Faria Abdullah: స్టోరీ నచ్చితేనే ఒప్పుకుంటా ‘ప్రజాపక్షం’ ఇంటర్వ్యూలో ఫరియా అబ్దుల్లా
కథలు రాస్తున్నా… డైరెక్షన్ చేస్తా : Faria Abdullah
నా పర్సనాలిటికి యాక్షన్ కూడా సెట్ అవుతుంది
Faria Abdullah: టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా చాలా తక్కువగా కనిపిస్తారు. ఒకరిద్దరు తప్ప అందరూ పరభాషా హీరోయిన్లే. తెలుగు తెరపై ఉన్న విపరీతమైన పోటీని సైతం తట్టుకుని సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది ఫారియా అబ్దుల్లా. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. కేవలం నటనతోనే కాకుండా ఈమె మంచి గాయని కూడా. ర్యాప్ బాగా పడుతుంది. ఆమెనే స్వయంగా పాటలు కూడా రాస్తుంది.
‘జాతి రత్నాలు’ సినిమాలో చిట్టిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ఫరియా ఇప్పుడు పరభాషా హీరోయిన్లకు సైతం పోటీనిస్తోంది. తెలుగు సినిమా చరిత్రలో ఒక పేజీని క్రియేట్ చేయూసుకున్న ఫారియా అబ్దుల్లా ‘ప్రజాపక్షం’కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది.
ప్రశ్న: మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చెప్పండి?
ఫరియా: నేను పుట్టి పెరిగింది అంత హైదరాబాద్. పక్క హైదరాబాద్ అమ్మాయిని. పదవ తరగతి వరకు మెరిడియన్ స్కూల్లో చదివాను. లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ చేశాను. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు మోడలింగ్ చేశాను. యూట్యూబ్‌లో వీడియోస్ చేశాను. ‘జాతి రత్నాలు’ సినిమా నా ఫస్ట్ మూవీ.
ప్రశ్న: మీరు ర్యాప్ సాంగ్స్ పడతారు… పాటలు కూడా రాస్తారు ఎలా అలవాటైంది?
ఫరియా: నాకు చిన్నప్పటి నుంచే అలవాటు అయింది. ర్యాప్ అంటే చాలా ఇష్టం. పాటలు బాగా వింటాను. రాయడం కూడా అలాగే అలవాటు ఇది. మత్తు వదలరా-2లో డ్రామా నక్కో మామ అనే సాంగ్‌ను నేనే రాసి పాడాను. ఇది పూర్తిగా హైదరాబాది హిందీలో ఉంటుంది.
ప్రశ్న: ఈ ర్యాప్ సాంగ్ పాడినందుకే మీకు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్‌లో స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చిది? ఎలా అనిపించింది?
ఫరియా: చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా నేను ఊహించలేదు. తెలంగాణ సర్కార్ ఫస్ట్ టైం అవార్డు ప్రవేశ పెట్టింది. ఫస్ట్ టైమే నాకు అవార్డు ఇచ్చింది. నాకు అవార్డు ఇచ్చిన జ్యురి మెంబర్స్‌కి నా తరపున స్పెషల్ థాంక్స్.
ప్రశ్న: సినిమాలు ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు?
ఫరియా: నాకు స్టోరీ నచ్చితేనే నేను ఒప్పుకుంటాను. స్టోరీలో నా రోల్ ఎలా ఉంది అనేది చూసుకుంటా. నా రోల్ నాకు కరెక్ట్ అనిపిస్తేనే సినిమా చేయడానికి సైన్ చేస్తా.
ప్రశ్న: ‘మత్తు వదలరా’ నుంచి యాక్షన్ వైపు ఆసక్తి చూపిస్తున్నట్టున్నారు?
ఫరియా: నా పర్సనాలిటి యాక్షన్ కూడా ఫిట్ అవుతుంది. నాకు అన్ని రకాల సినిమాలు చేయాలనుంది. యాక్షన్ సినిమాలు చేయడం కూడా ఇష్టపడతాను.
ప్రశ్న: తమిళ సినిమాల్లో కూడా అడుగుపెట్టినట్టున్నారు?
ఫరియా: అవును… తమిళ్ సినిమా కూడా చేస్తున్న. సిగ్మా నా తమిళ్ ఫస్ట్ మూవీ. లైకా లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ బ్యానర్లో అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇది మంచి యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో నా క్యారెక్టర్ రేడియో జాకీ. ఈ సినిమాలో నాకు మంచి ఎమోషన్స్ చూపించే అవకాశం దొరికింది.
ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ప్రజెంట్ చేశాను. ఫ్యామిలీతో కలిసి మీరు సినిమా చూడొచ్చు. సిగ్మా డైరెక్టర్ జేసన్ తమిళ్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అదంతా నాకు కూడా కలిసి వచ్చింది. జేసన్ జూమ్ కాల్లో కథ చెప్పారు. కథ మొత్తం విన్న తర్వాత ఆయన ఏజ్ ఎంత అని అడిగాను. 24 ఏళ్లు అని చెప్పారు. నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అబ్బాయి. కాకపోతే అలాంటి ఫీలింగ్‌ను మనలో కలిగించరు. చాలా వినయంగా ఉంటారు. అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోతారు. తనకు డైరెక్షన్ మీద మంచి కమాండ్ ఉంది. తొలి సినిమా అయినప్పటికీ ఎంతో క్లారిటీ ఉన్న విజన్‌తో తీశారు. తన సెట్‌ను హ్యాండిల్ చేసిన విధానం చాలా కూల్‌గా ఉంటుంది.
ప్రశ్న: తమిళ్‌కి వెళ్లారు కదా.. అక్కడి పరిశ్రమకు, ఇక్కడి పరిశ్రమకు ఏదైనా తేడా గమనించారా?
ఫరియా: పరిశ్రమ ఒకలాగే ఉంది. కాకపోతే ఆహారపు అలవాట్లు కొంచెం భిన్నంగా ఉన్నాయి. నేను ఎక్కడైనా అడ్జెస్ట్ అవ్వగలను. కొత్త కొత్త మనుషులు పరిచయం అయ్యారు. అందరూ ఫ్రెండ్లీగానే ఉన్నారు.
ప్రశ్న: దర్శకత్వం చేసే ఆలోచన ఉన్నట్టు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది?
ఫరియా: నిజమే… నాకు దర్శకత్వంపై ఆసక్తి ఉంది. కొన్ని కథలు రాస్తున్నాను. కాకపోతే దానికి ఇంకా సమయం వుంది. నేను దర్శకత్వం చేస్తూనే సినిమాలో నేను నటిస్తాను.
ప్రశ్న: తమిళ్లో కొత్త ఆఫర్స్ వచ్చాయా?
ఫరియా: కొన్ని కథలు విన్నాను. సిగ్మా రిలీజ్ అయిన తర్వాత వాటి గురించి ఒక నిర్ణయం తీసుకుంటాను. తెలుగులో కూడా కథలు వింటున్నాను.