Disproportionate Assets Case: ముత్యం వెంకట రమణ.. తొలిసారి ఏసీబీకి అడ్డంగా దొరికినా మారలేదు.. కళ్లు బైర్లుగమ్మేలా అవినీతి సంపాదనతో చంచలగూడ జైలుకు..
Disproportionate Assets Case: ముత్యం వెంకట రమణ.. తొలిసారి ఏసీబీకి అడ్డంగా దొరికిన మారలేదు.. కళ్లు బైర్లుగమ్మేలా అవినీతి సంపాదనతో చంచలగూడ జైలుకు..
Disproportionate Assets Case: అవినీతి తిమింగలాలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తన ఉక్కుపాదం మోపుతోంది. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో తెలంగాణ పునరుత్పాదక ఇంధనాభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో) డివిజినల్ ఇంజనీర్ (డీఈ) ముత్యం వెంకట రమణ నివాసం.. కార్యాలయం, బంధువులు, సహచరులు, బినామీల ఇళ్లు సహా మొత్తం 7 ప్రాంతాల్లో బుధవారం ఏసీబీ బృందాలు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించాయి.
ఈ సోదాల్లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దస్తావేజుల ప్రకారం ఆస్తుల అధికారిక విలువ రూ. 27,65,02,133గా తేలగా.. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఏసీబీ చరిత్రలోనే ఇది అత్యంత భారీ అక్రమాస్తుల కేసుగా నిలిచింది.
ఏసీబీ లెక్కల ప్రకారం ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఈఎస్ఐ మందుల సరఫరా కుంభకోణంలో 2019లో అరెస్టయిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మాజీ డైరెక్టర్ దేవికారాణి అక్రమాస్తులే (అధికారిక విలువ రూ. 25.70 కోట్లు) మొదటి స్థానంలో ఉండేవి. ఆ రికార్డును తిరగరాస్తూ వెంకట రమణ ఆస్తుల విలువ డాక్యుమెంట్ల ప్రకారమే రూ. 27.65 కోట్లు దాటడం గమనార్హం.
సాధారణంగా అవినీతి అనగానే రెవెన్యూ, మున్సిపల్, ఎక్సైజ్, పోలీస్ విభాగాలు వార్తల్లో నిలుస్తుంటాయి. కానీ వారిని మించి ఐఎంఎస్, విద్యుత్/ఇంధన శాఖల అధికారులు అక్రమార్జనలో అగ్రస్థానాల్లో నిలవడం కలకలం రేపుతోంది. వెంకట రమణపై కేసు నమోదు చేసిన ఏసీబీ సిటీ రేంజ్–2 డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ నేతృత్వంలోని బృందం ప్రాథమిక విచారణలో పలువురు బినామీలను గుర్తించింది.
ఏసీబీ చేపట్టిన విస్తృత సోదాల్లో లభించిన ఆస్తుల వివరాలు:
ప్లాట్లు & వాణిజ్య భవనాలు: శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలోని నాలుగు ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలు (విలువ రూ. 1.23 కోట్లు), కూకట్పల్లి అంజనేయ నగర్లో 160 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న జీ+3 వాణిజ్య భవనం (విలువ రూ. 1.82 కోట్లు), గుట్టల బేగంపేట్‌లో 250 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న జీ+5 వాణిజ్య భవనం (విలువ రూ. 2.90 కోట్లు) లభించాయి.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు: తన భార్య పేరు మీద నమోదైన నాలుగు నిర్మాణ సంస్థల ద్వారా వెంకట రమణ రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. అంజనేయ నగర్, మూసాపేట, కూకట్పల్లి పరిధిలో రూ. 20 కోట్ల వ్యయంతో 10 అపార్ట్మెంట్లను నిర్మించినట్లు గుర్తించారు.
నగదు, బంగారం & వాహనాలు: బ్యాంకుల్లో రూ. 52.02 లక్షల డిపాజిట్లు, రూ. 40 లక్షల విలువైన 2.09 కేజీల బంగారు ఆభరణాలు, రూ. 45 లక్షల విలువైన కియా, మహీంద్రా, బలెనో కార్లు, రూ. 30 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
లిక్కర్ బాటిళ్లు: సోదాల సందర్భంగా రూ. 2.5 లక్షల విలువైన 19 విదేశీ మద్యం సీసాలు, ఒక ఐఎంఎఫ్ఎల్ సీసా లభించడంతో మాదాపూర్ ఎక్సైజ్ శాఖ ఆయనపై ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేసింది.
అడ్డదారిలో మళ్లీ పోస్టింగ్.. రూ. 28.14 కోట్లకు చేరిన మొత్తం ఆస్తులు
వెంకట రమణ ఏసీబీకి చిక్కడం ఇది రెండోసారి. గతంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సైబర్‌సిటీ సర్కిల్లో డివిజనల్ ఇంజినీర్‌గా (టెక్నికల్) పనిచేస్తుండగా.. 2019 డిసెంబర్ 12న ఒక కాంట్రాక్టర్ ఫైనల్ ఎస్టిమేట్ ఆమోదం కోసం రూ. 25 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అప్పుడు అరెస్టు అయి జైలుకు కూడా వెళ్లారు. నాటి సోదాల్లో రూ. 26.52 లక్షల నగదు, రూ. 22.60 లక్షల విలువైన బంగారం పట్టుబడింది.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అడ్డదారిలో డిప్యూటేషన్‌పై టీజీరెడ్కోలో పోస్టింగ్ సంపాదించి.. మళ్లీ పాత పద్ధతిలోనే అక్రమార్జనను కొనసాగించారు. గత కేసులోని ఆస్తులు.. ప్రస్తుత దాడుల్లో లభించినవాటితో కలిపి ఆయన మొత్తం ఆస్తుల అధికారిక విలువ రూ. 28,14,14,700 కి చేరింది. బుధవారం సాయంత్రం వెంకట రమణను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు, గురువారం ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించింది.