Skip to content
తెలంగాణ › వార్తలు

Telangana Bathukamma: బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు.. అక్టోబర్ 18న ట్యాంక్ బండ్‌పై సద్దుల బతుకమ్మ

Krishna Rao 04 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Bathukamma: బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు.. అక్టోబర్ 18న ట్యాంక్ బండ్‌పై సద్దుల బతుకమ్మ

Bathukamma Festival

Telangana Bathukamma: తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 18న ట్యాంక్ బండ్‌పై సద్దుల బతుకమ్మ ఉత్సవం జరగనుంది.

Telangana Bathukamma: తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకత గాంచిన బతుకమ్మ పూల పండగను ఈనెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు వెల్లడించారు.

ఈనెల 10 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఈనెల 18వ తేదీన సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని ట్యాంక్ బండ్‌పై వేలాది మంది మహిళలతో సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

18వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా గల అమరవీరుల స్మారక కేంద్రం నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా వచ్చి ట్యాంక్ బండ్‌పైకి చేరుకుంటారని, వీరితో పాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసే ప్రత్యేక వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు.

పండగ శోభలా రాజధాని నగరం ముస్తాబు

ఈ బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని పండగ శోభ వచ్చేలా రాజధాని నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడమే కాకుండా పలు జంక్షన్ల కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలతో అలంకరించాలని సీఎస్ ఆదేశించారు. నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ ఆడేందుకు సమీపంలోని వాడలు, కాలనీలు, బస్తీల నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశమున్నందున వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు.

ట్యాంక్ బండ్ చిల్డ్రన్స్ పార్క్‌లో ఉన్న బతుకమ్మ ఘాట్‌తో పాటు నెక్లెస్ రోడ్డులో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులను సీఎస్ ఆదేశించారు.

సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల మధ్య ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నందున ట్రాఫిక్ మళ్లింపు, బారికేడింగ్, కనీస సౌకర్యాల ఏర్పాట్లను చేపట్టాలని తెలిపారు. అమరవీరుల స్మారక కేంద్రం నుంచి ట్యాంక్ బండ్ వరకు ప్రత్యేకంగా బారికేడింగ్, లైటింగ్ సౌకర్యాలను కల్పించాలని సూచించారు.

బతుకమ్మ జరిగే పది రోజుల పాటు రవీంద్ర భారతిలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నందున అక్కడ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని టూరిజం కేంద్రాలు, ప్రముఖ ప్రాంతాల్లోనూ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు.

బతుకమ్మ ఉత్సవాల ప్రత్యేక లోగో

బతుకమ్మ ఉత్సవాలను ప్రతిబింబించేలా ఈసారి ప్రత్యేక లోగోను రూపొందిస్తున్నామని సీఎస్ వెల్లడించారు. డిసెంబరులో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను కూడా ఈ లోగోలో తెలియజేసే విధంగా రూపొందించనున్నట్టు తెలిపారు.

సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్, హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్జన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మల్కాజిగిరి సీపీ బి. సుమతి, జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) హైదరాబాద్ జోయెల్ డేవిస్, స్పెషల్ కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ ముకుంద రెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ షేక్ యాస్మీన్ బాషా, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, టూరిజం డైరెక్టర్ రంజిత్ నాయక్, శిల్పారామం, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఎ. నర్సింహారెడ్డి, ప్రత్యేక అధికారి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.