Skip to content
జాతీయం వార్తలు

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం.. హాజరైన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఫోటోలు ఇవిగో..

Prajapaksham 25 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం.. హాజరైన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఫోటోలు ఇవిగో..

Tungabhadra Project Gets New Gates, CMs of Three States Join Event

కర్ణాటకలోని హోస్పేట (మునిరాబాద్) వేదికగా తుంగభద్ర ప్రాజెక్టు నూతన క్రెస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అంతరాష్ట్ర జలవనరుల ప్రాజెక్టు అయిన తుంగభద్రకు సరికొత్త రూపునిస్తూ ఏర్పాటు చేసిన ఈ గేట్లను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. మూడు రాష్ట్రాల రైతాంగానికి, ప్రజలకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టు భద్రతను పెంపొందించే దిశగా ఈ కార్యక్రమం ఒక కీలక మైలురాయిగా నిలిచింది.

ఈ ప్రాజెక్టు పునరుద్ధరణకు దారితీసిన నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 2024 ఆగస్టులో వచ్చిన భారీ వరదల ప్రవాహానికి తుంగభద్ర డ్యామ్ యొక్క 19వ నంబర్ క్రెస్ట్ గేట్ గొలుసు తెగి కొట్టుకుపోయింది. ఆ సమయంలో జలాశయం నుండి భారీగా నీరు వృథా కాకుండా నిరోధించేందుకు నిపుణుల కమిటీ తాత్కాలికంగా ‘స్టాప్-లాగ్’ గేటును అమర్చి ప్రమాదాన్ని తప్పించింది.

అయితే, 73 ఏళ్ల నాటి ఈ డ్యామ్ భద్రతను దృష్ట్యా ఉంచుకుని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA), కేంద్ర జల సంఘం (CWC) నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనల మేరకు.. మొత్తం 33 పాత గేట్లను తొలగించి వాటి స్థానంలో అత్యాధునిక గేట్లను అమర్చాలని నిర్ణయించారు. దాదాపు 51 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ 33 నూతన గేట్లు రాబోయే 55 నుండి 60 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా డిజైన్ చేశారు. ఈ నూతన గేట్ల ఏర్పాటుతో వరద సమయాల్లో నీటి ప్రవాహాన్ని సమర్థవంతంగా నియంత్రించడమే కాకుండా, జలాశయం భద్రత మరింత మెరుగైంది.

ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమంలో మూడు రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖ మంత్రులు, సీనియర్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలైన కర్నూలు, కడప, అనంతపురంలతో పాటు కర్ణాటక, తెలంగాణలోని లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే తుంగభద్ర ప్రాజెక్టుకు ఈ నూతన గేట్ల ఏర్పాటుతో సరికొత్త జీవం లభించినట్లయింది. అనంతరం మునిరాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యనేతలు పాల్గొని ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *