Skip to content
తెలంగాణ వార్తలు

తెలంగాణకు మరో 10 రోజుల్లో నైరుతి రుతుపవనాలు.. మాన్సూన్‌పై వాతావరణ శాఖ తాజా అప్‌డేట్..

Prajapaksham 31 May 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
తెలంగాణకు మరో 10 రోజుల్లో నైరుతి రుతుపవనాలు.. మాన్సూన్‌పై వాతావరణ శాఖ తాజా అప్‌డేట్..

Beware of thunderstorms and lightning: Meteorological Department issues 'Yellow Alert' for AP and Telangana!

ఎండల తీవ్రతతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ఒక తీపి కబురు చెప్పింది. మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్నాయని, జూన్ 10 నుంచి 12వ తేదీల మధ్య ఇవి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల భానుడి ప్రతాపం తగ్గి, రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ప్రారంభం కానున్నాయి.

ప్రస్తుతం కేరళ, దాని పరిసర ప్రాంతాల్లో విస్తరించిన నైరుతి రుతుపవనాలు రానున్న నాలుగైదు రోజుల్లో తమిళనాడులోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల కారణంగా ఇవి వేగంగా ముందుకు కదులుతున్నాయి. లక్షద్వీప్, కొమోరిన్ ప్రాంతం నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవనాలు ఇప్పటికే విస్తరించాయి.

రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాల్పులు క్రమంగా తగ్గుముఖం పడతాయని అధికారులు తెలిపారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా దేహాగాన్‌లో రికార్డు స్థాయిలో 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ, రానున్న రోజుల్లో ప్రజలకు ఉపశమనం లభించనుంది. జూన్ 1 నుంచి హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు 36-38 డిగ్రీలకు, ఇతర జిల్లాల్లో 40-42 డిగ్రీలకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. జూన్ 5 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 38-39 డిగ్రీల మధ్య స్థిరపడనున్నాయి. అలాగే ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.