Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి: వైఎస్ జగన్

Prajapaksham 14 Jun 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి: వైఎస్ జగన్

This Is an Attack on Democratic Values and Freedom of Expression: YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనా తీరుపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ,ప్రతిపక్ష నేతల గళాన్ని నొక్కేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఏడాది ఆరంభంలోనే తమ పార్టీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించారని, ఇప్పుడు తాజాగా వైఎస్సార్‌సీపీ అధికారిక ఫేస్‌బుక్ పేజీని కూడా భారత్‌లో అందుబాటులో లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు. ఈ చర్యలను ప్రజాస్వామ్య విలువలపై ,భావ ప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడిగా జగన్ అభివర్ణించారు.

ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ఎండగడుతున్నందుకే తమ స్వరాలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ విమర్శించారు. ముఖ్యంగా అమరావతి రాజధాని అభివృద్ధి పేరుతో జరుగుతున్న అధిక వ్యయాలు, డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు, టీటీడీ నెయ్యి టెండర్లు ,ప్రజా ప్రాధాన్య అంశాల్లో జరుగుతున్న భారీ అవినీతికి సంబంధించిన ఆధారాలను తాము వెలుగులోకి తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి విమర్శనాత్మక సమాచారం ప్రజలకు చేరకుండా నిరోధించడం అత్యంత ప్రమాదకరమైన ,ప్రజాస్వామ్య విరుద్ధమైన ధోరణి అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారంలో ఉన్న వారిని జవాబుదారీగా నిలబెట్టడంలోనూ, రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రాన్ని పరిరక్షించడంలోనూ తమ పోరాటం ఆగదని జగన్ స్పష్టం చేశారు. బెదిరింపులు, సెన్సార్ చర్యలు లేదా ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం ద్వారా ప్రజల గళాన్ని అణచివేయలేరని ఆయన హెచ్చరించారు. ఈ అన్యాయపూరిత చర్యలను తాము చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎదుర్కొంటామని చెప్పారు. తక్షణమే తమ పార్టీ అధికారిక పేజీని పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన జగన్, లేనిపక్షంలో న్యాయపోరాటానికి సిద్ధమని తన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *