Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

AP Local Body Polls: నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్ రెడ్డి.. స్థానిక సమరంలో తొలి అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ

jagan 07 Oct 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
AP Local Body Polls: నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్ రెడ్డి.. స్థానిక సమరంలో తొలి అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ

YSRCP

AP Local Body Polls: ప్రత్యర్థి పార్టీల కంటే ఒక అడుగు ముందుకేసి రాష్ట్రంలోనే తమ తొలి మేయర్ అభ్యర్థిని వైఎస్సార్‌సీపీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బరిలో వైఎస్సార్‌సీపీ తరఫున ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి పోటీ చేయనున్నట్లు పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ కీలక ప్రకటనతో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

రాబోయే స్థానిక పోరులో పార్టీని గెలుపు తీరాలకు చేర్చేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో సిద్ధం చేయడం, క్లీన్ ఇమేజ్ , ప్రజాదరణ ఉన్న బలమైన నేతలను బరిలోకి దింపడంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పార్టీ ముఖ్య నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు. తొలి మేయర్ అభ్యర్థిని ప్రకటించడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగిలిన మున్సిపాలిటీలు , కార్పొరేషన్లలో పోటీ చేసే తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా వైఎస్సార్‌సీపీ వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర, మంచి పట్టు ఉన్న ‘ఆనం’ కుటుంబ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని విజయ్‌కుమార్‌రెడ్డికి ఈ అవకాశం కల్పించారు. గతంలో పార్టీలో పలు కీలక పదవులను నిర్వహించిన ఆయనకు నగరంలో మంచి అనుచరగణం ఉంది. ప్రస్తుతం నెల్లూరు కార్పొరేషన్‌లో డివిజన్ల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ, అభ్యర్థుల వేట వేగవంతమవుతున్న వేళ, వైఎస్సార్‌సీపీ అందరికంటే ముందే తమ మేయర్ అభ్యర్థిని ఖరారు చేయడం ద్వారా నగర రాజకీయంలో మైండ్ గేమ్‌ మొదలుపెట్టినట్లయింది.