అమిత్ షా విచిత్ర విన్యాసాలు… చర్చకు సిద్ధమంటారు… సభకు మాత్రం రారు..
అమిత్ షా విచిత్ర విన్యాసాలు... చర్చకు సిద్ధమంటారు… సభకు మాత్రం రారు..
బాధ్యత తప్పించుకునేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్యలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటితో పూర్తి కానున్నాయి. అయితే, ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం ఉభయ సభలు జరుగుతున్న సమయంలో సభకు హాజరుకాలేదు. బుధవారం నాడు హోం మంత్రి అమిత్ షా ‘తమ ప్రభుత్వం ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉందని, నీట్‌పై చర్చ జరగాలని ప్రతిపక్షాలు మొదటి నుంచి కోరుతున్నాయని, వారి డిమాండ్‌కు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని’ అన్నారు. ప్రతిపక్షాలు అంగీకరిస్తే మధ్యాహ్నం 3 గంటల లోగా స్పీకర్‌కు చర్చ కోసం నోటీసు ఇస్తే, మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు చర్చ జరిపి, దానికి స్వయంగా తానే సమాధానమిస్తానని కూడా అన్నారు. ఈ మేరకు స్పీకర్‌కు కూడా ఆయన లేఖ రాశారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన జులై 20న విద్యార్థులపై లాఠీఛార్జి జరిపి, పెల్లెట్ గన్ల ప్రయోగించిన నాటి నుంచి ప్రతిపక్షాలు ప్రతిరోజూ కేంద్ర హోం మంత్రి ప్రకటన కోసం పట్టుబట్టాయి. ఎందుకంటే ఘటన జరిగిన రాజధాని ఢిల్లీ పరిధిలో పోలీసులు, కేంద్ర బలగాలు ప్రత్యక్షంగా కేంద్ర హోం మంత్రి ఆధీనంలోనే ఉంటాయి. అందుకే ప్రత్యేకించి ఆయన సభకు రావాలని డిమాండ్ చేస్తున్నా, అమిత్ షా అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభకు రాకుండా ముఖం చాటేశారు.
అకస్మాత్తుగా సమావేశాలు ముగిసే ఒక రోజు ముందు తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, స్వయంగా తానే జవాబిస్తానని అనడం ద్వారా, ఇన్ని రోజులు ప్రభుత్వం సభ వాయిదా వేసుకుంటూ పోయిన అప్రదిష్ట నుంచి దృష్టి మళ్లించటమే కేంద్ర ప్రభుత్వం, హోం మంత్రి ఉద్దేశ్యంగా కనపడుతోంది. నిజంగా ఆయనకు చిత్తశుద్ధే ఉంటే, తొలి రోజు నుంచి ప్రతిపక్షాలు అనేకమార్లు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చాయి. వాటిని ఆమోదింపజేస్తే, చర్చ జరిగే అవకాశం ఉండేది. పోనీ, తాము చర్చకు సిద్ధమేనని మొదట్లోనే అమిత్ షా స్వయంగా సభకు వచ్చి చెప్పినా పోయేది. ఇరవై రోజులకుపైగా సమావేశాలు వృథా అయ్యేవి కావు.
అలా కాకుండా, సమావేశాలు ఒక్కరోజు కూడా సవ్యంగా జరగలేదనే అపఖ్యాతిని ప్రతిపక్షం ఖాతాలో వేసేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజూ రెండు రోజులుగా సభలో చర్చకు సిద్ధమేనని చెబుతున్నారే తప్ప, అందుకు వాతావరణాన్ని సృష్టించలేకపోయారు.
స్వంత శాఖల బిల్లులనే ప్రవేశపెట్టలేకపోయారు
ఈసారి పార్లమెంటు ముందు అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో పాటు, సహకార శాఖకు సంబంధించిన అనేక ముఖ్యమైన బిల్లులు ఉభయ సభల ముందుకు వచ్చాయి. వందేమాతరం బిల్లు, కేరళ పేరును కేరళంగా మార్చే బిల్లు, జాతీయ సహకార అభివృద్ధి చట్ట సవరణ బిల్లులతో పాటు కీలకమైన విదేశీ విరాళాల చట్ట సవరణ (ఎఫ్‌సిఆర్‌ఎ) బిల్లులపై ప్రతిపాదకుడిగా అమిత్ పేరే ఉంది. ఇన్ని బిల్లులు ప్రవేశపెట్టినా ఆయన మాత్రం సభలోపలికి వచ్చిన దాఖలాలు లేవు. వాటిని ఆయా శాఖల సహాయ మంత్రులే ప్రవేశపెట్టారు.
ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించగా, సహాయ మంత్రులు ప్రవేశపెట్టేందుకు నిబంధనలు అనుమతిస్తాయని కేంద్ర మంత్రులు చెప్పారు. అయితే, రాజ్యసభలో బుధవారం సహకార చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదో ఒక రోజు, ఏదో కారణంతో బిల్లు ప్రతిపాదించే మంత్రి రాలేదంటే అర్థం చేసుకోవచ్చని, కానీ ప్రతి రోజు ఇలాగే అయితే ఎలా అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ట్రెజరీ బెంచ్‌ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
లోక్‌సభలో ఎఫ్‌సిఆర్‌ఎ బిల్లును జెపిసికి పంపుతుండగా, కాంగ్రెస్ ఎంపీ కె.సి. వేణుగోపాల్ అభ్యంతరం పెడుతూ, బిల్లుపై అమిత్ షా పేరు ఉండడాన్ని ప్రస్తావించారు. ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మరో వైపు ‘అమిత్ షా ‘మిస్సింగ్’ అంటూ విపక్ష ఎంపీలు చేస్తున్న నినాదాలకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గత రెండు రోజులుగా స్పందిస్తూ, ఆయన ఇక్కడే (పార్లమెంటు భవనంలోనే) ఉన్నారని, చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆయనే జవాబిస్తారని చెప్పారు. ఆ సమయంలో కూడా హోం మంత్రి అమిత్ షా సభలో కనిపించలేదు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయన ఛాంబర్‌లో ఉన్నారనే విషయాన్ని, ఆయన ఇక్కడే ఉన్నారని చెప్పడం ద్వారా సభలోనే ఉన్నారనే భావన కలిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది.
మొత్తమ్మీద సభ జరిగే సమయంలో సభకు రాకుండా అమిత్ షా పార్లమెంటుకు వచ్చి తన ఛాంబర్‌లో ఉన్నప్పటికీ, ఆయన సభలోనే ఉన్నట్లుగా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కేంద్ర మంత్రులు శతథా కృషి చేశారు. పైగా తాము చర్చకు సిద్ధమన్నా, ప్రతిపక్షాలే రాకుండా పారిపోయాయంటూ సభ వాయిదా పడిన అనంతరం మంత్రి కిరణ్ రిజిజు చతురతతో పాపాన్ని ప్రతిపక్షాలపై తోసేశారు.
వర్షాకాల సమావేశాల ప్రారంభంలో ‘చలో సంసద్’ ఘటనలపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసులు ఉభయ సభాధిపతుల తిరస్కృతికి గురయ్యాయి. ఆ తరువాత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్దిష్టంగా రెండు ప్రశ్నలకు జవాబు కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అందులో ఢిల్లీ పోలీసులు, రిజర్వ్ పోలీసు బలగాలు ప్రత్యక్షంగా కేంద్ర హోం మంత్రి పరిధిలోకే వస్తాయి కాబట్టి, విద్యార్థులపై పెల్లెట్ గన్ ప్రయోగించటానికి ఆదేశాలు ఎవరిచ్చారు? నాడు పోలీసులతో పాటు, సాధారణ దుస్తుల్లో ఉండి లాఠీఛార్జ్ చేసిన వ్యక్తులు ఎవరు? అని ప్రశ్నించారు.
తన లేఖకు సమాధానం ఇప్పటికీ రాలేదని రాహుల్ గాంధీ చెప్పారు. కాబట్టి తాము వాటిపై హోం మంత్రి ప్రకటనను కోరుతున్నామని, అంతే తప్ప చర్చకు జవాబు పేరుతో ఆయన పాఠాలు వినేందుకు సిద్ధంగా లేమని రాహుల్ గాంధీ, ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. పైగా హోం మంత్రి బాధ్యత వహించి రాజీనామా డిమాండ్ కూడా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వర్షాకాల సమావేశాలు జరిగినన్ని రోజులు సభలోకి ప్రవేశించకుండా, సమావేశాలు ముగిసేందుకు ఒకరోజు ముందు అమిత్ షా ఒకరిద్దరు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను సమాధానమిచ్చేందుకు సిద్ధమేనని, చర్చను కోరుతూ ప్రతిపక్షాలు సరైన రీతిలో స్పీకర్‌కు నోటీసు ఇవ్వాలని అనడం ద్వారా నెపం నుంచి తప్పించుకునే యత్నం చేశారు. పైగా ప్రకటన ఇస్తే, పరిమితంగానే ఉంటుందని, చర్చకు జవాబివ్వడం సమగ్రంగా ఉంటుందన్నారు.
నిజమే, ఏదైనా విషయంలో స్పీకర్ ముందస్తు అనుమతి తీసుకుని మంత్రులు సభ ముందు ప్రకటన చేయవచ్చు. దానిపై వివరణలు కోరే అవకాశం ఉంటుందే తప్ప పెద్దగా చర్చకు తావుండదు. కానీ, పార్లమెంటు సమావేశంలో ఉండగా, దానికి ఆమడ దూరంలో జరిగిన అసాధారణ ఘట్టాలపై ప్రకటన అనంతరం విపులంగా వివరణ కోరేందుకు విపక్షాలకు తగిన వెసులుబాటును ఇవ్వడంలో పెద్దగా అభ్యంతరమేమీ ఉండకపోవచ్చు.
అయితే, ప్రభుత్వం కూడా నీట్ లీకేజీ, తదనంతర పరిణామాలపై చర్చకు సిద్ధమని అంటుందే తప్ప ప్రతిపక్షాలు కోరుతున్నట్లుగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్, పెల్లెట్ గన్ల గురించి కాదు. నీట్ లీకేజీ అంశంపై ఇప్పటికే ప్రశ్నపత్రాల లీకేజీపై సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో చర్చ జరిగింది. అప్పుడు సైతం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా అధికార పక్షం అడ్డుకోవడంతో అర్థాంతరంగా ఆయన ముగించాల్సి వచ్చింది.
సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి ప్రధాని మోదీ సైతం పార్లమెంటు భవనంలోని తన కార్యాలయంలో ఉంటున్నప్పటికీ, ఇప్పటి వరకు రాజ్యసభ, లోక్‌సభలోపలికి వచ్చి కూర్చున్న దాఖలాలు లేవు. ఆయన సెల్ఫీ వీడియోల ప్రకటనలు, ఎన్డీఏ ఎంపీలతో ‘మంగళ్ మిలన్’ పేరుతో కలయిక సమావేశాలలోనే బాహ్య ప్రపంచానికి కనపడుతున్నారు.
ఢిల్లీ ఘటనలకు సమాధానం చెప్పాల్సిన హోం మంత్రి మాత్రం ఏమీ మాట్లాడకుండా చివరి రోజు విచిత్ర విన్యాసాలతో తప్పించుకునే పనిలో పడ్డారు.