Skip to content
ఎడిట్ పేజి వార్తలు

Editorial: ఎఫ్‌సిఆర్‌ఎ బిల్లు : జెపిసి బాధ్యత

Prajapaksham 13 Aug 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
Editorial: ఎఫ్‌సిఆర్‌ఎ బిల్లు : జెపిసి బాధ్యత

Editorial: ఎఫ్‌సిఆర్‌ఎ బిల్లు : జెపిసి బాధ్యత

విదేశీ విరాళాల నియంత్రణ కొత్త విషయమేమీ కాదు. విదేశీ నిధులు దేశీయ రాజకీయాలు, మతపరమైన కార్యకలాపాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా-వైద్య రంగాల్లో ఎలా ఉపయోగిస్తున్నారో ప్రభుత్వం పర్యవేక్షించడంలో తప్పులేదు. విదేశీ నిధుల పేరుతో అక్రమ కార్యకలాపాలు జరిగితే వాటిని అడ్డుకోవాలి. అవి దేశాన్ని ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నాలకు వినియోగించడాన్ని నివారించాలి. ఇందులో అటు ప్రభుత్వానికీ, ఇటు ప్రతిపక్షాలకీ సూత్రప్రాయంగా కూడా అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు.

అయితే, తాజాగా ప్రతిపాదించిన ‘విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ’ (ఎఫ్‌సిఆర్‌ఎ) బిల్లు విషయంలో రేగుతున్న వివాదం ఇందుకు భిన్నమైనది. ఈ వివాదం విదేశీ నిధుల నియంత్రణ అవసరమా లేదా అనే అంశంపైకాదు, నియంత్రణ పేరుతో ప్రభుత్వానికి ఎంత విస్తృతమైన అధికారం ఇవ్వాలి, ఆ అధికారం ఎలా వినియోగించాలి, ఒక సంస్థ ఎఫ్‌సిఆర్‌ఎ రిజిస్ట్రేషన్‌ కోల్పోతే దాని ఆస్తుల పరిస్థితి ఏమిటి, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంస్థకు ఎంత బలమైన న్యాయపరమైన రక్షణ ఉంటుంది అనే ఎన్నో ప్రశ్నలకు సంబంధించింది.

అందుకే, ఈ బిల్లును ప్రస్తుత రూపంలో ఉపసంహరించుకోవాలని, కనీసం విస్తృత పార్లమెంటరీ పరిశీలనకు పంపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. గత్యంతరం లేక, బిల్లును 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)కి పంపేందుకు లోక్‌సభలో కేంద్రం తీర్మానం తీసుకురావాల్సి వచ్చింది. ఈ పరిణామం ప్రతిపక్షాల అభ్యంతరాలకు కనీసం పార్లమెంటరీ పరిశీలన అవసరమన్న స్థాయిలో రాజకీయ ప్రాముఖ్యత ఉందని స్పష్టం చేస్తున్నది.

ఈ బిల్లులోని అత్యంత వివాదాస్పదమైన అంశం కొత్తగా ఏర్పడబోయే అధికారిక సంస్థ. అంటే, ఏదైనా సంస్థ ఎఫ్‌సిఆర్‌ఎ సర్టిఫికెట్‌ను కోల్పోయినా, స్వచ్ఛందంగా అప్పగించినా, లేదా దాని గడువు ముగిసినా ఆ సంస్థకు సంబంధించిన విదేశీ నిధులు, ఆ నిధులతో ఏర్పడిన ఆస్తులు ఈ అధికార సంస్థ ఆధీనంలోకి వెళతాయి. నిర్ణీత వ్యవధిలో సంస్థ కొత్త రిజిస్ట్రేషన్‌ పొందకపోతే లేదా పాత రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరించుకోకపోతే ఆ ఆస్తులు శాశ్వతంగా ప్రభుత్వ నియమించిన అధికార సంస్థ ఆధీనంలోకి వెళ్లవచ్చు. ఆ తర్వాత వాటిని ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని ‘కన్సాలిడేటెడ్‌ ఫండ్‌’లో జమ చేయవచ్చు.

ఇక్కడ రెండు వేరువేరు అంశాలు తెరపైకి వస్తున్నాయి. మొదటికి ఒక సంస్థకు విదేశీ నిధులు స్వీకరించే అనుమతి లేకపోవడం, రెండవది ఆ సంస్థకు చెందిన ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం. ఒక స్వచ్ఛంద సంస్థ విదేశీ విరాళాలతో ఒక ఆసుపత్రిని నిర్మించి, ఆ తర్వాతి సంవత్సరాల్లో దేశీయ నిధులతో దాన్ని నిర్వహిస్తుండగా, ఒకవేళ ఆ సంస్థ ఎఫ్‌సిఆర్‌ఎ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించకపోతే ఆ ఆసుపత్రి కూడా ప్రభుత్వ నియమించిన అధికార సంస్థ ఆధీనంలోకి వెళ్లే అవకాశం బిల్లు కల్పిస్తోంది.

ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విదేశీ నిధుల వినియోగంలో తప్పు జరిగిందని నిరూపించకుండా, కేవలం రిజిస్ట్రేషన్‌ గడువు ముగిసిందనే కారణంతో ఆస్తిపై ప్రభుత్వం ఎందుకు హక్కు సాధించాలి? అనేది పాలనాపరమైన చిన్న ప్రశ్న కాదు. ఒక ఆసుపత్రి, పాఠశాల, వృద్ధాశ్రమం, అనాథాశ్రమం లేదా సామాజిక సేవా కేంద్రం ఒకసారి ఏర్పడిన తర్వాత దాని సేవలు వేలాదిమందితో ముడిపడి ఉంటాయి. దాని నిర్మాణానికి ఎప్పుడో విదేశీ నిధులు ఉపయోగించారని చెప్పి, అనేక సంవత్సరాల తర్వాత దాని యాజమాన్యాన్ని మార్చడం ఆస్తి హక్కు, సంస్థ స్వయం ప్రతిపత్తి, ప్రజా ప్రయోజనం వంటి అంశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

ప్రతిపక్షాలు ఈ బిల్లును మైనారిటీలు, ముఖ్యంగా క్రైస్తవ సంస్థలకు మరియు విదేశీ నిధులపై ఆధారపడే స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జిఒ)లకు ప్రమాదకరంగా చూస్తున్నాయి.

‘అధికార కేంద్రీకరణ’ అనే ప్రమాదాన్ని ఈ బిల్లు సూచిస్తున్నది. ఎఫ్‌సిఆర్‌ఎ సర్టిఫికెట్‌ను రద్దు చేసే అధికారాలు ఇప్పటికే ప్రభుత్వానికి ఉన్నాయి. కొత్త బిల్లు ఆ రిజిస్ట్రేషన్‌ స్థితితో అనుసంధానించి ఆస్తులపై కూడా చర్య తీసుకునే వ్యవస్థను రూపొందిస్తోంది. అంటే పరిపాలనా నిర్ణయం ఒక సంస్థ ఆర్థిక కార్యకలాపాలను నిరోధించడంతో ఆగకుండా, దాని ఆస్తుల భవిష్యత్తును కూడా నిర్ణయించే స్థాయికి వెళ్తుంది.

ఇలాంటి అధికారానికి బలమైన అప్పీల్‌ వ్యవస్థ, స్వతంత్ర న్యాయపరమైన సమీక్ష, సహజ న్యాయ సూత్రాలు తప్పనిసరిగా ఉండాలి. ఎఫ్‌సిఆర్‌ఎ నుంచి వైదొలగినప్పటికీ, ఆయా సంస్థల ఆస్తులను తాత్కాలికంగా స్వాధీనం చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందనేది మరో కీలకమైన అంశం. ఒక సంస్థ విదేశీ నిధులు తీసుకోవడం ఆపేసి దేశీయ నిధులతో తన కార్యకలాపాలను కొనసాగించినా, గతంలో విదేశీ నిధులతో నిర్మించిన ఆస్తులపై ఈ నిబంధన ప్రభావం చూపవచ్చు.

శిక్ష అనేది నేరానికి అనుగుణంగా ఉండాలి. పరిపాలనా లోపం, రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరణలో సమస్య, పత్రాల లోపం వంటి కారణాలకు సంస్థ ఆస్తుల శాశ్వత నష్టం అనేది సముచితమైన శిక్షా విధానమా? అన్నది జెపిసి ప్రశ్నించాలి.

ఒక బిల్లు ఎన్‌జిఒలు, మత సంస్థలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, సామాజిక సేవా వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పుడు, వాటి ప్రతినిధులను పిలిచి అభిప్రాయాలు తీసుకోవడం పార్లమెంటరీ ప్రక్రియలో భాగం. న్యాయ నిపుణులు, ఆర్థిక నియంత్రణ నిపుణులు, ఎన్‌జిఒలు, రాష్ట్ర ప్రభుత్వాలు, మత సంస్థలు, మానవహక్కుల సంస్థలను సంప్రదించకుండా, అభిప్రాయాలు పొందకుండా బిల్లును రూపొందించడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పోకడలకు నిదర్శనం.

ఆస్తుల స్వాధీనం, పరిపాలనా అధికారాల విస్తరణ, రిజిస్ట్రేషన్‌ గడువు ముగిసిన సందర్భాల్లో ఆస్తులపై చర్య, న్యాయపరమైన అప్పీల్‌, మైనారిటీ సంస్థలపై సంభావ్య ప్రభావం వంటి అంశాలపై సమగ్ర పరిశీలన జరగాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌కు ప్రజాస్వామ్యపరమైన, చట్టపరమైన ప్రాతిపదిక ఉంది. జెపిసి ఈ బాధ్యతను సమర్థంగా పూర్తిచేసి, కేంద్ర ప్రభుత్వ ఒంటెత్తు విధానాలకు అడ్డుకట్ట వేయాలి.