Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కొత్త మలుపు.. కిడ్నాప్ కోణంలో విచారణ.. పెంపుడు కుక్క మృతిపై అనుమానాలు!

Prajapaksham 20 Jun 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కొత్త మలుపు.. కిడ్నాప్ కోణంలో విచారణ.. పెంపుడు కుక్క మృతిపై అనుమానాలు!

Kakinada Jahnavi Case Takes Another Twist, Police Probe Kidnap Angle

కాకినాడ జిల్లా తుని మండలం ఎస్‌.అగ్రహారంలో గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జానూ) కేసు సరికొత్త మలుపు తిరిగింది. అధికారిక పోలీస్ బృందాలు, డాగ్ స్క్వాడ్స్ దాదాపు రెండు వారాల పాటు సెర్చ్‌ ఆపరేషన్‌ పేరిట గ్రామంలోని అణువణువు జల్లెడ పట్టినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. దీంతో సాంప్రదాయ విచారణతో లాభం లేదని భావించిన పోలీసులు ఇప్పుడు మరో సంచలన కోణంలో ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేయాలని నిర్ణయించారు.

ఈ నెల 6వ తేదీన ఇంటి బయట ఆడుకుంటూ తన పెంపుడు కుక్కతో పాటే జ్ఞానేశ్వరి అకస్మాత్తుగా అదృశ్యమైంది. అప్పటి నుంచి తల్లిదండ్రులు, స్థానికులు ,ప్రత్యేక బృందాలు రాత్రింబవళ్లు గాలిస్తున్నా చిన్నారి ఆచూకీ లభించలేదు. ఇప్పటివరకు ప్రధానంగా సీసీటీవీ ఫుటేజ్‌, సెల్‌ఫోన్‌ డేటా ఆధారంగా సాగిన విచారణను పక్కన పెట్టి, తాజాగా ‘కిడ్నాప్‌ కోణం’పై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు సమాచారం అందుతోంది.

ఈ సుదీర్ఘ దర్యాప్తులో భాగంగా లభించిన ఒక కొత్త సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు ప్రస్తుతం అత్యంత కీలకమైన క్లూగా భావిస్తున్నారు. చిన్నారితో పాటు కనిపించకుండాపోయిన వారి పెంపుడు శునకం సరిగ్గా అదే రోజు గ్రామంలోని వినాయకుని ఆలయం వద్ద తిరుగుతూ సీసీ కెమెరాకు చిక్కింది. మధ్యాహ్నం 1.02 గంటల సమయంలో ఆ కుక్క తీవ్ర ఆందోళనతో అటు ఇటు సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. కానీ ఆ తర్వాత అది ఎటు వెళ్లిందనే దానిపై స్పష్టత రాలేదు.

అయితే విచిత్రంగా అదృశ్యమైన మూడు రోజుల తర్వాత అదే శునకం ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి అది ఇంట్లో ఎవరిని చూసినా విపరీతంగా దాడి చేస్తూ, విచిత్రంగా ప్రవర్తించసాగింది. దానికి పశువైద్యులతో చికిత్స చేయించిన తర్వాత కాస్త కోలుకోవడంతో, పోలీసులు దాని మెడకు ‘జీపీఎస్‌ ట్రాకర్‌’ కట్టి చిన్నారి ఆచూకీ కోసం అడవుల్లోకి వదిలినా ఆ ప్రయత్నం ఫలించలేదు. చివరకు ఆ శునకం కూడా అనారోగ్యంతో చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు.

ప్రస్తుతం కిడ్నాప్‌ కోణంలో కేసును పరిశీలిస్తున్న పోలీసులు విచారణలో భాగంగా ఇప్పటికే ఆ ప్రాంతంలో నమోదైన దాదాపు 6 వేలకుపైగా ఫోన్‌ కాల్స్‌ డేటాను క్షుణ్ణంగా విశ్లేషించారు. విచారణ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి గ్రామానికి వచ్చిన అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై కూడా నిఘా పెట్టారు. ముఖ్యంగా సమీపంలోని కొండ ప్రాంతాల్లో నివసించే వేట ముఠాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

వన్యప్రాణుల కోసం ఆ ముఠాలు అడవిలో అమర్చిన కరెంట్‌ ఉచ్చు (విద్యుత్ వైర్లు)లో చిన్నారి పొరపాటున చిక్కుకుందా, లేక మరేదైనా ఘోరం జరిగి ఉంటుందా అనే భయాందోళనల కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. జిల్లాలో గతంలో జరిగిన ఇలాంటి చిన్న పిల్లల అదృశ్యం కేసుల రికార్డులను, పాత నేరస్థుల కదలికలను కూడా ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సంచార జాతులపై గట్టి నిఘా ఉంచిన పోలీసులు పిఠాపురం, కోటవురట్ల, దివి పోలవరం ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

మరోవైపు చిన్నారి ప్రాణాలకు రక్షణగా నిలిచిన పెంపుడు శునకం మరణించడంపై స్థానికుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది అనారోగ్యంతోనే మరణించిందని అధికారులు చెబుతున్నప్పటికీ, దానికి సంబంధించిన శవపంచనామా ,పోస్టుమార్టం నివేదిక (Post-mortem Report) ఇన్ని రోజులైనా ఇంకా రాకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ మూగజీవి నిజంగానే అనారోగ్యంతో చనిపోయిందా, లేక చిన్నారిని అపహరించిన వారే దానికి ఏదైనా విషం పెట్టి చంపేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మిస్టరీని పోలీసులే త్వరగా తేల్చాలని జానూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ కోరుతున్నారు. ఆ పోస్టుమార్టం నివేదిక గనుక చేతికి అందితే ఈ అదృశ్యం కేసులో దాగి ఉన్న మరికొన్ని లూప్‌హోల్స్ ,కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *