Skip to content
జాతీయం › వార్తలు

Delhi Protest: పోలీసులు నన్ను కిందకు తోసేసారు.. ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు.. ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల నిరసనతో ఉద్రిక్తత..

jagan 07 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Delhi Protest: పోలీసులు నన్ను కిందకు తోసేసారు.. ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు.. ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల నిరసనతో ఉద్రిక్తత..

Priyanka Gandhi Vadra

Delhi Protest: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి చేపట్టిన ‘సేవ్ ప్రజాస్వామ్యం’ నిరసన ర్యాలీ బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ‘ఓట్ల చోరీ’ జరిగిందని, ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (SIR) ప్రక్రియలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు ఈ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశం, విందు భేటీ ముగిసిన అనంతరం కాంగ్రెస్, టిఎంసి, సిపిఎం, సిపిఐ, ఆప్, ఆర్జేడీ, ఐయుఎమ్‌ఎల్ పార్టీలకు చెందిన వందలాది మంది ఎంపీలు బస్సుల్లో జంతర్ మంతర్ వైపు ర్యాలీగా బయలుదేరారు.

అయితే, ర్యాలీ మార్గమధ్యంలో అశోకా రోడ్డు , విండ్సర్ సర్కిల్ సమీపంలో ఢిల్లీ పోలీసులు భారీగా ముళ్లకంచెలు, భద్రతా బలగాలతో బస్సులను నిలిపివేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను నిరోధించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నాయకులు బస్సుల నుంచి దిగి రోడ్డుపైనే బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్ష ఎంపీలకు, పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట, గందరగోళం చోటుచేసుకుంది.

కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా , పలువురు మహిళా ఎంపీలు చేతుల్లో రాజ్యాంగ ప్రతులను పట్టుకుని రహదారిపైనే పడుకుని వినూత్నంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించిన సమయంలో ప్రియాంక గాంధీ కిందపడి గాయపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధులపై పోలీసులు దౌర్జన్యం చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు డెరెక్ ఓబ్రెయిన్, మనోజ్ ఝా సహా పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీని తీసుకువెళ్తున్న పోలీసు బస్సు టైరును కాంగ్రెస్ కార్యకర్తలు పంక్చర్ చేయడంతో కాసేపు అక్కడ విపరీతమైన రచ్చ జరిగింది. అనంతరం రాహుల్ గాంధీని మరొక వాహనంలో బారాఖంబా రోడ్డు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసు వాహనంలో నుంచి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆగేది లేదని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు తమపై ఎన్ని కేసులు నమోదు చేసినా లెక్కచేసేది లేదని, ఆ ఎఫ్‌ఐఆర్‌లన్నీ తనకు పతకాలతో సమానమని స్పష్టం చేశారు.

మరోవైపు జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో బిఎన్ఎస్ఎస్ (BNSS) సెక్షన్ 163 ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు చేయడానికి వీల్లేదని, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే నేతలను అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ మొత్తం నిరసన కార్యక్రమంలో ప్రతిపక్ష కూటమిలోని మెజారిటీ పార్టీల ఎంపీలు క్రియాశీలకంగా పాల్గొనగా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు మాత్రం గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జంతర్ మంతర్ , లూటియన్స్ ఢిల్లీ పరిసరాల్లో భద్రతా బలగాలను భారీగా మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.