‘బయోగ్రాఫియా లిటెరేరియా’లో కోల్రిడ్జ్ తాత్విక విశ్లేషణ
Understanding Coleridge’s Literary Philosophy Through Biographia Literaria
సాహిత్యంలో ‘రొమాంటిక్’ యుగానికి చెందిన ప్రముఖ కవి శాముయేల్ టేలర్ కోల్రిడ్జ్ 1817లో రాసిన విమర్శాత్మక గ్రంథం ‘బయోగ్రాఫియా లిటెరేరియా’. దీనిని ఆయ తన జీవిత కథపై ఆధారంగా రాసినప్పటికీ, కవిత్వం, కల్పనశక్తి, మానవ మనస్సు స్వభావంపై చేసిన లోతైన తాత్విక విశ్లేషణగా ఈ పుస్తకం నిలుస్తుంది. కోల్రిడ్జ్ అభిప్రా యం ప్రకారం, కవులు తమ ప్రారంభ దశలో అత్యంత సుదీర్ఘమైన, క్లిష్టమైన పదాలు వాడతారు. కానీ సాహిత్యం లో పరిపక్వత సాధించిన తర్వాత సరళమైన, సహజమైన, స్పష్టమైన భాష వైపు మారుతారు. ఇందుకు ఉదాహరణగా జాన్ మిల్టన్, షేక్స్పియర్ లాంటి గొప్ప కవుల రచనలను పేర్కోవచ్చు.
అయితే, తాను యువకవిగా ఉన్నప్పు డే సూటిగా, పారదర్శకంగా ఉన్న భా షనే ఇష్టపడేవాడినని కోల్రిడ్జ్ చెబుతాడు. అతిగా అలంకారభరితమైన పదప్రయోగాన్ని నిరాకరించాడు. ఈ అభిరుచి తనకు ప్రాచీన గ్రీకు కవుల ప్రభావం వల్ల ఏర్పడిందని చెప్పుకొస్తాడు. అదే విధంగా విద్యపై అభిప్రాయం చెప్పే సమయంలో, ‘క్రైస్ట్ హాస్పిటల్ స్కూల్’లో తన విద్యాభ్యాసాన్ని గుర్తు చేసుకుంటా డు. అక్కడి సంప్రదాయ విద్యా విధానం, కంఠస్థం చేసే పద్ధతి, కఠిన నియమాలు, ‘ఎందుకు?’ ‘ఏమిటి?’ అని ప్రశ్నించనీయకుండా సహజ జిజ్ఞాసను అణిచివేయడం వంటి లోపాలతో ఉండేదని విమర్శిస్తాడు. నిజమైన విద్య ప్రకృతిలో జరుగుతుందని, పిల్లలు స్వయంగా అనుభవాల ద్వారా నేర్చుకోవడమే ఉత్తమమని ఆయన విశ్వసించాడు. ప్రకృతి ఆధారిత విద్య, పుస్తక కేంద్రిత విద్య కంటే గొప్పదని భావించాడు.
ప్రారంభం ప్రముఖ తత్త్వవేత్త డేవిడ్ హార్ట్లీ సిద్ధాంతాన్ని కోల్రిడ్జ్ సమర్థించాడు. హార్ట్లీ ప్రకారం, పాత అనుభవాల పునాదులపైనే కొత్త ఆలోచనలు ఉద్భవిస్తాయి. తొలుత ఈ సూత్రాన్ని అంగీకరించినప్పటికీ, ఆ తర్వాత కోల్రిడ్జ్ దీనిని తిరస్కరిస్తాడు. అతని అభిప్రా యం ప్రకారం మనస్సు అనేది యంత్రం కా దు. అది స్వయంగా సృజనాత్మక ఆలోచనలు ఉత్పత్తి చేస్తుంది. ప్రకృతి, మనిషి మధ్య సం బంధమే కొత్త ఆలోచనలకు మూలం. ఈ పు స్తకంలో కోల్రిడ్జ్ అత్యంత ముఖ్యమైన కల్పనశక్తి సిద్ధాంతాన్ని వివరిస్తాడు. ఇందులో మొ దటిది ప్రాథమిక కల్పన. అంటే ప్రతి మనిషి లో ఉండే సహజ శకి లేదా ప్రపంచాన్ని గ్ర హించడానికి అవసరమైన మౌలిక మానసిక శక్తి. రెండోది ద్వితీయ కల్పన.
కవులు, కళాకారుల్లో కనిపించే ఉన్నత స్థాయి కల్పన, దానిని వాస్తవాన్ని కొ త్త రూపంలో మలచగల శక్తి ఈ దశలో ఉంటుంది. సృజనాత్మ క రచనకు ఈ గుణం అత్యవసరం. ఇక చివరిగా జ్ఞాపకాలలోని ఆలోచనలను కేవలం కలపడం మాత్రమే మిగిలి ఉం టుంది. ఈ దశలో కొత్త సృష్టి అంటూ ఏదీ ఉండదు. సృజనాత్మకత చాలా తక్కువ. ఈ పుస్తకం ద్వారా అతను కవుల మానసిక అభివృద్ధిని, కల్పనశక్తి ప్రాధాన్యతను, ప్రకృతి సంబంధాన్ని, విశ్వ ఆధ్యాత్మిక ఏకత్వాన్ని లోతుగా విశ్లేషిస్తా డు. ఈ గ్రంథం రొమాంటిక్ సాహిత్య విమర్శలో మైలురాయి.