Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

ఎన్నికల సంఘంపై అనుమానం..ప్రజాస్వామ్యానికి ప్రమాదం

Prajapaksham 24 Sep 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ఎన్నికల సంఘంపై అనుమానం..ప్రజాస్వామ్యానికి ప్రమాదం

Election Commission

భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణాధారం. ఎన్నికలు సక్రమంగా జరిగాయా అనే ప్రశ్నకు సమాధానం చెప్పే సంస్థ ఎన్నికల సంఘం. అందుకే ప్రభుత్వం మీద, అధికార పార్టీ మీద, ప్రతిపక్షాల మీద, అభ్యర్థుల మీద ప్రజలకు అనుమానాలు రావచ్చు. కానీ ఎన్నికల సంఘం మీదే అనుమానం మొదలైతే సమస్య పరిధి ‘ఎన్నికల ప్రక్రియ’ను దాటి, రాజ్యాంగ వ్యవస్థ విశ్వసనీయత వరకు వెళుతుంది. ఎన్నికల ఫలితం నచ్చకపోవడం ఒక రాజకీయ సమస్య. ఓటు హక్కును నిర్వహించే సంస్థ నిష్పాక్షికతపై సందేహం కలగడం మాత్రం ప్రజాస్వామ్య సమస్య. ఇటీవల వెలుగులోకి వచ్చిన పరిణామాలు ఈ తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని పెంచుతున్నాయి. గత పది నెలల్లో ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్నికల సంఘంలోని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఓటర్ల జాబితాల సవరణ, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, ఓటర్ల డేట్‌బేస్‌పై నియంత్రణ, ఫామ్‌-6 మార్పులు, పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల తొలగింపులపై దాఖలైన అప్పీళ్లు తదితర అంశాల్లో కనీసం 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారని బుధవారం ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’లో ప్రచురితమైన ఓ పరిశోధనాత్మక నివేదిక పేర్కొంది. కొన్ని సందర్భాల్లో తమకు సమాచారం లేకుండానే నిర్ణయాలు లేదా ఉత్తర్వులు వెలువడ్డాయని వారు వ్యాఖ్యానించినట్టు ఆ నివేదిక తెలిపింది. ఆ ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాల్లో ఉచితానుచితాలు ఎలావున్నా, వారి అభ్యంతరాలపై స్పందన ఏమిటి? ఏ నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారు? ఏ చట్టపరమైన అధికారంతో తీసుకున్నారు? ఆ నిర్ణయంలో మొత్తం కమిషన్‌కు సమాచారం ఉందా? ఉంటే దాని రికార్డు ఎక్కడ ఉంది? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం రావాలి. ఎందుకంటే ఎన్నికల సంఘం ఒక వ్యక్తి కార్యాలయం కాదు. అది రాజ్యాంగబద్ధమైన బహుసభ్య సంస్థ. ప్రత్యేకించి ఓటర్ల జాబితా విషయంలో ఈ ప్రశ్నలకు మరింత ప్రాధాన్యం ఉంది. ‘సర్‌’ కింద దేశవ్యాప్తంగా కోట్లాది పేర్లు డ్రాఫ్ట్‌ జాబితాల నుంచి మాయమయ్యాయి. తాజా నివేదిక ప్రకారం 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 13 కోట్లకు పైగా పేర్లు డ్రాఫ్ట్‌ రోల్స్‌లో కనిపించడం లేదు. అభ్యంతరం, విచారణ, అప్పీల్‌ వంటి ప్రక్రియలు ఉంటాయి కాబట్టి, డ్రాఫ్ట్‌ జాబితా నుంచి పేరు తొలగించడమంటే ఓటు హక్కు కోల్పోవడమేనని చెప్పలేం. కానీ ఒక పౌరుడి పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించిన క్షణం నుంచి అతని ఓటు హక్కును తిరిగి నిరూపించుకోవాల్సిన భారం మొదలవుతుంది. అందుకే ఇటువంటి ప్రక్రియలో పారదర్శకత అత్యంత కీలకం. పశ్చిమ బెంగాల్‌ పరిస్థితి ఈ ఆందోళనకు స్పష్టమైన ఉదాహరణ. ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం ‘సర్‌’ సందర్భంగా 27.16 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. వారిలో 22.21 లక్షల మంది తిరిగి తమ పేర్లు చేర్చాలని అప్పీల్‌ చేశారు. మరో 16.10 లక్షల అప్పీళ్లు ఇప్పటికే చేర్చిన పేర్లను తొలగించాలని కోరుతూ దాఖలయ్యాయి. మొత్తం అప్పీళ్ల సంఖ్య 38.31 లక్షలకు చేరింది. ఇంత భారీ సంఖ్యలో పౌరులు తమ ఓటు హక్కును తిరిగి నిర్ధారించుకోవాల్సిన దుస్థితి ఏర్పడినప్పుడు, ప్రతి చర్య వెనుక స్పష్టమైన అధికారం, కారణం, రికార్డు ఉండాలి. మరీ ముఖ్యంగా, ఒక న్యాయాధికారి ఓటరును జాబితాలో చేర్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎన్నికల సంఘం తరఫున ఎవరు అప్పీల్‌ చేశారు? వారికి ఆ అధికారం ఎవరు ఇచ్చారు? ఆ ప్రక్రియ గురించి కమిషన్‌లోని ఇతర సభ్యులకు సమాచారం ఉందా? అనే ప్రశ్నలు లేవనెత్తినట్లు వచ్చిన వార్తలను సాధారణ ‘పరిపాలనా సూచనలు‘గా కొట్టిపారేయడం తగదు. అదే విధంగా కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ‘ఫామ్‌ 6’లో చేసిన మార్పులపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల పేర్లు గత ‘సర్‌’ ఓటర్ల జాబితాలో ఉన్నాయా అనే అంశాన్ని కొత్త దరఖాస్తుదారుడితో సంబంధం పెట్టే రీతిలో ప్రశ్నగా నివేదికలు చెబు తున్నాయి. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఈ మార్పుకు చట్టపరమైన ఆధారం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం. ఇది ఒక సాంకేతిక అంశంలా కనిపించవచ్చు. కానీ ఓటర్ల జాబితాలో సాంకేతికతే హక్కును నిర్ణయించే స్థాయికి చేరితే అది సాంకేతిక సమస్యగా మిగలదు. ఎన్నికల సంఘం స్వయంగా దశాబ్దాలుగా ఓటర్ల జాబితా నిర్వహణలో వికేంద్రీకరణ ఒక రక్షణ వ్యవస్థగా ఉందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు రాష్ట్రస్థాయి చట్టబద్ధ అధికారుల డేటాబేస్‌ ప్రాప్యతను కేంద్రీకరించడం, డిజిటల్‌ వ్యవస్థలో స్థానిక అధికారుల నిర్ణయాలను నమోదు చేయలేని పరిస్థితి ఏర్పడటం వంటి అంశాలపై అంతర్గతంగా అభ్యంతరాలు వచ్చాయని నివేదికలు చెబుతున్నాయి. ఎన్నికల సంఘం మాత్రం అంతర్గత నోట్లను, అభిప్రాయ భేదాలను సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగం గా అభివర్ణించింది. తుది నిర్ణయాలు మొత్తం కమిషన్‌ ఆమోదంతో ఏకగ్రీవంగా తీసుకున్నామని కూడా స్పష్టం చేసింది. ఈ వివరణను పరిగణనలోకి తీసుకోవాలి. అయితే అదే సమయంలో అధికారికంగా నమోదైన అభ్యంతరాలు, వాటిపై తీసుకున్న నిర్ణయాలు, వాటిని అధిగమించి ఉత్తర్వులు జారీ అయితే దానికి ఉన్న చట్టపరమైన ఆధారం వంటి వివరాలు ప్రజలకు అందుబాటులోకి రావడం కూడా అవసరం. ఒక సంస్థ తన నిష్పాక్షికతను కేవలం ప్రకటనతో కాకుండా రికార్డులతో నిరూపించాలి. ఇప్పుడు రాజకీయ నిందారోపణ కాదు.. సంస్థాగత ఆత్మపరిశీలన అవసరం. మొదటగా, కమిషన్‌లోని ప్రతి ముఖ్య నిర్ణయానికి పూర్తి డిజిటల్‌ ఆడిట్‌ ట్రెయిల్‌ ఉండాలి. ఎవరు ప్రతిపాదించారు? ఎవరు అభ్యంతరం చెప్పారు? ఎవరు ఆమోదించారు? ఏ చట్టాన్ని ఆధారంగా తీసుకున్నారు? తుది నిర్ణయం ఎలా వచ్చింది? అన్న వివరాలు భద్రంగా నమోదు కావాలి. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మాత్రమే కాకుండా, అవసరమైన కాలపరిమితి వరకు ఆ రికార్డులను స్వతంత్ర ఆడిట్‌కు అందుబాటులో ఉంచాలి. అంతేకాదు, ఓటర్ల డేటాబేస్‌పై ఒకే స్థాయి లేదా ఒకే కార్యాలయానికి అధిక నియంత్రణ ఉండకూడదు. ఓటర్ల పేర్ల తొలగింపులో ‘ముందుగా తొలగింపు, తర్వాత వివరణ’ అనే విధానం ఉండ కూడదు. ముగ్గురు సభ్యుల కమిషన్‌లో విభేదాలు వచ్చినప్పుడు వాటిని దాచి పెట్టడం కంటే వ్యవస్థీకృతంగా నమోదు చేయడం అవసరం. అదే విధంగా, ఎన్నికల సంఘం నియామక వ్యవస్థపై కూడా విస్తృతమైన సంస్థాగత చర్చ అవసరం. ఎన్నికల సంఘాన్ని రక్షించడం అంటే దాని ప్రతి నిర్ణయాన్ని సమర్థించడం కాదు. కానీ, ప్రతి నిర్ణయం వెనుక హేతుబద్ధత ఉండాలి. స్వతంత్ర ఎన్నికల సంఘానికి బలమైన న్యాయపరమైన పర్యవేక్షణ, పార్లమెంటరీ జవాబుదారీతనం, స్వతంత్ర సాంకేతిక ఆడిట్‌, పారదర్శక రికార్డులు, పౌరులకు సమర్థవంతమైన అప్పీల్‌ వ్యవస్థ వంటివి అవసరం. ప్రజాస్వామ్యంలో ఓటు ఒక కాగితంపై గుర్తు కాదు. అది పౌరుడు తన ప్రభుత్వాన్ని నిర్ణయించుకునే రాజ్యాంగ హక్కు. ఆ హక్కును నిర్వహించే సంస్థపై ప్రజలకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం పారదర్శకతతో వస్తుంది. తప్పును సరిదిద్దే ధైర్యంతో వస్తుంది. ఎన్నికల కమిషన్‌ పేరుతో వివరణ సంతృప్తికరమైన సమాధానం కాజాలదు. అందునా ఎన్నికల కమిషన్‌ నిజాయితీ శంకించబడుతున్న ప్రస్తుత వాతావరణంలో, విశ్వాసం కలిగించదు. అందువల్ల ప్రభుత్వం ఆ ప్రతికా కథనంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించి, నిజానిజాలు ప్రజల ముందుంచాలి. లేకపోతే, కమిషన్‌ పక్షపాత వ్యవహార శైలిపై అనుమానాలు మరింత బలపడతాయి. అది ప్రజస్వామ్యానికి మరింత హాని చేస్తుంది.