ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం వెనుక హృదయ విదారక కథ.. తండ్రిని చూడటానికి వచ్చి ఒకే కుటుంబంలో 8 మంది మృతి..
Delhi Hotel Fire Tragedy: Family Gathered for Ailing Elder, 8 Members Die in Blaze
దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో బుధవారం ఉదయం జరిగిన ఒక ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక్కడి ‘ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్’ హోటల్ రెస్టారెంట్‌లో అకస్మాత్తుగా భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో 21 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భవనానికి కేవలం ఒకే ఒక ప్రవేశ, నిష్క్రమణ మార్గం ఉండటం వల్ల మంటలు వ్యాపించినప్పుడు లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారు, ఇదే మరణాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమైంది. మృతుల్లో ఎక్కువ మంది సెంట్రల్ ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి చికిత్స నిమిత్తం ఢిల్లీకి వచ్చిన విదేశీయులేనని అధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పథకం కింద ఈ హోటల్ నడుస్తోంది.
ఈ ప్రమాదంలో గురుగ్రామ్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత కలిచివేసే అంశం. గురుగ్రామ్‌లోని సెక్టార్ 46కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ అగర్వాల్, ఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తన తండ్రి రాధే శ్యామ్ అగర్వాల్(80)ను పరామర్శించడానికి కుటుంబ సమేతంగా ఢిల్లీకి వచ్చారు. వివేక్‌తో పాటు ఆయన భార్య తర్జనీ అగర్వాల్, కుమార్తెలు జివిషా, వర్య , మరో నలుగురు బంధువులు ఈ హోటల్‌లోని రెండు గదుల్లో బస చేశారు. బుధవారం ఉదయం వీరంతా హోటల్ రెస్టారెంట్‌లో అల్పాహారం తీసుకుంటున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగి ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. ప్రస్తుతం ఆ కుటుంబంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 80 ఏళ్ల వృద్ధుడు రాధే శ్యామ్ అగర్వాల్ ఒక్కరే ప్రాణాలతో మిగిలారు. ఈ ఘటనతో గురుగ్రామ్‌లోని వారి నివాస ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో హోటల్ లోపల భయానక వాతావరణం నెలకొంది. మంటలు, పొగ దట్టంగా కమ్ముకోవడంతో భవనంలోని మూడవ అంతస్తులో చిక్కుకున్న పలువురు ప్రాణాలు కాపాడుకోవడానికి కిందకు దూకారు. ఆ సమయంలో స్థానికులు స్పందించి రోడ్డుపై పరుపులు పరచడంతో కొందరి ప్రాణాలు దక్కాయి. ఒక మహిళ తన చంటిబిడ్డను గుండెలకు హత్తుకుని 3వ అంతస్తు నుంచి కిందకు దూకగా, ఆమె కాలు విరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS), ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది, పోలీసులు , అంబులెన్సు సేవల బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపు చేస్తూనే లోపల చిక్కుకున్న పలువురిని రక్షించారు.