Skip to content
తెలంగాణ వార్తలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎన్నడూ?

Prajapaksham 01 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎన్నడూ?

విద్యను రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా గుర్తించిన దేశంలో.. అది ఎంతోమందికి భారంగా మారుతోంది. చదువుకోవాలనే తపన ఉన్నా చదువు కొనలేని దుస్థితి ఏర్పడింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా విద్యార్థుల కష్టాలు, బాధలు తీరడం లేదు. ప్రభుత్వాలు విద్యను తమ బాధ్యతగా, విద్యార్థులను మానవ వనరులుగా చూడటం మర్చిపోయింది. ఎన్నికల హామీలుగా విద్యారంగ పథకాలను ప్రకటించడం, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం, వాటి ఊసెత్తకపోవడం షరా మామూలైంది. విద్యను పూర్తిగా ప్రభుత్వరంగం నుండి తప్పించడానికి, ప్రైవేట్‌పరం చేయడానికి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తోంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు పడే పాట్లు అంతా ఇంతా కాదు. మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం పై పాలకులకు ధ్యాస ఉండటంలేదు. కానీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే ఆ ప్రభుత్వ సిఎం, మంత్రుల, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు సుందరీకరణకు నిధులు ఇస్తారు. త్వరితగతిన పనులు పూర్తవుతాయి. మరి పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఉండే హాస్టళ్లకు మౌలిక సదుపాయాల కల్పన పై వాటి అభివృద్ధి పై దృష్టిపెట్టరు. వారి సమస్యలు తెలుసుకోరు. యూనివర్సిటీలకు పూర్తి స్థాయి విసిలను నియామకం చేసినా ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు భర్తీ చేస్తేనే విద్య ప్రమాణాలు మెరుగుపడతాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రతిపక్షంలో మాట్లాడిన రేవంత్‌ రెడ్డి నేడు అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ తన వద్దే ఉన్నా ప్రైవేట్‌ మేనేజ్‌ మెంట్ల ఫీజుల దోపిడీపై మాట్లాడటం లేదు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో విద్యార్థినులకు స్కూటీ లు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ లు ఇస్తామని ప్రకటించారు. కానీ ఈ హామీల అమలుపై మాట్లాడటం లేదు. బడ్జెట్‌లో విద్యకు 15%నిధులు కేటాయిస్తామని ప్రకటించి మొదటి, రెండు, మూడు బడ్జెట్‌లల్లో కేవలం 7% నిధులు మాత్రమే కేటాయించారు.
ఫీజు రీయింబర్స్మెంట్‌ పథకం పేద విద్యార్థులకు ఎంతో ఆసరాగా ఉంటూ లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తుంది. ఫీజు బకాయిలు ఇవ్వండి అంటూ విద్యార్థులు, యాజమాన్యాలు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నేడు రాష్ట్రంలో పెండింగ్‌ ఫీజు రీయింబర్స్మెం ట్‌ బకాయిల విడుదల విషయం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద వరకు చేరుకుంది. ప్రభుత్వం ఒక సారేమో గతంలో మాదిరిగా కాకుండా జీవో నెంబర్‌ 7 తీసుకువచ్చి విద్యార్థుల అకౌంట్లో ఫీజు బకాయిలు వేస్తామని చెప్పింది. కాలేజీ యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్తే ఫీజు బకాయిలు విడుదల చేసే వరకు కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజు బకాయిలు విడుదల చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. మరల ప్రభుత్వం జీవో నెంబర్‌ 7 రద్దు చేసి జీవో నెంబర్‌ 8,9 తీసుకువచ్చింది. ఏ జీవో తీసుకువచ్చినా ఫీజు రీయింబర్స్మెంట్‌ విడుదలపై స్పష్టత లేదు. మళ్లీ హైకోర్టు నిన్నటికి నిన్న యాజమాన్యాలకు అనుకూలంగానే తీర్పు ఇచ్చి ఫీజులు వసూలు చేసుకోమని చెప్పింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య చదువుకోవడానికి పైసలు లేక ఫీజు రీయింబర్స్మెంట్‌ పథకంపై ఆధారపడి ఉన్నత విద్య అభ్యసించాక విద్య పూర్తయి సర్టిఫికెట్లు తీసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు బకాయిలు రాలేదని పైసలిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ యజమాన్యాలు చెప్పడంతో పైసలు కట్టలేక సర్టిఫికెట్లు తీసుకోనివారు లక్షల్లో ఉన్నారు. 2020- 2021- 2022 2023 24, 2024 విద్యా సంవత్సరాలకి పెండిం గ్‌ రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్షిప్‌ బకాయిల మొత్తం రూ.10వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం 2026- కూడా అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్‌, స్కాలర్షిప్‌లకు దరఖాస్తులు చేసుకునే గడువు రానుంది. ఈ ఫీజు రీయింబర్స్మెంట్‌ పథకానికి నిధులు ఇవ్వకుండా గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిం ది.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ బాగాలేదు.. కెసిఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ వేలకోట్ల అప్పులు చేస్తు పరిపాలన చేస్తున్నామని మాట్లాడుతున్నారు. మరి గత 30 నెలల్లో చేసిన అప్పుల్లో విద్యార్థుల చదువులకు నిధులు ఎందుకు ఇవ్వలేదు. సరే గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకుండా వేలకోట్ల రూపాయల భారం వేసింది. అవి ఒకేసారి విడుదల చేయడం సాధ్యం కాకపోతే కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీసం వారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మూడు సంవత్సరాల నుండి పెండింగ్‌ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్‌, స్కాలర్షిప్‌లను అయినా విడుదల చేస్తే బాగుండేది. ప్రభుత్వం ఓట్లు ఉన్నవారికి పెండింగ్‌ నిధులు విడుదల చేస్తూ ఓట్లు లేని విద్యార్థులకు ఫీజు బకాయిలు విడుదల చేయకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ‘ఫీజు బకాయిలు విడుదల చేయండి తమ చదువులకు ఇబ్బంది లేకుండా చూడండి’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు రోడ్డెక్కి ఉద్యమిస్తున్న, సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు భవన కిరాయిలు కట్టే పరిస్థితి లేదు అని తాము కళాశాలలు నడపలేము అంటూ ప్రైవేట్‌ డిగ్రీ, పిజి కళాశాలల వారు కొన్ని నెలల కింద కళాశాలలు బంద్‌చేసి సెమిస్టర్‌ పరీక్షలు బహిష్కరిస్తే నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పి నేటికి 6నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విడుదల లేదు.
ఫీజు రీయింబర్స్మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అనే విషయా న్ని నేటి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్ద ఎందుకు విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలపై సిఎం ఎందుకు మాట్లాడటం లేదు. సిఎం తన వద్ద విద్యాశాఖ ఎందుకు పెట్టుకున్నారు అనే సందేహం ఉంది. విద్యాశాఖ తనవద్ద పెట్టుకున్న సిఎం విద్యాశాఖపై సమీక్షలు చేయకుండా కనీసం చదువులకు నిధులు ఎందుకు విడుదల చేస్తలేరు అనే ప్రశ్న విద్యార్థులకు కలుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారు విద్యాశాఖపై వెంటనే సమీక్ష నిర్వహించి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేసి, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్‌, స్కాలర్షిప్‌ బకాయిలను మొత్తం ఒకేసారి విడుదల చేసి విద్యార్థుల ఇబ్బందులు తీర్చి, రాష్ట్రంలో విద్యారంగం బలోపేతానికి కృషి చేయాలి.
కసిరెడ్డి మణికంఠ రెడ్డి- ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ట్యాగ్‌లు: fee reimbursement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *