కేవలం సంఘటన చెప్పే ప్రక్రియగా కాకుండా సామాజిక చైతన్యాన్ని మేల్కొలిపే సాధనంగా కుటుంబరావు చూశారు. అందువల్ల ఆయన కథల్లో పాత్రల వ్యక్తిగత సమస్యలు కూడా విస్తృతమైన సామాజిక ప్రశ్నలతో ముడిపడి ఉం టాయి. సమాజంలోని విలువలు, ఆధిపత్య సంబంధాలు, ఆర్థిక ఒత్తిళ్లు, లింగ అసమానతలు, నైతిక ద్వం ద్వాలు ప్రతిబింబిస్తాయి. ‘ఎవరో… ఎప్పుడో అనుకున్న మాటలను జ్ఞాపకం ఉంచుకొని, అవన్నీ నిజమేనని గా ఢంగా నమ్మి, వాటిని తు.చ తప్పకుండా ఆచరించడం విజ్ఞత కాదు. విషయం ఏదైనా, నీకో అభిప్రాయం ఉం డాలి. అంతేగానీ, గతంలో చేశామని, తల్లిదండ్రులు పా టించారని, సమాజం విలువను పవిత్రంగా ప్రకటించిందని సాకులు చెప్పవద్దు. ప్రశ్నించకుండా దేనినీ స్వీకరించవద్దు’ అనే మాటలు కుటుంబరావు ఆలోచనా సరళిని, అంతరాత్మను వివరిస్తాయి. మనిషి తన జీవితానికి అడ్డు గా వచ్చేది ఏదైనా సరే, దానిని మార్చాలి. దీనిని హేతువాదంగా మాత్రమే చూడడం పొరపాటు. సామిజిక పరిణామాన్ని అర్థం చేసుకునే భౌతికవాద దృక్పథం కూడా ఇందులో ఇమడి ఉంది. సనాతన ధర్మంపై కుటుంబరా వు చేసిన విమర్శలకు ఈ ఆలోచనా విధానమే కారణం. అందుకే, ఆయన శైలి అడుగడుగునా తప్పులను ఎత్తిచూపుతూ ముందుకు సాగుతుంది. భాష ఆయన భావజాలానికి తగినట్టు విలక్షణంగా ఉంటాయి. తార్కికంగా ఉండే కుటంబరావు రచనలు పాఠకుడి ఉపదేశాలు ఇవ్వవు. ఆలోచించక తప్పని పరిస్థితి కల్పిస్తాయి. పాత్రల ప్రవర్తనలో అంతులేని వైరుధ్యాలు సమాజాన నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంటాయి. చాలా సందర్భాల్లో ఒక రచన చదువుతున్న పాఠకుడు సదరు రచయిత తనను ఎటు తీసుకెళుతున్నాడో అర్థం చేసుకుంటాడు. రాబోయే పరిణామాలను ఊహించుకుంటాడు. అలాంటి రచనలను ఎవరూ పదం తర్వాత పదంగానూ, వాక్యం తర్వాత వాక్యంగా నూ చదవకుండా, పేజీలను తిరగేస్తారు. కానీ, కుటుంబరావు రచనలు చదువుతున్నప్పుడు పాఠకుడు అనుక్షణం ఒకరకమైన ఉద్విగ్నతకు గురవుతాడు. ఆలోచనలో పడతాడు. రచయిత తన తీర్పు లేదా ముగింపును ప్రకటించకుండా, ఆ అవకాశాన్ని పాఠకుడికే విడిచిపెడతాడు. దీని వల్ల కుటుంబరావు ప్రతి రచనా ఏదో ఒక ప్రత్యేకతను కనబరుస్తుంది. కథ లేదా నవల లేదా నాటకం… ప్రతి రచనలోనూ కథకు ముగింపు ఉంటుంది. అదే సమయం లో, ఆలోచనల్లో ముగినిపోయే పాఠకుడు తన స్వంత న మ్మకాలతో తానే తలపడాల్సి వస్తుంది. కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాలను ప్రశ్నించడానికి మార్గాలను అన్వేషించేలా చేస్తుంది. ఆ క్రమంలోనే పాఠకుడి మెదడులో మరో కథ పురుడుపోసుకుంటుంది. భాష విషయంలో నూ ఆయనకు ప్రత్యేకమైన దృష్టి ఉంది. అలంకార భాష కంటే స్పష్టతకు, ఆలోచనా పదునుకు ప్రాధాన్యం ఇచ్చా డు. వ్యంగ్యం, హాస్యం, సంభాషణ, సూటితనం ఆయన వచనానికి సహజ లక్షణాలయ్యాయి. అయితే ఆ సూటితనం సరళీకరణ కాదు. సంక్లిష్టమైన సామాజిక సమస్య ను పాఠకుడికి అర్థమయ్యే భాషలో చెప్పడం ఆయన శక్తి. అందుకే ఆయన రచన ఒకేసారి మేధోపరమైనదిగానూ, ప్రజలకు చేరువైనదిగానూ నిలిచింది. కలకాలం గుర్తుండిపోయే సాహిత్యంగా వెలుగున్నది.