‘ఇ 20’ వాడకం కాదు.. అమలు విధానమే ఆక్షేపణీయం
E20 Fuel
–ఆర్. సూర్యమూర్తి
భారతదేశంలో ‘ఇ 20’ పెట్రోల్‌పై చర్చను ఇథనాల్ మంచిదా, చెడ్డదా? అనే ప్రశ్నకు పరిమితం చేయడం అనేది అసలు సమస్యను తప్పుదోవ పట్టించడమే. ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం వెనుక ప్రభుత్వం చూపిస్తున్న ఆర్థిక, వ్యూహాత్మక కారణాలకు బలమైన ఆధారం ఉంది. అదే సమయంలో వాహనదారులు, వినియోగదారులు లేవనెత్తుతున్న సందేహాలను అపోహలుగా కొట్టిపారేయడం కూడా సరైంది కాదు. ఇక్కడ ప్రశ్న ఇథనాల్ గురించి కాదు. ఒక భారీ జాతీయ విధానాన్ని అమలు చేసేటప్పుడు ప్రభుత్వం ప్రజలను ఎంతవరకు భాగస్వాములుగా చూసింది అన్నదే కీలకం.
‘ఇ 20’ అంటే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపడం. భారత్ గత దశాబ్దంలో ఇథనాల్ బ్లెండింగ్‌ను వేగంగా పెంచింది. 2013 పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం కేవలం 1.53 శాతం ఉండగా, 2025 ఇథనాల్ సప్లై ఇయర్‌లో అది 20 శాతానికి చేరింది. 2030 నాటికి చేరుకోవాలని మొదట నిర్ణయించిన లక్ష్యాన్ని భారత్ ఐదేళ్ల ముందుగానే సాధించింది. ఇది భారత ఇంధన విధానంలో గణనీయమైన మార్పు. కానీ ఈ విజయాన్ని అంచనా వేయడానికి బ్లెండింగ్ శాతాన్ని మాత్రమే చూడలేం. ప్రజల అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
‘ఇ 20’ నిర్ణయం కేవలం ప్రయోగాత్మకంగా మాత్రమే అమలు జరుగుతున్నదని సుప్రీం కోర్టులో అటార్నీ జనరల్ పేర్కొంటే, కేంద్ర ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు ప్రకటన చేసింది. ఇథనాల్ సేకరణ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపడుతున్నామే తప్ప, ఇథనాల్ వాడకాన్ని కాదని తేల్చిచెప్పింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాన్యుడి ప్రశ్నలు ప్రతిధ్వనిస్తున్నాయి.
మన దేశం చమురు అవసరాల్లో భారీగా దిగుమతులపై ఆధారపడుతోంది. అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరిగినప్పుడు దాని ప్రభావం కేవలం పెట్రోల్ ధరలకే పరిమితం కాదు. విదేశీ మారకద్రవ్య వ్యయం పెరుగుతుంది, రూపాయిపై ఒత్తిడి వస్తుంది, వాణిజ్య లోటు విస్తరిస్తుంది, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. రష్యా యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో నౌకాయానానికి ఎదురైన సమస్యలు ఈ ప్రమాదాన్ని మరింత స్పష్టంగా చూపించాయి. చమురు కోసం ప్రపంచ మార్కెట్‌పై అధికంగా ఆధారపడే దేశానికి ఇంధన భద్రత ఆర్థిక అంశమే కాకుండా, వ్యూహాత్మక అంశంగా కూడా మారుతుంది.
ఈ నేపథ్యంలో దేశంలోనే ఉత్పత్తి చేసే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ప్రభుత్వానికి సహజమైన వ్యూహంగా కనిపించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా 316 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ముడిచమురు దిగుమతులను భర్తీ చేయగలిగింది. దాదాపు రూ. 1.98 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసింది. రైతులకు రూ. 1.66 లక్షల కోట్లకు పైగా ఆదాయం లభించిందని, దాదాపు 952 లక్షల మెట్రిక్ టన్నుల కర్బన (కార్బన్‌డైయాక్సైడ్) ఉద్గారాలను తగ్గించిందని ప్రభుత్వం చెబుతోంది.
నిజానికి ఈ గణాంకాలను విస్మరించడానికి కారణం లేదు. ఇథనాల్ కార్యక్రమం భారతదేశానికి ఇంధన భద్రత, రైతుల ఆదాయం, విదేశీ మారకద్రవ్య పొదుపు వంటి రంగాల్లో స్పష్టమైన ప్రయోజనాలు అందించింది. కాబట్టి ‘ఇ 20’ ఆలోచనలోనే తప్పు ఉందని చెప్పలేం. కానీ, సమస్య ఇథనాల్‌లో కాదు.. పెట్రోల్‌లో 20 శాతం చేర్చాలన్న నిర్ణయాన్ని అమలు చేసిన విధానంలో ఉంది.
ప్రభుత్వం ఒక విధానాన్ని దేశ ప్రయోజనంగా చూస్తుంది. సాధారణ పౌరుడు మాత్రం దాని ప్రభావాన్ని తన జీవితంలో ఎలా అనుభవిస్తున్నాడో చూస్తాడు. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల దేశానికి విదేశీ మారకద్రవ్య ఆదా కావచ్చు. రైతులకు ఆదాయం పెరగవచ్చు. దిగుమతులపై ఆధారం తగ్గవచ్చు. ఇవన్నీ సామూహిక ప్రయోజనాలు. కానీ ఒక వాహనదారుడికి మైలేజ్ తగ్గితే ఆ ఖర్చు నేరుగా అతని జేబుపై పడుతుంది. దీని వల్ల మూడు నుంచి ఐదు శాతం వరకూ మైలేజీ తగ్గే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్పడం అనుమానాలను మరింత పెంచుతున్నది.
వాహనం ‘ఇ 20’కు అనుకూలంగా లేకపోతే సమస్య కూడా వాహనదారుడిదే. ఇంజిన్ లేదా ఇంధన వ్యవస్థలో లోపం తలెత్తితే బాధ్యత ఎవరిదో స్పష్టంగా తెలియకపోతే వినియోగదారుడే నష్టపోతాడు. ‘నా వాహనం ‘ఇ 20’కు అనుకూలమా? పాత వాహనాలకు ఏం జరుగుతుంది? మైలేజ్ తగ్గితే దాని భారం ఎవరు భరిస్తారు? సమస్య తలెత్తితే స్వతంత్ర సాంకేతిక పరీక్ష ఎక్కడ జరుగుతుంది?’ అంటూ సామాన్యుడు సంధిస్తున్న ప్రశ్నలు దేశమంతా ప్రతిధ్వనిస్తున్నాయి.
‘ఇ 20 వినియోగం దేశానికి అవసరం’ అనే ఒకే ఒక్క సమాధానంతో ప్రశ్నలన్నింటినీ దాటవేయడం మంచిది కాదు. వినియోగదారుడి వ్యక్తిగత సమస్యకు జాతీయ గణాంకాలు పూర్తి సమాధానం ఇవ్వలేవు.
‘ఇ 20’పై చర్చలో అత్యంత వివాదాస్పద అంశంగా వాహనాల పనితీరును ప్రస్తావించాలి. ఒకవైపు ‘ఇ 20’ వల్ల భారీ స్థాయిలో ఇంజిన్ నష్టం జరుగుతోందనే ప్రచారం ఉంది. మరోవైపు అలాంటి సమస్యకు విస్తృత ఆధారం లేదని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుత ఆధారాల ప్రకారం రెండింటిలోనూ నిజాలు ఉన్నాయి. అబద్ధాలు కూడా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం ‘ఇ 20’ వల్ల దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఇంజిన్ వైఫల్యాలు సంభవించినట్లు నిర్ధారిత ఆధారం లేదని తెలిపింది. కోట్లాది వాహనాలు ‘ఇ 15’ నుంచి ‘ఇ 20’ వరకు ఇంధనాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ వ్యవస్థాత్మక ఇంజిన్ వైఫల్యాలు కనిపించలేదని ప్రభుత్వం పేర్కొంది. అయితే, వినియోగదారుల ఫిర్యాదులను కూడా విస్మరించలేం.
2026లో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల కమిషన్ ఒక ‘గ్రాండ్ వితారా స్ట్రాంగ్ హైబ్రిడ్’కు సంబంధించిన కేసులో వాహనదారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ‘ఇ 20’ ఇంధనంతో సంబంధం ఉన్న వాహన సమస్యపై మారుతి సుజుకి, డీలర్‌పై కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ ఈ తీర్పును సవాలు చేయనున్నట్లు తెలిపింది.
ఈ తీర్పును ‘ఇ 20’ వల్ల దేశంలోని అన్ని వాహనాలు దెబ్బతింటున్నాయని నిరూపించే ఆధారంగా చూడటం తప్పు. అదే సమయంలో వినియోగదారుల ఫిర్యాదులకు విశ్వసనీయమైన పరిష్కార వ్యవస్థ అవసరమని ఈ కేసు గుర్తుచేస్తుంది. కాబట్టి, రాజకీయ ప్రకటన కంటే, స్వతంత్ర, దీర్ఘకాలిక సాంకేతిక అధ్యయనమే ఇప్పుడు కీలకం.
వాహనం తయారైన సంవత్సరం, ఇంజిన్ డిజైన్, ఇంధన వ్యవస్థ, నిర్వహణ చరిత్ర, ఇంధన నాణ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ‘ఇ 20’ ప్రభావాన్ని విశ్లేషించాలి. ఒక వాహనం సమస్యకు ‘ఇ 20’ కారణమా, తయారీ లోపమా, నిర్వహణ లోపమా, ఇంధన కలుషితమా అన్నది శాస్త్రీయంగా నిర్ధారించాలి. అప్పుడే ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం చూరగొంటుంది.
ఇథనాల్ వినియోగంలో బ్రెజిల్‌ది అగ్రస్థానం. కానీ బ్రెజిల్ ఈ వ్యవస్థను ఒక్క దశాబ్దంలో నిర్మించలేదు. దశాబ్దాలపాటు ఇంధన ఉత్పత్తి, వాహన సాంకేతికత, సరఫరా వ్యవస్థ, వినియోగదారుల ఎంపికలను సమాంతరంగా అభివృద్ధి చేసింది. అక్కడ ‘ఫ్లెక్సీఫుయెల్’ వాహనాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు పెట్రోల్, ఇథనాల్ లేదా వాటి మిశ్రమాల మధ్య ఎంపిక చేసుకునే అవకాశం పొందారు. అంటే ఇంధన మార్పును కేవలం ప్రభుత్వ ఆదేశంగా కాకుండా ఒక పూర్తి మార్కెట్ వ్యవస్థగా అభివృద్ధి చేశారు.
అమెరికా సైతం ‘ఇ 10’ను సాధారణ మిశ్రమంగా ఉపయోగిస్తున్నప్పటికీ ‘ఇ 15’, ‘ఇ 85’ విషయంలో వాహన అనుకూలత, లేబులింగ్, నియంత్రణలను స్పష్టంగా అమలు చేస్తోంది. ఈ దేశాల నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలి. ఒక నిర్ణయాన్ని అత్యంత వేగంగా అమలు చేయడం పరిపాలనా సామర్థ్యానికి సంకేతం కావచ్చు. కానీ వేగం కారణంగా సంప్రదింపులు, సాంకేతిక పరీక్షలు, వినియోగదారుల అవగాహన, పాత వాహనాల రక్షణ వంటి అంశాలు వెనుకబడితే అదే వేగం రాజకీయ బలహీనతగా మారుతుంది.
‘ఇ 20’ చర్చను వాహనాలకే పరిమితం చేయకుండా, ఇథనాల్ తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలపై కూడా దృష్టి సారించాలి. భారతదేశంలో చెరకు ఇథనాల్‌కు ముఖ్యమైన వనరు. అయితే చెరకు అధిక నీటి అవసరం కలిగిన పంట. ఇథనాల్ కోసం చెరకు ఉత్పత్తి పెరిగితే భూగర్భజలాలపై దాని ప్రభావాన్ని నిరంతరం పరిశీలించాలి.
మొక్కజొన్నపై ఎక్కువగా ఆధారపడినా సమస్యలు తప్పవు. ఎందుకంటే, మొక్కజొన్న చాలా మందికి ప్రధానమైన ఆహారం. పశుగ్రాసం, పౌల్ట్రీ పరిశ్రమలకు కూడా అవసరం. ఇంధన డిమాండ్ పెరగడం వల్ల ఈ రంగాలపై ధరల ఒత్తిడి తప్పదు. ఈ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించి, నిర్ణయాలు తీసుకోవాలి.
భారత్ ఇప్పటికే వ్యవసాయ అవశేషాలు, రెండో తరం బయోఫ్యూయల్స్ వంటి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తోంది. ఇది సరైన దిశ. భవిష్యత్తులో ఇథనాల్ ఉత్పత్తి పెరిగే కొద్దీ నీరు, భూమి, ఆహార భద్రత, పర్యావరణ ప్రభావాలను కూడా విధానంలో భాగంగా పరిగణించాలి. ఒక దిగుమతి ఆధారాన్ని తగ్గించి మరో వనరుపై అధిక ఆధారాన్ని సృష్టించడం ఇంధన భద్రతకు సంపూర్ణ పరిష్కారం కాదు.
అదే సమయంలో, భారత్ ‘ఇ 20’ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని కోరడం కూడా సరైన విధానం కాదు. భారీ చమురు దిగుమతులపై ఆధారపడుతున్న దేశానికి దేశీయ ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అవసరం. ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ కొనసాగుతున్నప్పటికీ అంతర్గత దహన ఇంజిన్ వాహనాలు చాలా కాలం రవాణా వ్యవస్థలో ఉంటాయి.
అందువల్ల అసలు ప్రశ్న ‘ఇ 20’ ఉండాలా? వద్దా? అని కాదు. ‘ఇ 20’ను మరింత పారదర్శకంగా, శాస్త్రీయంగా, వినియోగదారులకు న్యాయం జరిగే విధంగా ఎలా అమలు చేయాలన్నదే ప్రధానం.
ప్రభుత్వం స్వతంత్ర దీర్ఘకాలిక ఇంజిన్ పనితీరు అధ్యయనాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. వినియోగదారుల ఫిర్యాదులను నమోదు చేసి సాంకేతికంగా పరిశీలించే జాతీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పాత వాహనాలకు స్పష్టమైన అనుకూలత మార్గదర్శకాలు ఇవ్వాలి. ఇంధన పంపుల వద్ద ఇథనాల్ మిశ్రమ శాతం స్పష్టంగా కనిపించేలా లేబులింగ్ చేయాలి.
భవిష్యత్తులో ‘ఇ 20’కు మించి వెళ్లే ఏ నిర్ణయమైనా ముందుగా సాంకేతిక అధ్యయనాలు, పరిశ్రమ సంప్రదింపులు, వినియోగదారుల అభిప్రాయాలు, పర్యావరణ ప్రభావాల అంచనాల ఆధారంగా తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో పెద్ద విధానాలను కేవలం నోటిఫికేషన్‌తో అమలు చేయడం సరిపోదు. ప్రజల నమ్మకం కూడా విధానంలో భాగమే.