Skip to content
తెలంగాణ వార్తలు

కోర్టు నోటీసులంటే మీకు కనీసం గౌరవం కూడా లేదా.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం..

Prajapaksham 26 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
కోర్టు నోటీసులంటే మీకు కనీసం గౌరవం కూడా లేదా.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం..

Telangana High Court Takes Serious View Against Education Secretary Yogita Rana

కోర్టు జారీ చేసే నోటీసులంటే కనీస గౌరవం లేదా అని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత విచారణ సందర్భంలోనే స్వయంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించినప్పటికీ, ఆమె ఎందుకు రాలేదని తీవ్రంగా ప్రశ్నించింది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, కోర్టుకు రాకపోవడానికి గల కారణాలను తెలుపుతూ కనీసం ‘డిస్పెన్స్‌’ (వ్యక్తిగత హాజరు మినహాయింపు) అప్లికేషన్‌ కూడా వేయకపోవడాన్ని న్యాయస్థానం సహించరాని నిర్లక్ష్యంగా పరిగణించింది. అందుబాటులో లేకుండా ఎక్కడికో వెళ్లిపోవడం రాజ్యాంగ ధర్మాసన ఉత్తర్వులను ధిక్కరించడమేనని.. దీనిపై కఠిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి ఘాటుగా హెచ్చరించారు.

ఈ సందర్భంగా కారుణ్య నియామకానికి సంబంధించిన ఫైలు ప్రస్తుతం కలెక్టర్‌ వద్ద పెండింగ్‌లో ఉందని యోగితారాణా తరఫున ప్రభుత్వ న్యాయవాది చెప్పగా.. న్యాయమూర్తి జోక్యం చేసుకుని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “కలెక్టరేమో మీ పేరు చెబుతారు.. మీరేమో కలెక్టర్‌ అని చెబుతారు.. ఇద్దరూ కలిసి పిటిషనర్‌ జీవితంతో ఆటలాడుకుంటున్నారా?” అంటూ తీవ్రంగా నిలదీశారు. కారుణ్య నియామకానికి సంబంధించి హైకోర్టు 2023 అక్టోబర్‌లోనే స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. అయితే వాటిని అధికారులు అమలు చేయకపోవడంతో, హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంక్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ మహబూబ్‌ అనే బాధితుడు 2024 ఫిబ్రవరిలో హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ టి.మాధవీదేవి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి కోర్టు స్వయంగా ‘ఫామ్‌–1’ నోటీసులిచ్చినప్పటికీ ఆమె హాజరుకాకపోవడంపై న్యాయమూర్తి మండిపడ్డారు. సదరు అధికారిణి ప్రస్తుతం నిజామాబాద్‌ పర్యటనలో ఉన్నందున ఆన్‌లైన్‌ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరినప్పటికీ కోర్టు మొదట నిరాకరించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ఇంతటి నిర్లక్ష్యాన్ని అస్సలు సహించలేమని స్పష్టం చేస్తూ విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

ఆ తర్వాత న్యాయమూర్తి సమ్మతి తెలపడంతో.. మధ్యాహ్నం జరిగిన విచారణకు యోగితా రాణా ఆన్‌లైన్‌ ద్వారా హాజరై కోర్టుకు బేషరతు క్షమాపణలు చెప్పుకున్నారు. అధికారిక పనుల నిమిత్తం ఉదయమే తాను నిజామాబాద్‌ వచ్చానని, తన కార్యాలయంలో జరిగిన సమాచార లోపం (కమ్యూనికేషన్ గ్యాప్) వల్లే కోర్టు విచారణకు సకాలంలో హాజరుకాలేకపోయానని వివరించారు. తనకు న్యాయస్థానాలంటే అత్యంత గౌరవం ఉందని ఆమె కోర్టుకు విన్నవించారు.

దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. నోటీసులు అందుకుని కూడా కోర్టుకు రాకపోవడం ముమ్మాటికీ ధిక్కరణ కిందకే వస్తుందని, మరోసారి ఇలాంటి నిర్లక్ష్య వైఖరి పునరావృతమైతే చట్టప్రకారం శిక్షించాల్సి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. అనంతరం, తదుపరి విచారణల నుంచి ఆమెకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇస్తూ, ఈ లోపు సమస్యపై పూర్తి వివరాలతో మూడు వారాల్లోగా కౌంటర్‌ అఫిడవిట్ దాఖలు చేయాలని విద్యాశాఖను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *