అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ డబుల్ ట్యాప్ దాడులు..చిన్నారులతో సహా 35 మంది మృతి..
Children Among 35 Killed in Pakistan–Afghanistan Border Attack
అంతర్జాతీయ వేదికలపై అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి స్థాపన కోసం మధ్యవర్తిత్వం వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్న పాకిస్థాన్, తన సొంత సరిహద్దుల్లో మాత్రం అఫ్గానిస్థాన్‌పై భీకర దాడులకు పాల్పడుతూ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోంది. కరాచీలో తమ సైనిక దళాలపై ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం తాజాగా అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో వైమానిక ,భూతల దాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం 35 మందికి పైగా మరణించగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, మృతులంతా ఉగ్రవాదులేనని పాకిస్థాన్ వాదిస్తుండగా, మరణించిన వారిలో అమాయక పౌరులు, మహిళలు, చిన్నారులు ఉన్నారని అఫ్గానిస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా ఆరోపిస్తోంది.
ఈ దాడుల్లో పాకిస్థాన్ సైన్యం అనుసరించిన వివాదాస్పద ‘డబుల్ ట్యాప్’ వ్యూహం అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. సైనిక పరిభాషలో ఈ వ్యూహం ప్రకారం, ఒకే ప్రాంతంపై కొద్ది సమయం వ్యవధిలో రెండుసార్లు దాడులు చేస్తారు. మొదట అఫ్గానిస్థాన్‌లోని పక్తికా, పక్తియా, కునార్ జిల్లాల్లోని నివాసాలు, మసీదులపై పాక్ ఫైటర్ జెట్‌లు బాంబుల వర్షం కురిపించాయి. ఆ దాడి జరిగిన సరిగ్గా 25 నిమిషాల తర్వాత, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి స్థానిక పౌరులు, సహాయక సిబ్బంది పరుగెత్తుకు రాగా, అదే స్థలంపై పాక్ సైన్యం రెండోసారి బాంబులు వేసింది. సహాయం కోసం వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ రెండో దాడి కారణంగానే మృతులు, క్షతగాత్రుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని అఫ్గాన్ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ దాడులపై ఇరు దేశాలు భిన్నమైన ప్రకటనలు విడుదల చేశాయి. తాము ‘జమాత్-ఉల్-అహ్రార్’ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని, ఈ చర్యలో 29 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్ వెల్లడించారు. కానీ, ఈ వాదనను తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పూర్తిగా ఖండించారు. ఇవి ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడులు కావని, కేవలం పౌరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చేసిన పిరికిపందల చర్య అని మండిపడ్డారు. మరణించిన వారిలో 4 నుండి 9 ఏళ్ల వయసున్న పసిపిల్లలు, వృద్ధులు ఉన్నారని, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడానికే పాకిస్థాన్ అబద్ధాలు చెపుతోందని అఫ్గాన్ ప్రభుత్వం ధ్వజమెత్తింది.
నిజానికి 2021లో అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌లు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు నిరంతరం ఉద్రిక్తంగానే సాగుతున్నాయి. తమ దేశంలో అలజడి సృష్టిస్తున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదులకు అఫ్గానిస్థాన్ ఆశ్రయం ఇస్తోందని పాక్ ఆరోపిస్తుండగా, తమ భూభాగంలో ఎలాంటి ఉగ్రవాద నెట్‌వర్క్‌లు లేవని తాలిబన్‌లు స్పష్టం చేస్తున్నారు. గత తొమ్మిది నెలల్లోనే పాకిస్థాన్ జరిపిన ఇటువంటి సరిహద్దు దాడుల వల్ల సుమారు 570 మంది అమాయక అఫ్గాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒకవైపు ప్రపంచ శాంతి గురించి మాట్లాడుతూ, మరోవైపు పొరుగు దేశంలోని పౌరులపై అమానవీయ వ్యూహాలతో దాడులు చేయడం పాకిస్థాన్ యొక్క అసలు నైజాన్ని బయటపెడుతోంది.