Skip to content
తెలంగాణ వార్తలు

Telangana Weather: తెలంగాణ వాతావరణం.. 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. నేడు భారీ వర్షాల హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Prajapaksham 23 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Weather: తెలంగాణ వాతావరణం.. 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. నేడు భారీ వర్షాల హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Telangana Weather: తెలంగాణ వాతావరణం

Telangana Weather: తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా ముఖం చాటేసిన వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. వాతావరణంలో ఏర్పడుతున్న ఉపరితల మార్పుల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారికంగా వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తుండటంతో.. ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణ వాతావరణం మీద వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర తెలంగాణ సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో నేడు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ఈ ఐదు జిల్లాలే కాకుండా.. జులై 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నిరంతరాయంగా కొనసాగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే ఒకవైపు వర్షాల పునరుద్ధరణ ఊరటనిస్తున్నప్పటికీ.. రాష్ట్రంలో నమోదు అవుతున్న వర్షపాత గణాంకాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం 33 జిల్లాల్లో ఏకంగా 24 జిల్లాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదవ్వడం గమనార్హం. రుతుపవనాల కాలం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా నందిగామలో అత్యధికంగా 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనప్పటికీ.. రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ప్రస్తుత వర్షాలు ఈ లోటును కొంతవరకైనా భర్తీ చేస్తాయని రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది.

రాబోయే వర్ష సూచనల నేపథ్యంలో అధికారులు పౌరులకు, ప్రయాణికులకు పలు కీలక సూచనలు చేశారు. పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు వాతావరణ సమాచారాన్ని గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని స్పష్టం చేశారు. వర్షం కురిసే సమయంలో పెద్ద పెద్ద చెట్ల కింద.. పాతబడిన భవనాల వద్ద నిలబడవద్దని కోరారు. ముఖ్యంగా ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం పడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో లేదా విద్యుత్ స్తంభాల వద్ద ఉండటం ప్రమాదకరమని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరే అవకాశం ఉన్నందున స్థానిక యంత్రాంగం ముందుస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలు నిరంతరం జాగ్రత్త వహించాలని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.