సమానత్వం కోసం దళిత ముస్లింలు ఎదురుచూపు!
Dalit Muslims Await Equality and Constitutional Justice
భారతదేశ రాజ్యాంగం సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం అనే మూడు ప్రాథమిక సూత్రాలపై నిర్మితమైంది. రాజకీయ స్వాతంత్యం సాధించిన తర్వాత భారత సమాజంలో శతాబ్దాలుగా కొనసాగిన కులవివక్ష, అంటరానితనం, సామాజిక బహిష్కరణ వంటి అన్యాయాలను నిర్మూలించడం స్వతంత్ర భారతదేంం ముందున్న ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగ నిర్మాతలు చారిత్రకంగా అణచివేతకు గురైన వర్గాలకు ప్రత్యేక రక్షణలు, ప్రాతినిధ్య అవకాశాలు,రిజర్వేషన్లు కల్పించారు. అయితే స్వాతంత్యం అనంతరం ఏడు దశాబ్దాలకు పైగా గడిచినా, కులవివక్ష యొక్క స్వరూపం మారినప్పటికీ దాని ప్రభావం పూర్తిగా అంతరించి పోలేదు. ముఖ్యంగా మతమార్పిడులు జరిగినప్పటికీ కుల ఆధారిత వివక్షను ఎదుర్కొంటున్న దళిత ముస్లింలకు షెడ్యూల్ కుల(SC)హోదా కల్పించాలా అనే ప్రశ్న భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, సామాజిక శాస్త్రవేత్తలు, ప్రజాస్వామ్యవాదుల ముందున్న అత్యంత కీలకమైన చర్చాంశగా మారింది.
దళితముస్లింలకు షెడ్యూల్ కుల హోదా కల్పించాలనే డిమాండ్ కొత్తది కాదు. స్వాతంత్య్రం తర్వాత నుంచే వివిధ సామాజిక ఉద్యమాలు, మైనారిటీహక్కుల సంస్థలు, దళత సంఘాలు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాయి. అయితే ఈ ప్రశ్నను కేవలం రిజర్వేషన్ల కోణంతో చూడడం సరైంది కాదు. ఇది రాజ్యాంగ సమానత్వం, మత స్వేచ్ఛ, సామాజిక న్యాయం, మానవ హక్కులు, నేలమీద కొనసాగుతున్న సామాజిక వాస్తవాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఈ ప్రశ్న స్పష్టంగా బయటపెడుతోంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వాన్ని హామీ ఇస్తుంది. ఆర్టికల్ 15 మత,కులం, జాతి, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలను కల్పిస్తుంది. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని పూర్తి గా రద్దుచేస్తూ దానిని రాజ్యాంగ విరుద్ధమైన ఆచారంగా ప్రకటిస్తుంది. అదే సమయంలో ఆర్టికల్ 46 సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి రాజ్యం ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిర్దేశిస్తుంది. ఈ నిబంధనలన్నింటి ఉద్దేశం ఒకటే- చారిత్రకంగా అణచివేతకు గురైన వర్గాలను సమాజంలో సమాన స్థాయికి తీసుకురావడం.
అయితే 1950లో జారీ చేసిన “Constitution (schedule Castes) Order,1950” ద్వారా షెడ్యూల్ కుల హోదాను కేవలం హిందూ మతాని కి చెందిన దళితులకు మాత్రమే పరిమితం చేశారు. తరువాత 1956లో సిక్కు మతాన్ని, 1990లో బౌద్ధ మతాన్ని అనుసరించే దళితులను కూడా ఈ జాబితాలో చేర్చారు. కానీ క్రైస్తవ, ముస్లిం మతాలను స్వీకరించిన దళితులకు ఈ హోదా ఇప్పటికీ అందుబాటులో లేదు. ఇక్కడే ప్రధాన రాజ్యాంగ పరమైన సందేహం తలెత్తుతోంది. ఒకే సామాజిక నేపథ్యానికి చెందిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు హిందువుగా ఉంటే షెడ్యూల్ కుల హోదా పొందుతారు; మరొకరు ఇస్లాం లేదా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే అదే హక్కు ను కోల్పోతారు. సామాజిక వెనుకబాటుతనం ఒకటే అయినప్పటికీ, మతం ఆధారంగా హక్కులలో తేడా రావడం రాజ్యాంగ సమానత్వ స్ఫూర్తికి అనుగుణమా అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లభించలేదు.
దళిత ముస్లింలకు షెడ్యూల్ కుల హోదా అవసరమని వాదించే వారి ప్రధాన వాదన ఏమిటంటే, మత మార్పిడి కులవివక్షను నిర్మూలించలేదని. ఇస్లాం సిద్దాంత పరంగా సమానత్వాన్ని, సోదరభావాన్ని బోధించినప్పటికీ భారత ఉపఖండంలో చారిత్రక, సామాజిక ప్రభావాల కారణంగా ముస్లిం సమాజంలో కూడా వర్గీకరణలు కొనసాగుతున్నాయి. అశాఫ్, అజ్లాఫ్, అర్జల్ వంటి సామాజిక విభజనలు కేవలం చారిత్రక వర్గీకరణలు మాత్రమే కాకుండా, అనేక ప్రాంతాల్లో సామాజిక సంబంధాలు, వివాహాలు, వృత్తులు, మతపరమైన కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయని, సామాజిక గుర్తింపు పూర్తిగా మారడం లేదు. కుల ఆధారిత అవమానాలు, వివక్ష, అవకాశాల లోపం, పేదరికం వంటి సమస్యలు అనేక సందర్భాల్లో కొనసాగుతున్నాయి. ఈ అంశంపై జరిగిన వివిధ అధ్యయనాలు కూడా ఇదే విషయా న్ని సూచిస్తున్నాయి.2026లో విడుదలైన సచార్ కమిటీ నివేదిక భారత ముస్లింల సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసింది. ఈ నివేదిక ప్రకారం ముస్లింలలోని దిగువ వర్గాలు విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ సేవలు, ఆర్థిక అవకాశాల విషయంలో తీవ్ర వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నాయి. అలాగే న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా కమిషన్ (National Commission for Religious and Linguistic Minorities) తన నివేదికలో మత ఆధారిత పరిమితి ని తొలగించి దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు కూదా షెడ్యూల్ కుల హోదా కల్పించాలని స్పష్టంగా సిఫార సు చేసింది. కమిషన్ అభిప్రాయం ప్రకారం అంటరానితనం, సామాజిక వివక్ష అనేవి కేవలం మతపరమైన సమస్యలు కావు; అవి సామాజిక నిరాణాల్లో పాతుకుపోయిన వాస్తవా లు.
ఇక్కడ “ఫార్మల్ ఈక్వాలిటీ” మరియు“ సబ్ స్టాంటివ్ ఈక్వాలిటీ” అనే రెండు భావనలు అర్థం చేసుకోడం అవసరం. చట్టం అందరికీ ఒకే విధంగా వర్తించడం ఫార్మల్ ఈక్వాలిటీ. కానీ చారిత్రకంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించి వారిని సమాన స్థాయికి తీసుకురావడం సబ్‌స్టాంటివ్ ఈక్వాలిటీ. భారత సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో రెండో భావనకు ప్రాధాన్యత ఇచ్చింది. సమాజంలో వాస్తవ అసమానతలు కొనసాగుతున్నప్పుడు కేవలం చట్టపరమైన సమానత్వం సరిపోదని, సామాజిక న్యాయాన్ని సాధించే చర్యలు అవసరమని న్యాయస్థానం పలుమార్లు పేర్కొంది. అయితే ఈ డిమాండ్‌కు వ్యతిరేకంగా కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాల హోదా చారిత్రకంగా హిందూ కుల వ్యవస్థలోని అంటరానితనానికి పరిహారంగా రూపొందించబడిందని, కాబట్టి ఇతర మతాలకు దానిని విస్తరించడం అసలు ఉద్దేశ్యానికి విరుద్ధమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే దళిత ముస్లింలను చేర్చడం వల్ల ప్రస్తుతం ఉన్న షెడ్యూల్డ్ కులాల వాటా తగ్గిపోతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ వాదనలను పూర్తిగా విస్మరించలేము. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ వివక్ష, సామాజిక బహిష్కరణ, ఆర్థిక వెనుకబాటుతనం కొనసాగుతున్నాయని ఆధారాలు స్పష్టంగా చూపుతున్నప్పుడు, కేవలం మతం కారణంగా ఆ వర్గాన్నిరక్షణల నుండి దూరంగా ఉంచడం ఎంతవరకు న్యాయసమ్మ తం?
వాస్తవానికి ఈ చర్చ కేవలం రిజర్వేషన్లకు సంబంధించినది కాదు. ఇది భారత రాజ్యాంగం తన స్వంత నైతిక ప్రమాణాలను ఎంతవరకు అమలు చేస్తుందనే ప్రశ్న. ఒక వ్యక్తి మతాన్ని మార్చుకున్నందుకు అతని చారిత్రక, సామాజిక అన్యాయాలు ఒక్కసారిగా మాయమవ్వవు. కుల గుర్తింపులు, సామాజిక ముద్రలు, అవకాశాల అసమానతలు చాలా సందర్భాల్లో తరతరాలపాటు కొనసాగుతాయి. కాబట్టి సమస్య యొక్క మూలా న్ని అర్థం చేసుకోకుండా కేవలం మతపరమైన వర్గీకరణల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండదు.
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సామాజిక ప్రజాస్వామ్యాన్ని రాజకీయ ప్రజాస్వామ్యానికి పునాదిగా అభివర్ణించారు. సమాజంలో సమాన గౌరవం, సమాన అవకాశాలు లేకపోతే రాజకీయ హక్కులు అర్థరహితమవుతాయని ఆయన హెచ్చరించారు. నేటి దళిత ముస్లింల ప్రశ్నను కూడా ఇదే దృక్కోణంలో చూడాలి. ఇది ఒక ప్రత్యేక వర్గం ప్రయోజనాలకు సంబంధించిన డిమాండ్ మాత్రమే కాదు, భారతదేశం తన రాజ్యాంగ విలువల ను ఎంత నిజాయితీగా అమలు చేస్తుందనే విషయానికి సంబంధించిన ప్రశ్న.
సామాజిక వాస్తవాలు ఒక వైపు, చట్టపరమైన పరిమితులు మరోవైపు ఉన్న ఈ పరిస్థితిలో సమగ్ర పునర్విమర్శ అవసరం. దళిత ముస్లింల సామాజిక పరిస్థితులపై స్వతంత్ర అధ్యయనాలు, జనగణ న ఆధారిత డేటా, సామాజిక న్యాయ ప్రమాణాలు, న్యాయపరమైన విశ్లేషణల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం రాజకీయ లాభనష్టాల ఆధారంగా కాకుండా రాజ్యాంగ న్యాయం, సామాజిక వాస్తవాలు, మానవ గౌరవం అనే ప్రమాణాలపై ఆధారపడాలి.
భారత రాజ్యాంగం ఒక జీవవంతమైన పత్రం. సమాజంలో మారుతున్న వాస్తవాలకు అనుగుణంగా తన విలువలను మరింత విస్తృతంగా అమలు చేయగల సామర్థ్యం దానికి ఉంది. దళిత ముస్లింలకు షెడ్యూల్డ్ కుల హోదా కల్పించాలనే డిమాండ్‌ను కూడా అదే దృక్కోణంలో పరిశీలించాలి. మత మార్పిడి తర్వాత కూడా కుల వివక్ష కొనసాగుతున్నదనే వాస్తవం నిరూపితమైతే, ఆ వివక్షను ఎదుర్కొనే రాజ్యాంగ రక్షణలను అందించడం భారత ప్రజాస్వామ్యపు నైతిక బాధ్యత అవుతుంది.
చివరికి ఈ ప్రశ్న రిజర్వేషన్ గురించినది కాదు; సమానత్వం గురించినది. ఇది మతం గురించినది కాదు; మానవ గౌరవం గురించినది. ఇది ఒక వర్గం డిమాండ్ మాత్రమే కాదు; భారత రాజ్యాంగం ప్రకటించిన సామాజిక న్యాయ వాగ్దానం ఎంతవరకు అందరికీ చేరుతుందనే ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం కనుగొనడం భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, సామాజిక న్యాయ వ్యవస్థకు ఒక చారిత్రక బాధ్యత.
డా.షేక్ ఇస్లాముద్దీన్ (ఆల్ ఇండియా ముస్లింస్ రిజర్వేషన్ పోరాట సమితి(AI.MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు)