Skip to content
తెలంగాణ › వార్తలు

Asaduddin Owaisi: చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు రూ.2 కోట్లు లంచం ఇస్తే హంతకులకు బెయిల్… ఎంపీ అసదుద్దీన్ సంచలన ఆరోపణలు

Krishna Rao 04 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Asaduddin Owaisi: చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు రూ.2 కోట్లు లంచం ఇస్తే హంతకులకు బెయిల్… ఎంపీ అసదుద్దీన్ సంచలన ఆరోపణలు

Asaduddin Owaisi: చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు రూ.2 కోట్లు లంచం ఇచ్చి ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు నిందితుడు బెయిల్ పొందాడని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.

Asaduddin Owaisi: రాజధాని హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సీనియర్ అడ్వొకేట్ ఖాజా మొయినుద్దీన్ దారుణ హత్య కేసులో ఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. చంచల్‌గూడ జైలు కేంద్రంగా హత్య కేసు నిందితులు కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని, అక్కడ లంచాలు ఇచ్చి బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ దాడులకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

రూ. 2 కోట్లు లంచం ఇచ్చి బెయిల్ !
ప్రసంగంలో ఓవైసీ మాట్లాడుతూ… “ధనవంతులు హత్యలు చేసి, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. కేసు దర్యాప్తు అధికారి (Investigating Officer) నుండి జైలు యంత్రాంగం వరకు అంతా ఒక ప్యాకేజీలా తయారైంది. చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు రూ. 2 కోట్లు లంచం ఇచ్చి అడ్వొకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన రౌడీషీటర్ బెయిల్ తెచ్చుకున్నాడు” అని ఆరోపించారు. జైలు అధికారిపై ఎసిబి (ACB) చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

జైల్లోనే హంతకుల ‘పంచాయితీ’.. కొత్త దాడులకు ప్లాన్!
గత నెల రోజుల్లో జైలు లోపల జరిగిన పరిస్థితులపై ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు సూపరింటెండెంట్ సహకారంతో జైలులోనే హంతకులందరూ కలిసి ఒక ‘పంచాయితీ’ ఏర్పాటు చేశారని, ఒక రౌడీషీటర్‌ను తమ నాయకుడిగా ఎన్నుకుని మజ్లిస్ పార్టీ నాయకులు, అమాయకులే లక్ష్యంగా దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ‘నేను బయటకు వస్తే నేను చూసుకుంటా, నువ్వు బయటకు వస్తే నువ్వు చూసుకో’ అని జైలు గోడల మధ్యే వీళ్ళు ఒప్పందాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.

హంతకులకు సాయం చేయం.. సామాజిక బహిష్కరణ పిలుపు
ఈ తరహా హంతకులకు లేదా రౌడీషీటర్లకు మజ్లిస్ పార్టీ ఎప్పటికీ అండగా నిలబడదని ఎంపీ ఓవైసీ స్పష్టం చేశారు. “ఇలాంటి నేరస్థులను సమాజం పూర్తిగా బహిష్కరించాలి. వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు. వారి కుటుంబాలతో సంబంధ బాంధవ్యాలు, పెళ్లిళ్లు కూడా చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను” అని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటానికి, క్రిమినల్స్ కు జైలు అధికారులు సహకరించకుండా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.