Skip to content
జాతీయం వార్తలు

బడుల చదువులపై విశ్వాసాల నీడ

Prajapaksham 17 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
బడుల చదువులపై విశ్వాసాల నీడ

School Education Under the Influence of Belief Systems

అజ్ఞానాన్ని తొలగించే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. ప్రశ్నించడం, పరిశోధించడం, సత్యాన్వేషణ చేయడం వంటి లక్షణాలను పెంపొందించేది విద్యే. కానీ ఈరోజు విద్యకే అమావాస్య చీకట్లు కమ్ముకుంటున్నాయి. తెలంగాణలో జూన్‌12కు బదులు జూన్‌ 15న విద్యాసంస్థలను తెరవాలనీ విద్యాశాఖ నిర్ణయించింది. సవరించిన ఆ తేదీన అమావాస్య కావడంతో పిల్లలను పాఠశాలకు ఎలా పంపడమని విద్యార్ధుల తల్లిదండ్రులు, నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న బడులు ప్రారంభమైన తొలి రోజున అమావాస్య కారణంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు స్వల్పంగా నమోదైంది. అసలు కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు జీరోనే.
ప్రైవేట్‌ పాఠశాలలు అమావాస్య, మంగళవారం కారణాలు చూపుతూ రెండు రోజుల సెలవులు ప్రకటించాయి. ఈ క్రమంలో రాజకీయ నాయకులు తాము పదవులు చేపట్టేటప్పుడు, నామినేషన్లు వేసేటప్పుడు, కొత్త పథకాలు ప్రారంభించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మంచి రోజు, ముహూర్తం చూసుకుంటారు కదా? మరి పిల్లల విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడానికి మాత్రం ఇలాంటి సెంటిమెంట్స్‌ ఉండవా?అని జనం ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కూడా సెంటిమెంట్‌ తో ముడిపడిన అంశంగా మారింది. రాజకీయ నాయకులు తీరు, తల్లిదండ్రుల సెంటిమెంటును పరిశీలిస్తే…మన సమాజంలో ఇంకా శాస్త్రీయ దృక్పథం ఎంత వెనుకబడి ఉందో అర్థమవుతుంది.
అమావాస్య ఖగోళ సంఘటన
వాస్తవంగా పిల్లల విద్య, ఆరోగ్యం లేదా భవిష్యత్తుపై అమావాస్య ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని సైన్స్‌ చెబుతుంది. అందువల్ల అమావాస్య కారణంగా పిల్లలను పాఠశాలకు దూరంగా ఉంచాలని పేరెంట్స్‌ అభిప్రాయపడడం శాస్త్రీయ దృష్టిలో సమర్థించదగిన విషయం కాదు. ఖగోళ శాస్త్రం ప్రకారం అమావాస్య అనేది చంద్రుని దశలలో ఒకటి. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. ఒక దశలో చంద్రుడు భూమి, సూర్యుని మధ్యకు వస్తాడు. ఆ సమయం లో చంద్రుని వెలుతురు పడే భాగం భూమికి ఎదురుగా ఉండదు. అందువల్ల భూమి నుండి చంద్రుడు కనిపించడు లేదా చాలా స్వల్పంగా కనిపిస్తాడు. ఇదే అమావాస్య. ఇది పూర్తిగా సహజమైన ఖగోళ సంఘటన మాత్రమే. ఇందులో ఎలాంటి శుభం, అశుభం, అదృష్టం, దురదృష్టం అనే అంశాలు లేవు.
ఒకవైపు అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నాం. ఇస్రో చంద్రునిపైకి రాకెట్‌ పంపుతోంది. కృత్రిమ మేధస్సు(ఎఐ), డిజిటల్‌ విద్య, శాస్త్రీయ ఆవిష్కరణల్లో ముందుకు వెళ్తున్నాం. అయినా అమావాస్య, రాహుకాలం, వాస్తు, జాతకాల నిర్ణయాలనే ఇంకా నమ్ముతున్నాం. విద్య, ఉద్యోగం, వివాహం వంటి కీలక విషయాల్లో కూడా శాస్త్రీయ ఆలోచన కంటే భయాలు ప్రజలను గందరగోళంలోకి నెట్టుతున్నాయి. వీటి ప్రభావం విద్యార్ధులపై పడి బాల్యదశలోనే అంధ విశ్వాసాలు నాటుకుంటున్నాయి. ఇప్పటికే కొంతమంది పిల్లలు గ్రహణాలను అరిష్ట సూచకాలుగా భావించడం, భాణామతి, చేతబడి వంటి మూఢనమ్మకాలను నిజమని నమ్మడం జరుగుతోంది. అంతేకాక ఇలాంటి అవైజ్ఞానిక భావనలను మతంతో ముడిపెట్టి సామాజిక విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే విద్య మరింత అవసరమైంది. అయితే 50 రోజుల సుదీర్ఘ సెలవుల తర్వాత బడికి సిద్ధమైన విద్యార్థికి అమావాస్యను అడ్డంపెట్టి ఆపితే అతనిలోని శాస్త్రీయ ఆలోచనలను చప్పినట్లే కదా!. మూఢనమ్మకాలను పెంచి పోషించినట్లే కదా! అందువల్లనే మంచిని గ్రహించి, చెడును విడిచిపెట్టే అభ్యుదయ సమాజ నిర్మాణానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఎ(హెచ్‌) చేర్చారు. ఇదీ ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం,
పరిశోధనా స్ఫూర్తిని పెంపొందించాలనీ నొక్కి చెబుతుంది.
అజ్ఞానాన్ని తొలగించే ఆయుధం విద్యనే

అమావాస్య రోజు వ్యతిరేక శక్తి ఉద్భవిస్తుందనీ, కీడు జరుగుతుందనీ కొందరు సూడో సైన్స్‌ వాదనలు చేస్తుంటారు. ఇలాంటి వాదనలకు శాస్త్రీయ ఆధారాలు లేవని విజ్ఞానం స్పష్టంగా చెబుతోంది. అయినా సామాన్య ప్రజలతో పాటు కొందరు విద్యావంతులు సైతం ఇలాంటివి నమ్మడం ఆందోళన కలిగిస్తుంది. ఇవన్నీ కూడా వర్ణ వ్యవస్థలో ఆదిపత్య సంప్రదాయ వాదులు తరతరాలుగా ప్రజల మనసుల్లో నూరిపోసిన తప్పుడు ఆచారాలు, విశ్వాసాలు. శాస్త్రీయ ఆధారాలు లేని ఇలాంటి అంధ విశ్వాసాల ఉచ్చులో బడుగు, బలహీన వర్గాలు పడి బలవుతున్నారు. చారిత్రకంగా కుల-వర్ణ ఆధారిత అసమానతలకు ఛాందస దృక్పథమే మూలకారణం. ఈ దృక్పథమే దళిత, బహుజనులను, ఉన్నత వర్గ మహిళలను చదువు కు దూరం చేసింది. పూలే, అంబేడ్కర్‌ పోరాటం, భారత రాజ్యాంగం వల్ల అందరికీ విద్య అందుతుంది. కానీ ఆ చదువును మూఢ నమ్మకాల పరిధిలో బంధిస్తే అది మన అజ్ఞానానికి, మానసిక బలహీతకు పరాకాష్టగా మారుతుంది. సాంప్రదాయాలు, మూఢనమ్మకాల ప్రభావంతో ప్రశ్నించే స్వభావం తగ్గి, చదువు లక్ష్యం దెబ్బతింటోంది. అందువల్ల అమావాస్యను ఒక సహజ ఖగోళ సంఘటనగా, పిల్లల విద్యను అంశాలను శాస్త్రీయ ఆలోచనతో చూడడం ఆధునిక సమాజ లక్షణం. సంప్రదాయాలను గౌరవించాలి. కానీ అవి విద్యకు, అవకాశాలకు అడ్డంకిగా మారకూడదు. ప్రభుత్వ విధానాలు సైతం హేతుబద్ధంగా ఉండాలి. చీకటిని పారద్రోలీ, వెలుగు నింపే బలమైన ఆయుధం విద్య మాత్రమే. కావున తల్లిదండ్రులు అంధ విశ్వాసాలను వీడి ఆధునిక విజ్ఞానానికి బాటలు వేయండి. అప్పుడే తరగతి గది శాస్త్రీయ పౌర సమాజానికి పునాదిగా నిలుస్తుంది. – సంపతి రమేష్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *