Skip to content
తెలంగాణ వార్తలు

మీ ఆరోపణలు ఆధారాలతో నిరూపిస్తే రాజీనామా చేస్తాం.. హరీశ్‌రావుకు మంత్రులు పొన్నం, అడ్లూరి సవాల్‌

Prajapaksham 18 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
మీ ఆరోపణలు ఆధారాలతో నిరూపిస్తే రాజీనామా చేస్తాం.. హరీశ్‌రావుకు మంత్రులు పొన్నం, అడ్లూరి సవాల్‌

We Will Resign if Allegations Are Proven”: Ministers Challenge Harish Rao

రాష్ట్ర సంక్షేమ శాఖలలో సామగ్రి కొనుగోళ్ల వ్యవహారంలో దాదాపు రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. హరీశ్‌రావు తన వద్ద ఉన్న ఆధారాలతో ఈ కుంభకోణాన్ని నిరూపిస్తే తాము తమ పదవులకు తక్షణమే రాజీనామా చేస్తామని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌లు బహిరంగ సవాల్ విసిరారు.

కరీంనగర్‌లో శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) ఛైర్మన్‌ నరేందర్‌రెడ్డితో కలిసి మంత్రులు బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంక్షేమ శాఖకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మొత్తం సెంట్రల్‌ ప్రొక్యూర్మెంట్‌ టెండర్ల విలువే రూ.2 వేల కోట్లు లేనప్పుడు, అందులో రూ.2 వేల కోట్ల మేర అవినీతి జరిగిందని హరీశ్‌రావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఇలాంటి అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, హరీశ్‌రావు ఎక్కడకు రమ్మన్నా వస్తామని స్పష్టం చేస్తూ.. చర్చకు సంబంధించిన వేదిక, సమయాన్ని ఆయనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

ఇదే సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు ఒక కీలక ప్రకటన చేశారు. ఈ నెల 21న జరగబోయే నీట్ (NEET) పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన వెల్లడించారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఈ ఉచిత ప్రయాణ సదుపాయంపై త్వరలోనే అధికారిక నిర్ణయాన్ని ప్రకటిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *