Skip to content
తెలంగాణ వార్తలు

తెలంగాణలో మరో 3 రోజులు భానుడి భగభగలు..సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు..

Prajapaksham 17 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
తెలంగాణలో మరో 3 రోజులు భానుడి భగభగలు..సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు..

Maximum Temperatures to Persist for Another 3 Days in Telangana

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు భగభగమంటూ జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. సాధారణంగా జూన్ నెలలో వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గాల్సి ఉండగా, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితులు తారుమారయ్యాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

మంగళవారం నాడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో సాధారణం కంటే 3 డిగ్రీల నుండి 6 డిగ్రీల వరకు అదనపు వేడి నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్‌లో 41.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత రికార్డవ్వగా, దాదాపు 20 జిల్లాల్లో పారాలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. రాబోయే మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

అయితే, నాలుగు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు ఊరటనిచ్చే వార్త చెప్పారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదిలితే అవి వేగంగా రాష్ట్రమంతటా విస్తరించి వాతావరణాన్ని చల్లబరుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే రానున్న మూడు రోజులలో పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *