ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న మోదీ పాలనా వైఫల్యాలు
Failures of the Modi administration that are damaging the economy
భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నదనే సంకేతాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వాటిని పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన పాలక వ్యవస్థ, కృత్రిమ వివాదాలు, మతపరమైన విభజనలు, ఊహాజనిత శత్రువులపై అంతులేని పోరాటాలతో ప్రజల దృష్టిని మరల్చడంలో ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. దేవాలయాలు, మసీదులు, మధ్యయుగ పాలకులు, కల్పిత శత్రువుల గురించి చర్చలతో టెలివిజన్ స్టూడియోలు నిండిపోతుండగా, ఆర్థిక వ్యవస్థ పునాదులు నిశ్శబ్దంగా బలహీనపడుతున్నాయి. భారత్‌కు ప్రస్తుతం ఎదురవుతున్న అత్యంత తక్షణ సవాలు ‘బాహ్య ఆర్థిక దెబ్బల కారణంగా పెరుగుతున్న దుర్బలత’. దేశం తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం, ఖనిజ వాయువు వినియోగంలో సుమారు సగభాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అందువల్ల ప్రపంచ ఇంధన ధరల్లో జరిగే ప్రతి పెరుగుదల నేరుగా దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఇటీవల ఇంధన ధరలు పెరగడాన్ని కేవలం పన్నులు లేదా మార్కెట్ హెచ్చుతగ్గుల ఫలితం మాత్రమేనని అనుకోవడానికి వీల్లేదు.
అది మరింత లోతైన వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది. పునరుత్పాదక ఇంధనం, స్వావలంబన, ప్రపంచ నాయకత్వం గురించి ఎంత చెప్పుకున్నప్పటికీ, భారత్ ఇప్పటికీ దిగుమతి ఇంధనంపైనే ప్రమాదకర స్థాయిలో ఆధారపడుతోందనేది వాస్తవం. ఈ పరిస్థితి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తోంది. చమురు, ధృవీకృత ఖనిజ వాయువు (ఎల్‌ఎన్‌జి) ధరలు పెరగడం వల్ల వాణిజ్య లోటు విస్తరిస్తోంది. రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది, అన్ని రంగాల్లో ఉత్పత్తి వ్యయాలు అధికమవుతున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువను కాపాడేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు విదేశీ మారకద్రవ్య మార్కెట్లో 53 బిలియన్ డాలర్లకు పైగా విక్రయించాల్సి వచ్చింది. ఇది గత పదేళ్లలోనే అతిపెద్ద జోక్యం. విదేశీ మారక నిల్వలు 720 బిలియన్ డాలర్లకు పైగా ఉన్న గరిష్ఠ స్థాయి నుంచి సుమారు 681 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. వాస్తవంగానే ప్రభుత్వానికి ఆర్థిక పునాదులపై విశ్వాసం ఉంటే, తన కరెన్సీ పతనాన్ని అడ్డుకోవడానికి ఇంత భారీ మొత్తాలను ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు కదా!
ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు ఎరువులు, వ్యవసాయ రంగాల్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. ఎరువుల తయారీలో భారత్ బలంగా కనిపించినప్పటికీ, ఆ బలం వెనుక ప్రమాదకరమైన బలహీనత దాగి ఉంది. దేశీయ యూరియా ఉత్పత్తి దిగుమతి చేసుకునే ఎల్‌ఎన్‌జీపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. మనం తయారు చేసే దాదాపు అన్ని ఎరువులూ ఎల్‌ఎన్‌జీ, పొటాష్ వంటి దిగుమతి ముడి పదార్థాలతో అనుసంధానమై ఉన్నాయి. ప్రపంచ గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా, ఎల్‌ఎన్‌జి ధరలు ఒక్కసారిగా పెరిగినా, సరఫరా గొలుసు దెబ్బతిన్నా ఎరువుల లభ్యత, ధరలు వెంటనే ప్రభావితమవుతాయి. ఈ సంవత్సరం భారత వాతావరణ శాఖ సాధారణ సగటుతో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాన్ని అంచనా వేసింది. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం గణనీయంగా ఉందని పేర్కొంది.
ఇటువంటి అంచనాలను తేలికగా తీసుకోలేం. బలహీనమైన రుతుపవనాలు కేవలం వ్యవసాయ ఉత్పత్తినే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. పంట దిగుబడులు తగ్గితే గ్రామీణ ఆదాయాలు తగ్గుతా యి. గ్రామీణ ఆదాయాలు తగ్గితే వినియోగ డిమాండ్ బలహీనపడుతుంది. ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఉపశమన చర్యలు, ప్రభుత్వ కొనుగోళ్లు, సబ్సిడీలపై వ్యయం పెరగాల్సి వస్తుంది. అయితే బిజెపి పాలనలో అలాంటి వ్యయం పెరగడం అనుమానాస్పదం. ఈ అంశాలన్నీ పరస్పర ప్రభావితమయ్యేవి కావడమే అసలైన ప్రమాదంగా కనిపిస్తున్నది. పెరుగుతున్న ఇంధన వ్యయాలు, అనిశ్చిత ఎరువుల సరఫరా, బలహీన రుతుపవనాలు వంటివన్నీ విడివిడిగా పనిచేయవు. ఇవన్నీ కలిసి దేశీయ వినియోగాన్ని బలోపేతం చేయాల్సిన సమయంలోనే డిమాండ్‌ను కుంచించే ఒక దుష్ప్రభావ వలయాన్ని సృష్టిస్తాయి.
ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతగల ప్రభుత్వం ఉపాధి హామీ కార్యక్రమాలను, సామాజిక రక్షణ పథకాలను బలోపేతం చేస్తుంది. కానీ మోదీ ప్రభుత్వం గ్రామీణ ఆదాయాలకు సంక్షోభ కాలంలో అండగా నిలిచే అత్యంత ప్రభావవంతమైన సాధనాల్లో ఒకటైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ)ను క్రమబద్ధంగా బలహీనపరిచింది. దాని ఫలితంగా కోట్లాది గ్రామీణ కుటుంబాలు పదేళ్ల క్రితం ఉన్న రక్షణ కంటే తక్కువ భద్రతతోనే ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. కాగా, ఇప్పుడు సేవల ఎగుమతులు, విదేశాల నుంచి వచ్చే నగదు (రెమిటెన్స్) తగ్గి ఆందోళన కలిగిస్తున్నది.
2024 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు రికార్డు స్థాయిలో 135 బిలియన్ డాలర్ల విలువైన రెమిటెన్సులు వచ్చాయి. దేశ ప్రస్తుత ఖాతా లోటును నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడిన అంశాల్లో ఈ రెమిటెన్స్‌ది కీలక పాత్ర. అయితే, ఇందులో ఎవరూ పట్టించుకోని ప్రమాదం దాగి ఉంది. ఇప్పుడు భారతీయులకు వచ్చే రెమిటెన్సులలో పెరుగుతున్న భాగం గల్ఫ్ దేశాల్లో పనిచేసే వలస కార్మికుల నుంచి మాత్రమే కాకుండా, అమెరికా, బ్రిటన్ వంటి ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో పనిచేస్తున్న అత్యున్నత నైపుణ్యం కలిగిన నిపుణుల నుంచి కూడా వస్తోంది. అమెరికాలో మన ప్రధాని మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకులు ప్రోత్సహిస్తున్న మితవాద రాజకీయాలు, వలస వ్యతిరేక భావజాలం, అలాగే పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న ఇలాంటి ధోరణులు అక్కడ పనిచేస్తున్న భారతీయులను ఇబ్బంది పెడుతున్నాయి. రెమిటెన్స్‌కు ప్రత్యక్ష సవాళ్లు విసురుతున్నాయి.
అదే సమయంలో కృత్రిమ మేధస్సు (ఎఐ) సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, డేటా ప్రాసెసింగ్, వృత్తిపరమైన సేవలు వంటి రంగాలను వేగంగా మారుస్తోంది. ఇవన్నీ భారతీయ నిపుణులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రంగాలే కావడం గమనార్హం. రెమిటెన్సులు ఒక్కసారిగా మాయమైపోవడం కాదు.. గత రెండు దశాబ్దాలుగా భారత విదేశీ ఆర్థిక సమతుల్యతకు బలంగా నిలిచిన ఒక ప్రధాన ఇంజిన్ క్రమంగా బలహీనపడే అవకాశం ఉండడమే ప్రమాదకరం. రెమిటెన్సుల వృద్ధి మందగిస్తే, అదే సమయంలో ఇంధన దిగుమతులు అధికంగానే కొనసాగితే, ప్రస్తుత ఖాతా లోటు, రూపాయి విలువపై ఒత్తిడి మరింత పెరుగుతుంది.
అంతర్జాతీయ మదుపరులు ఇటీవల కాలంలో ప్రదర్శిస్తున్న ఉదాశీనత ఆందోళన కలిగిస్తున్నది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల ప్రవర్తన ఇప్పటికే పెరుగుతున్న జాగ్రత్తను ప్రతిబింబిస్తోంది. ఈ ఏడాది విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.2.2 లక్షల కోట్లకు పైగా ఉపసంహరించబడ్డాయి. ప్రపంచ మార్కెట్ మూలధనీకరణ (మార్కెట్ క్యాపిటలైజేషన్) ర్యాంకింగ్స్ లో భారత్ ఆరో స్థానంనుంచి ఏడో స్థానానికి పడిపోయింది. దేశీయ చిన్న పెట్టుబడిదారులు మార్కెట్లో మరింత తీవ్రమైన పతనాన్ని అడ్డుకున్నప్పటికీ, అంతర్జాతీయ మూలధనం పంపుతున్న సందేశం స్పష్టంగా ఉంది. భారతదేశ ఆర్థిక వృద్ధి కథనం, మోదీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నంత బలంగా ఉందా? అనే సందేహం పెట్టుబడిదారుల్లో పెరుగుతోంది.
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న సాంకేతిక పరివర్తనలో భారతదేశ స్థానం సంతృప్తికరంగా లేకపోవడం మరింత ఆందోళనకరం. మోదీ ప్రభుత్వం ఇచ్చిన గొప్ప హామీలు గతంలో నిర్మించిన సామర్థ్యాలను బలోపేతం చేయడంలో విఫలమవడమే కాకుండా, దృష్టి మళ్లించే రాజకీయాల కారణంగా భవిష్యత్తు ప్రపంచంలో భారత్ పాత్ర ఏమిటన్న అంశంపై లోతైన చర్చ జరగకుండా చేశాయి.
ఇరవై ఒకటో శతాబ్దాన్ని కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, అత్యాధునిక తయారీ, రోబోటిక్స్, సరిహద్దు శాస్త్రీయ ఆవిష్కరణలు నిర్వచించనున్నాయి. అయితే ఈ కీలక సాంకేతిక రంగాల్లో భారత్ ఇప్పటికీ వెనుకబడి ఉంది. దేశంలో పెద్ద స్టార్టప్ వ్యవస్థ ఉన్నప్పటికీ, వాటిలో చాలావరకు సాంకేతిక విప్లవాలను సృష్టించడం కంటే, డిజిటల్ మధ్యవర్తిత్వ సేవలకే పరిమితమవుతున్నాయి. ఆహార సరఫరా యాప్‌లు, రైడ్‌హైలింగ్ సేవలు, క్విక్ కామర్స్ సంస్థలు భారీ విలువలను సంపాదించవచ్చు. కానీ అవి సాంకేతిక స్వావలంబనను తీసుకురావు. ప్రసిద్ధి చెందిన అనేక భారతీయ స్టార్టప్‌లు చౌకైన కార్మిక శక్తిని డిజిటల్ వేదికల ద్వారా సమీకరించడంపైనే ఆధారపడి ఉన్నాయి. సాంకేతికంగా ముందంజలో ఉన్న దేశాలు, సంస్థలతో పోలిస్తే, ఈ వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. తైవాన్‌లోని టిఎస్‌ఎంసి అత్యాధునిక సెమీకండక్టర్ తయారీలో ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. దక్షిణ కొరియాలోని శామ్‌సంగ్ కీలక సాంకేతిక రంగాల్లో ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది.
అమెరికా, చైనా దేశాలు కృత్రిమ మేధస్సు, అధునాతన తయారీ, పునాది సాంకేతిక పరిజ్ఞానాల్లో ముందంజలో ఉన్నాయి. భారత్‌కు అపారమైన ఇంజినీరింగ్ ప్రతిభ ఉన్నప్పటికీ, సెమీకండక్టర్లు, సాంకేతిక పరిజ్ఞానం, మూలధన పరికరాల కోసం ఇప్పటికీ దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతోంది. ఎన్నో సంవత్సరాలుగా నవకల్పన, స్వావలంబన గురించి నినాదాలు వినిపించినప్పటికీ, భవిష్యత్తును నిర్ణయించే పరిశ్రమల్లో భారత్ ఇప్పటికీ వెనుకబడే ఉంది. మోదీ పదేళ్లకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ భారత్ ఇప్పటికీ దిగుమతి ఇంధనం, దిగుమతి సాంకేతికత, దిగుమతి మూలధనంపైనే ఆధారపడుతోంది. మరోవైపు నిరుద్యోగం కొనసాగుతోంది, అసమానతలు పెరుగుతున్నాయి.
ప్రభుత్వం వాగ్దానం చేసిన వస్తూత్పత్తి విప్లవం కార్యరూపం దాల్చలేదు. కోట్లాది యువతతో కూడిన ‘జనాభా ప్రయోజనం’ (డెమోగ్రాఫిక్ డివిడెండ్) ఇప్పటికీ అస్థిర ఉపాధి, స్థిరంగా పెరగని వేతనాలు, తగ్గుతున్న అవకాశాలు వంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది. పలు రకాలుగా వైఫల్యాలను ఎదుర్కొంటున్నప్పటికీ, ‘అతిశయ జాతీయవాదం’ ముసుగుతో ప్రజలపై మోదీ ప్రభుత్వం భారాన్ని మోపుతున్నది. ఆర్థిక వ్యవస్థ నుంచి అత్యవసర హెచ్చరికలు వస్తున్నప్పటికీ ప్రజల దృష్టిని పదేపదే మతపరమైన విభజన, కృత్రిమ వివాదాల వైపు మళ్లిస్తున్నారన్నది చేదు నిజం. ప్రజలు తమ జీవనోపాధిని ప్రభావితం చేసే విధానాలను ప్రశ్నించకుండా, ఒకరినొకరు అనుమానించేలా ప్రభుత్వమే రెచ్చగొట్టడం దారుణం. సమాజం వ్యూహాత్మకంగా విభజించబడుతుండగా ఆర్థిక బలహీనతలు మరింత లోతుగా మారుతున్నాయి.
పేదలు, నిరుద్యోగులు, రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలకే ఈ పరిస్థితుల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. వారి భవిష్యత్తు తాకటులోకి వెళుతున్నది. అన్నింటికంటే ముఖ్యంగా, కొద్దిమందిని సంపన్నులను చేస్తూ కోట్లాది మందిపై భారాలు మోపే విధానాలకు వ్యతిరేకంగా దృఢమైన, ఐక్యమైన పోరాటం అవసరం. ఆర్థిక పతన సంకేతాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. విభజన, ఆర్థిక దుర్బలతల మార్గంలోనే కొనసాగాలా? లేక జీవనోపాధులు, ఉద్యోగాలు, భవిష్యత్తును కాపాడగల విస్తృత ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్మించాలా? అనేది ప్రజలే తేల్చుకోవాలి. సమయం మించిపోకముందే మేల్కోవాలి.
(ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్త ప్రచారం,
సెప్టెంబర్ 1న ఢిల్లీలో భారీ ర్యాలీ సిపిఐ పిలుపు)