ఎఐఎస్ఎఫ్ చరిత్ర తరతరాల విద్యార్థులకు స్ఫూర్తిమంతం
AISF
‘చదువుతో జ్ఞానం ఆర్జించండి.. సమాజ మార్పుకై పోరాడండి’ 90వ వార్షికోత్సవ పిలుపు
రచయిత: తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, ఎఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు
‘చదువు.. పోరాటం‘ అనే నినాదంతో, సామ్రాజ్యవాదానికి, మతతత్వానికి, కుల-వర్గ అసమానతలకు వ్యతిరేకంగా దేశచరిత్రలో చెరగని ముద్ర వేసిన భారతదేశ తొలి అఖిల భారత విద్యార్థి సంఘం ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్(ఎఐఎస్‌ఎఫ్). 1936 ఆగస్టు 12న జన్మించిన ఈ సంస్థ, 2026 నాటికి 90 సంవత్సరాల ఘనమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ ప్రస్థానంలో ఎన్నో ఉద్యమాలకు, పోరాటాలకు ఎఐఎస్‌ఎఫ్ వేదికగా నిలిచింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల హక్కుల పరిరక్షణకు, విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి తనవంతు పాత్ర పోషించింది. గడిచిన 90 ఏండ్ల కాలంలో విద్యార్థులకు అండగా నిలిచిన అతి పెద్ద విద్యార్థి సంఘంగా ఎఐఎస్‌ఎఫ్ ఖ్యాతి గడించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి 90వ వార్షికోత్సవాలు చారిత్రక నగరమైన ఓరుగల్లు వేదికగా నిర్వహించడం జరుగుతున్నది.
ఎఐఎస్‌ఎఫ్ ఆవిర్భావ నేపథ్యం
1936లో ఆగస్టు 12, 1936న ఉత్తరప్రదేశ్‌లోని లక్నో (గంగా ప్రసాద్ మెమోరియల్ హాల్)లో ఎఐఎస్‌ఎఫ్ ఆవిర్భవించింది. ఇందులో దేశవ్యాప్తంగా 11 ప్రావిన్సులు, 200 స్థానిక సంస్థల నుండి 936 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఈ సదస్సును ప్రారంభించగా, ముహమ్మద్ అలీ జిన్నా అధ్యక్షత వహించారు. మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగోర్ తదితరుల శుభాకాంక్షలు అందాయి. తొలి సాధారణ కార్యదర్శిగా ప్రేమ్ నారాయణ్ భార్గవ ఎన్నికయ్యారు. రెండో సదస్సు (లాహోర్, నవంబర్ 1936): శరత్ చంద్రబోస్ అధ్యక్షతన నిబంధనావళిని ఆమోదించి, ‘వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్’తో అనుబంధం ఏర్పాటు చేసుకున్నారు.
స్వాతంత్య్ర పోరాటంలో…
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త విద్యార్థి సమీకరణలో ఎఐఎస్‌ఎఫ్ కీలక పాత్ర పోషించింది. సింధ్‌కు చెందిన ఎఐఎస్‌ఎఫ్ కార్యకర్త హేము కలాని (19) బ్రిటిష్ సైన్యంచే ఉరితీయబడ్డారు. కనకలతా బరువా వంటివారు ప్రాణాలర్పించారు. బెంగాల్ కరువు (1943), ఆర్‌ఐఎన్ మ్యూటినీ (1946), 1943 బెంగాల్ కరువు సమయంలో సహాయక చర్యల్లో పాల్గొనడం, 1946లో బాంబేలో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుకు మద్దతుగా విద్యార్థులను కదిలింపజేయడం వంటి చారిత్రాత్మక పనులు చేసింది.
నవంబర్ 20న తొలిసారిగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ డే నిర్వహించారు. స్వతంత్ర భారతంలో పోరాట పంథా (శాస్త్రీయ సోషలిజం వైపు), స్వాతంత్య్రానంతరం పెట్టుబడిదారీ విధానాల వల్ల ఏర్పడిన నిరుద్యోగం, పేదరికం, ఆకలి మరణాలకు వ్యతిరేకంగా ఎఐఎస్‌ఎఫ్ నినదించింది. సమగ్ర విద్యారంగ సంస్కరణల కోసం ఉచిత, నిర్బంధ, శాస్త్రీయ, లౌకిక విద్య కోసం దేశవ్యాప్త పోరాటాలు నిర్వహించింది. ఫాసిజం, సామ్రాజ్యవాద వ్యతిరేక వేదికలపై అంతర్జాతీయంగా అంతర్జాతీయ విద్యార్థి సంఘం స్థాపనలో భాగస్వామ్యమైంది.
విద్య కాషాయీకరణ, కార్పొరేటీకరణపై
భారతీయ విద్యా వ్యవస్థను మతతత్వ భావజాలంతో నింపే కాషాయీకరణ, విద్యను అంగడి సరుకుగా మార్చే కార్పొరేటీకరణ, ప్రజాస్వామ్య, లౌకిక, శాస్త్రీయ దృక్పథానికి అత్యంత ప్రమాదకరమని ఎఐఎస్‌ఎఫ్ భావిస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఎఐఎస్‌ఎఫ్ నిరంతర సైద్ధాంతిక, ప్రత్యక్ష పోరాటాలు సాగిస్తోంది. శాస్త్రీయ దృక్పథానికి తూట్లు పొడుస్తూ డార్విన్ పరిణామ సిద్ధాంతం తొలగింపు, మొఘల్/మధ్యయుగ చరిత్ర వక్రీకరణ, మనువాద భావజాలాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాలను శాస్త్రీయ విద్యకు వ్యతిరేకంగా చూస్తుంది. ఎన్‌ఈపి 2020 తిరస్కరిస్తూ, జాతీయ విద్యా విధానం- విద్యను మరింత కేంద్రీకృతం చేస్తూ, మతతత్వ, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని, దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. యూనివర్సిటీలు చర్చావేదికలుగా, శాస్త్రీయ పరిశోధనా కేంద్రాలుగా ఉండాలే కానీ, మతతత్వ రాజకీయ క్రీడాక్షేత్రాలుగా మారకూడదని ఎఐఎస్‌ఎఫ్ స్పష్టం చేస్తుంది. క్యాంపస్‌లలో భావప్రకటన స్వేచ్ఛ, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ విద్యార్థులకు సామాజిక న్యాయం కోసం నిలబడుతుంది. ‘చదువుకునే వయసులో కుల, మత, కార్పొరేట్ విషబీజాలు కాదు… శాస్త్రీయ వైజ్ఞానిక చైతన్యం అందించాలి.’ అనేది ఎఐఎస్‌ఎఫ్ విద్యా విధాన వైఖరి.
ప్రాథమిక విద్యనుండి ఉన్నత విద్య/యూనివర్సిటీల వరకు ప్రైవేటు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని ఏఐఎస్‌ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఫీజుల మోత, విపరీతమైన ఫీజులు, డొనేషన్ల వల్ల బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతోందని, ఉచిత, నిర్బంధ నాణ్యమైన ప్రభుత్వ విద్యే ఏకైక పరిష్కారమని వాదిస్తుంది. తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం, విద్యార్థులపై కాలేజీల యాజమాన్యాల ఒత్తిళ్లకు వ్యతిరేకంగా ఎఐఎస్‌ఎఫ్ పెద్దఎత్తున సమ్మెలు, ధర్నాలు నిర్వహిస్తోంది. పాఠ్యపుస్తకాలలో శాస్త్రీయ చరిత్రను తొలగించి, మతతత్వ, పౌరాణిక గాథలను చొప్పించడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది.
తెలంగాణలో సంక్షోభంలో విద్యారంగం
తెలంగాణలో విద్యారంగం ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, మరోవైపు విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న ఉపాధ్యాయ, ఆచార్యుల ఖాళీలు విద్యారంగాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామని ప్రకటనలు వస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో దాదాపు 80శాతం వరకు బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. విసిల నియామకాలు, రెగ్యులర్ ప్రొఫెసర్లు లేకపోవడం వల్ల ఉన్నత విద్య ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయుల కొరత వల్ల ఒకే గదిలో ఐదు తరగతులను ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సిన దుస్థితి నెలకొంది. పేదరికం, రవాణా సౌకర్యాల లేమి, సరైన వసతులు లేకపోవడం వల్ల పదో తరగతి, ఇంటర్మీడియట్ దశలోనే విద్యార్థులు చదువు మధ్యలో మానేస్తున్న సంఖ్య పెరుగుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో కనీస పఠనా సామర్థ్యాలు కూడా సరిగ్గా లేకపోవడం విద్యా వ్యవస్థలోని లోపాలను కళ్లకు కడుతోంది. విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌లు అందడం లేదు.
ఈ సమస్యలను చక్కదిద్దేందుకు ప్రభుత్వం విద్యా కమిషన్ నివేదికల ఆధారంగా కొన్ని కీలక మార్పులకు, పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనం వంటి సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నప్పటికీ, కేవలం చట్టాలు, జిఒల వల్ల మాత్రమే మార్పు రాదు. భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన విద్యారంగం ఇలా అస్తవ్యస్తంగా మారితే అది రాష్ట్ర భవిష్యత్తుకే పెద్ద ముప్పు. తక్షణమే ప్రభుత్వం నాణ్యమైన విద్య అందేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఆచార్యుల పోస్టులను భర్తీ చేసి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
వర్థమాన సవాళ్లు.. 90వ వసంతం లక్ష్యాలు
నేటి కాలంలో జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపి 2020)లోని విద్య కార్పొరేటీకరణ, కాషాయీకరణ, ఫీజుల పెంపుదలకు వ్యతిరేకంగా ఏఐఎస్‌ఎఫ్ గళం వినిపిస్తోంది. శాస్త్రీయ దృక్పథం, సామాజిక న్యాయం, లింగ సమానత్వం, విద్యార్థుల ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం నేటి యువతకు ఎఐఎస్‌ఎఫ్ 90 ఏళ్ల చరిత్ర ఒక దిక్సూచిగా నిలుస్తుంది. ‘చదువుతో జ్ఞానాన్ని ఆర్జించండి… సమాజ మార్పు కోసం పోరాడండి’ అనే మూలసూత్రంతో ఏఐఎస్‌ఎఫ్ తరం నుంచి తరానికి స్ఫూర్తిని పంచుతూనే ఉంది.
(సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో హనుమకొండలో ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర స్థాయి వార్షికోత్సవాలు జరుగుతున్న సందర్భంగా)