రాజ్యసభ ఎంపీలలో అత్యంత ధనవంతులు.. క్రిమినెల్ కేసులు ఉన్నవారు వీరే.. తెలంగాణ ఎంపీలు టాప్‌లో..
Rajya Sabha Wealth Report: 31 Billionaires, Telangana Members Lead Rankings
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తాజాగా పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ సభ్యుల ఆర్థిక, నేర, ఇతర నేపథ్యాలపై ఒక సమగ్ర విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. మొత్తం 233 మంది రాజ్యసభ సభ్యులకు గాను 226 మంది సిటింగ్ ఎంపీల అఫిడవిట్లను పరిశీలించి ఈ నివేదికను రూపొందించారు. మిగిలిన ముగ్గురు సభ్యుల అఫిడవిట్లు అందుబాటులో లేకపోగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన నాలుగు స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.
కొత్తగా ఎన్నికైన 27 మంది ప్రజాప్రతినిధుల వివరాలను కూడా కలుపుకుని రూపొందించిన ఈ నివేదికలో దేశ రాజకీయాల్లో ధన బలం, నేర చరితుల ప్రభావం ఎంతలా ఉందో స్పష్టమైన గణాంకాలతో వెల్లడైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఎంపీల సంపద దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది.
ఈ నివేదిక ప్రకారం, దేశంలోని మొత్తం 226 మంది సిటింగ్ రాజ్యసభ ఎంపీల ఆస్తుల విలువ 26,047 కోట్ల రూపాయలుగా తేలింది. ఇందులో ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే, కేవలం తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది ఎంపీల ఆస్తుల విలువే 39.39 శాతంగా ఉంది. తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీల మొత్తం సంపద 8,310 కోట్ల రూపాయలుగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మంది ఎంపీల ఆస్తుల విలువ 1,949 కోట్ల రూపాయలుగా నమోదైంది.
తెలంగాణలో 57 శాతం మంది, ఆంధ్రప్రదేశ్‌లో 45 శాతం మంది ఎంపీలు బిలియనీర్లుగా (వందల కోట్ల అధిపతులుగా) ఉన్నారని ఏడీఆర్ తెలిపింది. పార్టీల వారీగా చూస్తే, తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు చెందిన ముగ్గురు సభ్యుల ఆస్తి విలువే 5,524 కోట్ల రూపాయలుగా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కు చెందిన నలుగురు ఎంపీల ఆస్తుల విలువ 1,007 కోట్లు కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి చెందిన నలుగురు సభ్యులకు 683 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా రాజ్యసభలో అత్యధిక ఆస్తులున్న తొలి ముగ్గురు కోటీశ్వరులైన ఎంపీల జాబితాను పరిశీలిస్తే అందులో ఇద్దరు తెలంగాణ వారే కావడం గమనార్హం. బీఆర్ఎస్ కు చెందిన బండి పార్థసారథి ఏకంగా 5,300 కోట్ల రూపాయల ప్రకటించిన ఆస్తులతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. పంజాబ్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాజేందర్ గుప్తా 5,053 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో, కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ న్యాయవాది, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ 2,558 కోట్ల రూపాయల సంపదతో మూడో స్థానంలో నిలిచారు. మరోవైపు, దేశంలో 100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్న ఎంపీలు మొత్తం 31 మంది ఉండగా, వారిలో బీజేపీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ ల నుంచి ఇద్దరేసి చొప్పున, జనసేన పార్టీ నుంచి ఒకరు ఈ వంద కోట్ల క్లబ్లో ఉన్నారు.
ఆస్తుల సంగతి పక్కన పెడితే, రాజ్యసభ సభ్యుల్లో అప్పుల జాబితాలో కూడా తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు ముందంజలోనే ఉన్నారు. దేశంలోనే అత్యధిక అప్పులున్న తొలి ముగ్గురు ఎంపీలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు 672 కోట్ల రూపాయల ఆస్తులుండగా, 200 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఝార్ఖండ్‌కు చెందిన స్వతంత్ర ఎంపీ పరిమళ్ నత్వానీ (ఆస్తులు రూ.755 కోట్లు, అప్పులు రూ.256 కోట్లు), మూడో స్థానంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జయాబచ్చన్ (ఆస్తులు రూ.1,578 కోట్లు, అప్పులు రూ.149 కోట్లు) నిలిచారు. కాగా, మొత్తం రాజ్యసభలో మహిళా ప్రాతినిధ్యం కేవలం 15 శాతంగా మాత్రమే ఉంది. మొత్తం 34 మంది మహిళా ఎంపీలలో బీజేపీ నుంచి అత్యధికంగా 20 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇక సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న నేర చరితుల వివరాలను కూడా ఈ నివేదిక బహిర్గతం చేసింది. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న మొత్తం సభ్యుల్లో 31 శాతం మంది, అంటే 69 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో 16 శాతం (36 మంది) మందిపై అత్యంత తీవ్రమైన క్రిమినల్ నేరాల కేసులు ఉన్నాయి. ఇందులో ఒకరిపై హత్య కేసు, నలుగురిపై హత్యాయత్నం కేసులు, అలాగే మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి మరో నలుగురిపై కేసులు ఉన్నాయి. ప్రధాన పార్టీల వారీగా చూస్తే, బీజేపీకి చెందిన 107 మంది సభ్యులలో 28 మందిపై క్రిమినల్ కేసులు, 14 మందిపై తీవ్ర నేరాల కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 29 మంది సభ్యులలో 12 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, ఎనిమిది మంది తీవ్ర నేరాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు.
రాష్ట్రాల వారీగా క్రిమినల్, తీవ్ర నేరాల కేసులున్న ఎంపీల శాతాన్ని విశ్లేషిస్తే తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణకు చెందిన మొత్తం ఏడుగురు ఎంపీలలో ఐదుగురిపై (71%) క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో ముగ్గురిపై అత్యంత తీవ్రమైన నేరాల కేసులు ఉన్నాయి. ఈ క్రిమినల్ కేసులున్న వారిలో బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. నేరచరిత ఉన్న ఎంపీల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాత స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బిహార్, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు నిలిచాయి. చట్ట సభల్లో ధన బలం, నేర నేపథ్యం ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఏడీఆర్ విడుదల చేసిన ఈ గణాంకాలే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.