Skip to content
తెలంగాణ వార్తలు

అక్రమ సంపాదన రూ. 50 కోట్ల పైమాటే.. విస్తు గొలుపుతున్న మాజీ తహసీల్దార్‌ తుమ్మకొమ్మ సుచరిత అక్రమార్జన.. ప్రస్తుతం చంచల్ గూడ్ జైలులో..

Prajapaksham 26 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
అక్రమ సంపాదన రూ. 50 కోట్ల పైమాటే.. విస్తు గొలుపుతున్న మాజీ తహసీల్దార్‌ తుమ్మకొమ్మ సుచరిత అక్రమార్జన.. ప్రస్తుతం చంచల్ గూడ్ జైలులో..

Suspended Shamirpet Tahsildar Booked in Disproportionate Assets Case, ₹5.05 Crore Detected During Raids

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌ మాజీ తహసీల్దార్‌, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న తుమ్మకొమ్మ సుచరిత అక్రమార్జనపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరింత నిఘా పెట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో గురువారం ఏకకాలంలో ఆమె నివాసంతో పాటు బంధువులు, బినామీలు, అనుచరులకు చెందిన మరో మూడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు మెరుపు సోదాలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో స్థిరాస్తులు, బంగారం, వజ్రాలు, నగదు కలిపి ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం 5.05 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ సెంట్రల్‌ జోన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సింధుశర్మ ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు. అయితే, ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో దాదాపు 50 కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ఏసీబీ అధికారులు జరిపిన ఈ సోదాల్లో సుచరితకు సంబంధించిన పలు ఆస్తుల పత్రాలు, విలువైన వస్తువులు లభ్యమయ్యాయి. వాటిలో సిద్దిపేట జిల్లా మార్కూక్‌ మండలం దామరకుంట గ్రామంలో ఉన్న 2 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గల 3 లగ్జరీ ఫ్లాట్లు, కీసర మరియు ఖానామెట్‌ ప్రాంతాల్లోని రెండు నివాస స్థలాల (ప్లాట్లు) పత్రాలు ఉన్నాయి. వీటితో పాటు 12 లక్షల రూపాయల నగదు, ఒక వోక్స్‌వ్యాగన్‌ కారు, ఒక హ్యుందాయ్‌ క్రెటా కారు, దాదాపు 1.20 కోట్ల రూపాయల విలువైన బంగారం మరియు వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆమెకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 38 లక్షల రూపాయల నగదు నిల్వలను కూడా గుర్తించారు. సోదాల్లో ఇప్పటివరకు లెక్కిన ఆస్తుల ఖచ్చితమైన ప్రభుత్వ విలువ 5,05,52,465 రూపాయలుగా ఉందని అధికారులు స్పష్టం చేశారు.

ఈ అక్రమాస్తుల కేసు కంటే ముందే సుచరిత ఒక భారీ లంచం కేసులో అరెస్ట్ కావడం గమనార్హం. శామీర్‌పేట్‌ మండలం అలియాబాద్‌ గ్రామంలోని వివిధ సర్వే నంబర్లలో ఉన్న 30 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా (NAలా) మార్చడం కోసం కొందరు రైతులు దరఖాస్తు చేసుకోగా, తహసీల్దార్‌గా ఉన్న సుచరిత ఎకరాకు లక్ష రూపాయల చొప్పున మొత్తం 30 లక్షల రూపాయలను లంచంగా డిమాండ్‌ చేశారు. రైతులు అంత ఇచ్చుకోలేమని బ్రతిమాలడంతో, వాయిదాల పద్ధతిలో డబ్బులు ఇవ్వాలని ఆమె ఒప్పందం కుదుర్చుకున్నారు.

దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా వ్యూహంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, మే 26న ఒక మధ్యవర్తి ద్వారా మొదటి విడతగా 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా సుచరితను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ కేసు కారణంగా ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ మహిళా జైలులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉండగా, తాజాగా వెలుగు చూసిన అక్రమాస్తుల వ్యవహారంతో ఏసీబీ అధికారులు ఆమెపై అవినీతి నిరోధక చట్టం కింద మరో కొత్త కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.